లింగ మహా పురాణము

Table of Contents

55 - యోగభేదములను మోక్ష ప్రదజ్ఞానమును పురాణపఠన శ్రవణఫలమును నిరూపించుట.

“త్ర్యంబకదేవదేవుని - సర్వార్థసిద్ధ్యర్థము యోగమార్గమున ధ్యానించుట యెట్లు? దానిని సంగ్రాహముగా వివరింపుము!” అని శౌనకాది మహర్షులు ప్రశ్నింపగా - సూత మహాముని చెప్పఁదొడఁగెను.

సూర్య సన్నిభుఁడగు సనత్కుమారుఁడు - మీరడిగినట్లే మేరు శిఖరమున ప్రశ్నింపగా - నందికేశ్వరుడు నిర్వచించిన రీతిని - త్ర్యంబక దేవుని యోగమున ధ్యానించు విధానమును వివరించుచున్నాను.

పూర్వము - గిరిపుత్రికయగు పార్వతీదేవి శివునితో నేకశయ్యయందుండినదై మహాదేవుని దిగువవిధము ప్రశ్నించెను. యోగము ఎన్ని విధములు గలది? దాని నెట్లు చేయవలెను?

ప్రాణులను బంధవిముక్తుల నొనర్చు జ్ఞానము ఎట్టిది?

అంత మహేశ్వరుఁడు దిగువవిధము ప్రబోధించెను. మంత్రయోగము,  స్పర్శయోగము. భావయోగము అభావయోగము, మహాయోగంబు పంచవిధంబులగును.

ధ్యానముతో కూడిన జపము - మంత్రయోగమగును. ప్రాణాయామముతో ప్రాణవాయువును జయించుట - స్పర్శయోగమునఁబడును. మంత్ర స్పర్శయోగముల నతిక్రమించి మనస్సును మహాదేవునియందు నిలిపి - బహిరంతః స్పురణము లేకుండా -స్థిరపఱచుట - భావయోగ మనఁబఱగును. (భావయోగము వలన చిత్తశుద్ధి కలుగును.)
చరాచర ప్రాణిభరితమగు జగత్తును శూన్యమొనర్చి - స్వరూపమును మాత్రము చింతించుట. అభివయోగ మగును.

మహాయోగమనగా-

రూపరహితము పరిశుద్ధము సుశోభనము అనిర్దేశ్యము సదా ప్రకాశమానము స్వయంవేద్యంబు నగు పరశివ తత్త్వము గోచరించుట. మహాయోగ మగును. మహాయోగముఁదక్క. ఇతర యోగచతుష్టయము - శివజ్ఞాన సాధన మగును.

ఈ ఐదు తెఱుఁగులలో ఒక దాని కన్న - మరియొకటి శ్రేష్ఠ మగును.

సాధకుడు - ఈ యోగములను సిద్ధింప cజేసికొనినచో ప్రారబ్ధము నతిక్రమించి ఆనందమయ దివ్యశరీరము నందు ప్రకాశించువాడగును.

 ఈ యోగరహస్యమును బ్రాహ్మణుఁడు, ఆహితాగ్ని, ధార్మికుఁడు,  కృతఘ్నుఁడుకానివాడు నగు శిష్యునకు - గురువు - ప్రథమాది క్రమముగ  నుపదేశింపవలెను. ఆచార్యుఁడు గూడ - బ్రాహ్మణ్యాది లక్షణములు కలిగి యుండవలెను.

శిష్యుఁడు - పై లక్షణములే గాక గురుభక్తి - దైవనిష్ఠయు కలిగి - సర్వసంగపరిత్యాగియై శివభక్తుఁడునై శివపరాయణుఁడై శ్రౌత స్మార్త విశారదుఁడై పుణ్యాత్ముడునై యుండవలెను.

 అట్టివాడే యోగసాధన యోగ్యుడుగాన గురువు శిష్యుని పరీక్షించి యోగము
సుపదేశింపవలసియుండును.”

ఇయ్యది - సర్వవేదములనఁబడు కమలమునందలి మకరందము గాన నీ యోగామృతమును త్రాగినచో ముకుఁడగును.

ఇట్టి పంచవిధ యోగము - భస్మరుద్రాక్ష మంత్ర లింగ ధారణాత్మకమగు పాశుపత వ్రతము గలది కొవలెను. దీని సత్యాశ్రమ మందురు. ఇట్లు మహేశ్వరుఁడు - దేవికి ప్రబోధించి యామెను సంప్రదించియు శంకుకర్ణుని ద్వారమునందు నియోగించి  నిజరూపధ్యానపరుడాయెను.

