లింగ మహా పురాణము

Table of Contents

15 - అఘోర మంత్రో పాసన నిరూపణము

సూత ఉవాచ:

సూతుఁడు వక్కాణించెను.
బ్రహ్మదేవుని ప్రార్థనచే సంతుష్టుడైన అఘోరుఁడు ఇట్లు వచించెను. “బ్రహ్మహత్య మొదలగు
ఘోర పాతకములను ఇతర దురితముల నన్నిటిని, మానసికములు వాచికములు కాయికములు నగు పాపములను బుద్ధిపూర్వక కృతములు సహజములు ఆగంతుకములు మాతృ పితృ దేహస్థితములు నగు అఘముల నీ అఘోర మంత్రమును జపించుట వలన పోగొట్టుదును. జప సంఖ్యాఫలము నాలకింపుఁడు! “అఘోరేభ్యో” ఇత్యాది మంత్రమును లక్ష జపించినచో - బ్రహ్మహత్యా పాపము నశించును. 50 వేలు జపించినయెడల వాచిక (వాక్కుతో ఘటించు) పాపములు, 50 వేలు జపించినచో మానసిక పాపములు నివారించును. బుద్ధిపూర్వక కృత పాపములు పోపులుకు నలుబది వేలు జపించవలెను. కోపముచే చేయబడుడురితములు ఎనుబది వేలు ( 80,000) జపములో తొలగును.
వీరహంతకుఁడు లక్ష, గర్భస్థ శిశుహంతకుఁడు కోటి జపించవలెను. తల్లిజంపినవాడు కోటి జపించవలెను. గోహంతకుఁడు, కృతఘ్నుఁడు (చేసిన మేలును కీడుగా భావించి ప్రతీకారము చేయువాడు) స్త్రీ హంతకుఁడును పదిలక్షలు జపించినచో పాపనిర్ముక్తులగుడురు.

మద్యపానమును తన ఇష్టముతో లేక ఇతరుల బలిమితో గావించువాడు లక్ష జపించవలెను. స్నానమును చేయక భుజించువాడు జపము నొనర్పక భుజించువాడును, హవనమును గావింపక భుజించువాడును, దేవతలకు అతిథులకు బ్రాహ్మణులకు అన్నమును సమర్పింపనివాడును ప్రత్యేకము సహస్ర జపములో పాప విముక్తులగుదురు.

బ్రాహ్మణ ద్రవ్యము నపహరించువాడు, బంగారమును దొంగిలించువాడు, లక్ష మనస్సులో జపించినచో విశుద్ధులగుదురు.

గురుభార్యా సంగముడైనను తల్లి జంపినవాడైనను బ్రహ్మ హంతకుఁడైనను ఈ అఘోర మంత్రమును మానసికముగా లక్ష జపించిన యెడల పరిశుద్ధులగుదురు. పై పాతకులతో కూడ నుండువాడును మహా పాపులతో సమానుఁడగును. ఐనను ఈ సంసర్గి-పదివేలు జపించి పరిశుద్ధుఁడు కావచ్చును.

బ్రహ్మహత్య సురాపానము సువర్ణస్తేయము గురువారాగమనము అను మహాపాపములను బ్రాహ్మణుడు చేసినచో ఆతడు రుద్రగాయత్రితో గోమూత్రమును మంత్రించి “గంధధ్వారాం” అను మంత్రముతో గోమూత్రమునండు గోమయము (ఆవుపేడ)ను “తేజోఽసిశుక్రం” అను మంత్రముతో ఆవు నెయ్యిని, “ఆప్యాయస్వ” అను మంత్రముతో ఆవుపాలను, “వధి క్రావ్ణో” అను మంత్రముతో ఆవుపెరుగును “ దేవస్య త్వా” అను మంత్రముతో కుశ (దర్భ) జలమును కలుపవలెను. బంగారము వెండి రాగి కమలదళము, మోతుకు ఆకు అనువానిలో నేడే నొకదానిని పాత్రగా చేసి (చేయించి) దుర్భ కూర్చను అందుంచియు బంగారమును వేసియు అఘోరమంత్రమును లక్ష జపించి ఘృతము చరుపు (వండిన అన్నము) సమిధలు (మోతుకు కట్టేసునకలు) నువ్వులు యవలు వడ్లు అనువానిలో ఒక్కొకదానిలో ఏడు పర్యాయములు హవనము నొనర్పవలెను. చరువు మున్నగు నవి అందు బాటులో లేనిచో ఘృతముతోడనే హవనముఁ జేయవచ్చును. దీని నంతయు అఘోరమంత్రముతో చేయవలెను. ఘృతముతో ఆఘోర దేవత (శివలింగము) సభిషేకించి మరల సఘోరమూర్తిని శుద్ధజలముతో నభిషేకించి తుడువవలెను. ఇట్లు చేయువాడు- అహోరాత్ర (24గంటలు) ఉపవాసియై స్నాతుడునై గోమూత్రాది పంచగవ్యమును కూర్చి (దర్భముడి)తో శివుని ముందు పుచ్చుకొనవలెను. తరువాత ఆచమనముఁ జేసి గాయత్రీ మంత్రమును యథాశక్తి జపింపపలెను. ఇట్లు చేసినచో శివభక్తులు ఆచరించిన మహా పాతకములు ఉపపాతకములు సాధారణదురితములు మానసిక వాచిక కాయికములు. జన్మాంతర శతకృతంబులన్నియు నశించును. అఘోర మంత్ర విధానమును పురస్కరించుకొని ఈ ప్రాయశ్చిత్తవిధి నిరూపింపబడినది. వాచికము ఉపాంశువు (నాలుకపై తనకు మాత్రము వినవచ్చునట్లు చేయఁబడు జపము) మానసికము అను త్రివిధజపములలో మానసికమున కన్న ఉపాంశువు; ఉపాంశువు కన్న వాచికము పదిరెట్లు ఎక్కువ జపించవలెను. నిత్యము అఘోర మంత్రము నష్టోత్తర శతమైనను (108) సహస్రమైనను (1000) జపించుచుండినచో ప్రాయశ్చిత్తము లేకయే పరిశుద్ధుఁడు కావచ్చును.

ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రాను వాదప్రవచనమున

(15) పదునైదవ యధ్యాయము.