నందికేశ్వర ఉవాచ :-

అందువలన - సనత్కుమారా! నీవు గూడ శివధ్యాన యోగమును - తత్ప్రధానమగు
పాశుపత వ్రతమును స్వీకరించి యభ్యసింపుము!

భస్మస్నానమును నిత్యము చేయుచు - మొదట - శివలింగ పీఠముగా నుండు శ్రీహరిని ధ్యానించి తరువాత శివుని ధ్యానింపవలెను.

ఇట్లు నందికేశ్వరుఁడు భస్మనిష్ఠుడై సనత్కుమారునకు ఉపదేశింపగా - నా
బ్రహ్మమానసపుత్రుడు - వేదవ్యాసునకు ప్రబోధించెను. నేనా బాదరాయణుని వలన గ్రహించితిని.

బ్రాహ్మణోత్తములారా! మీ సాంగత్యముతో నేనీ లింగ మహాపురాణమును ప్రవచించు భాగ్యము గలవాడ నైతిని గాన వేదవ్యాసునకు, మీకు, మీ సత్రమునకు నమస్సులర్పించుచున్నాను.

ఈ గ్రంధము - ఏకాదశ సహస్ర (11000) శ్లోకములు, 163 అధ్యాయములు గలదై
పఠించువారికి వినువారికిని - ధర్మకామ అర్ధ మోక్షములను సిద్ధింపఁజేయును.

అంత - శౌనకాది మహర్షులండరు - లింగరూప శివునందు ఏకాగ్రభక్తి గలవారై - - ప్రీతితో గగుర్పాటులఁజెందిన వారునై పరమేశ్వరునకు మ్రొక్కులిడిరి.

శ్లో॥ లైం గు మాద్యంత మఖిలం - యః పఠేచ్ఛృణుయాదపి । ద్విజే భ్యః శ్రావయేద్వాఽపి – స యాతి పరమాంగతిమ్ ॥

సమగ్ర లింగపురాణము నాద్యంతము పఠించువాడు, ఆసక్తితో వినువాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు వినుపించువాడును - ఉత్తమగతి ననఁగా - శాశ్వత శివసాయుజ్యము నొందుదురు. తపస్సుచేతను యజ్ఞముచేతను దానముతోడను రుద్రాధ్యాయాది వేదాధ్యయనము చేతను కలుగు ఫలము - లింగపురాణ పఠన శ్రవణాదుల వలన లభించును.

కర్మసముచ్చిత - ఉపాసనాత్మక జ్ఞానము, శివునండు ఏకాగ్రభక్తియు - శివానుగ్రహసాధనమగు శక్తి భక్తియు సిద్ధించుగాక! ప్రారబ్ధాంతమున శివసాయుజ్యము చేకూరుగాక! వక్తయగు సూతమునికి శ్రోతలగు శౌనకాదినుహర్షులకును శివానుగ్రహము ప్రసరించుగాక! పఠిత యొక్క శ్రోతయొక్కయు వంశమున - అక్షయ విద్య, ప్రమాచరాహిత్యము సంభవించు గాక! అని బ్రహ్మదేవుఁడు ఆశీర్వదించెను.

“తీర్థయాత్రా పరుడైన నారదమహర్షికి దీనియందు గల ఆసక్తికి - మిగుల సంతోషించితిమి.” అనిశౌనకాదులు నుడువగా - నారదుడు - తన శోభనములగు హస్తములతో సూతుని స్పృశించి - నీకు శుభము, మహాదేవునందు భక్తి శ్రద్ధలును మాకు - శివభక్తి - పెంపొందుగాక!

ఈ గ్రంధమున ప్రతిపాడ్యుడగు పరశివునకు వందనము.

కలియుగగతాబ్దములు 5102, శాలివాహనశకము 1923 ప్రభవాదిపంచదశమగు వృషనామ సంవత్సరమున 28 - 1 - 2002 పౌష పూర్ణిమ సోమవారమున పుష్య నక్షత్ర కర్క రాశియందు చంద్రుడుండగా - మిథున లగ్నమున - గురువు లగ్నగతుఁడుకాగా – ఉత్తరాయణమున - హేమంత ఋతువునందు - శుక్రహోరయందు -  శివరామప్రేరితుఁడనై - పండిత ప్రకొండామోదభరితుఁడనై యథామతి - శివ ప్రీత్యర్ధము సమగ్రలింగమహాపురాణము ననువదించితిని.

ఇయ్యది - శివ విజ్ఞాన వీచిక “యను శాంకరీయ ఆంధ్రానువాదమున - 55 వ
అధ్యాయము - ఉత్తర భాగముతో సహ లింగపురాణము సమగ్రంబు సమాప్తము.

* * * * *