లింగ మహా పురాణము
27 - జయాభిషేకమును షోడశ మహాదానములను నిరూపించుట
“నందికేశ్వరుప్రోక్తమగు శివలింగారాధన ప్రాశస్త్యము శ్రుతి సమ్మతమైనదని నీవు చెప్పగా నాలకించితిమి. జయాభిషేకమును షోడశమహాదానములను వినఁగోరుచున్నాము.” అని శౌనకాదులు అడిగి నందున. సూతుఁడు దిగువవిధము వక్కాణించెను.
పూర్వము స్వాయంభువ మనువు - జీవచ్ఛ్రాద్ధమును నెరవేర్చుకొని – మేరుశిఖరమున కేగి - తపింపగా - మహాదేవుఁడు ప్రసన్నుఁడై సాక్షాత్కరించినందున - నాతఁడు ప్రణమిల్లి దోసిలొగ్గియు కంఠస్వరము సంతోషాతిశయమున తడుఁబడుచుండగా పరమేశ్వరుని నుతించి “జయాభిషేకముఁదగు విధానమును వివరింపు” మని ప్రార్థించెను.
అంత పరాత్పరుఁడు కరుణించి - క్షత్రియ రాజుల హితమునకై జయాభిషేకవిధానమును చెప్పఁదొడఁగెను.
అపమృత్యువును తొలగించి సర్వశత్రువిజయము నాపాదించు నీ జయాభిషేకమును రాజునకు గావించి రణరంగమున పగతురతో పోరాడుటకు పంపినచో విజయము సంప్రాప్తమగును.
ఒకానొక సలక్షణమగు మంటపము నేర్పరచి - తన్మధ్యప్రదేశమున పద్మాకారముగా ముగ్గు లేసి - ముగ్గుపై పీఠము నుంచి దానిపై సహస్రకలశములను స్థాపించవలెను. కలశములను సువర్ణముతో - లేక - వెండితో - లేక రాగితో యథాశక్తి నిర్మింపజేయవలెను. ఒక్కొక్క కలశమునకు రెండేసి వస్త్రములను చుట్టవలెను.
సహస్ర మధ్యకలశమునపై శివలింగమును “తత్పురుషాయ విద్మహే – మహాదేవాయ ధీముహి - తన్నోరుద్రః. ప్రచోదయాత్” అను రుద్రగాయత్రీ మంత్రముతో నెలకొలిపి - శివకలశవామ భాగమున సర్ధనీ కలశముపై “గణాంబికాయై విద్మహే - మహాతపాయై ధీమహి - తన్నోగౌరీ ప్రచోదయాత్” అను గౌరీ గాయత్రీ మంత్రముతో పార్వతీదేవిని స్థాపించి పూజింపవలెను.
కలశములన్నిటిలో - శ్రీ గంధము పంచరత్నములు గోమూత్ర గోమయ ఘృతదధి క్షీరాత్మక సందగవ్యములు అనువానిని శుద్ధోకమును నింపి - పూజించియు -రుద్రాధ్యాయముతో - సహస్ర కలశోదకమును దర్భతో రాజుపై చల్లవలెను. అఘోరమంత్రముతో హవనంబు నొనర్పవలెను.
రాజును కిరీటాద్యాభరణములతో నలంకరించి పట్టుబట్టలను కట్టింపఁజేసి సంతోషింప జేయపలెను. ఆచార్యునకు ఋత్విక్ బ్రాహ్మణులకును శివభక్తులందరికిని సువర్ణ వస్త్రాదులను రాజు సమర్పించవలెను.
తరువాత పరమేశ్వరునకు మహాపూజనము నొనర్పవలెను. ఇట్టి జయాభిషేకముతో దేవేంద్రుఁడు స్వర్గాధిపతిగా, ‘బ్రహ్మదేవుఁడు సృష్టికర్తగా, విష్ణుమూర్తి జగద్రక్షకుఁండుగా, అంబిక శివార్ధాంగిగా, సావిత్రీదేవి, లక్ష్మీదేవి, కాత్యాయనియు అతులసౌభాగ్యవతులుగా నుండగలిఁగిరి.
రుద్రాధ్యాయముతో జయాభిషేకము నొనర్చుకొనుటచే నందికేశ్వరుఁడు మృత్యువును జయించెను. తారకాసురుఁడును మహాబలవంతుఁడాయెను. నృసింహస్వామి - హిరణ్యకశిపుని వధింపఁగలిఁగెను.
కుమారస్వామి తారకాది రాక్షసులను సంహరింపఁగలిగెను, కౌశికీదేవి - సుందోపసుందుల కుమారులగు వసుదేవ సుదేవులను వధింపగలిగెను. దేవతలు అసురుల నోడింపఁగలిఁగిరి. భూసురులనేకు లీ జయాభిషేకముతో శ్రోత్రియులై శివధ్యానమును చేయగలిగిరి. దీని వలన అపమృత్యువులన్నియు తొలగుటేగాక మహామత్యువు - ప్రాణి యొక్క ఇష్ట ప్రకారము సమీపించి అనాడూస మరణమును కలుగఁజేయును.
జయాభిషేకము వలన శతకోటికల్పములయందు చేయఁబడిన పాపమునంతయు రాజు పోగొట్టుకొనును. మరియు క్షయకుష్ఠాది రోగబాధితుఁడైనను వ్యాధి నిర్ముకుఁడై శత్రురాజులఁ గెలిచియు పుత్రపౌత్రాది సంపన్నుడై ప్రజాసురాగముఁబడసియు అపరదేవేంద్రునివలె భువి నానందపడుచు ధర్మాత్మురాలగు భార్యతో సుఖముగా జీవింపఁగలుఁగును.
ఇట్లు “రాజులకు ప్రజలకు సుపకరించుటకై జయాభిషేకవిధానమును సంక్షిప్తముగా చెప్పితి”నని స్వాయంభువ మనువునకు పరమేశ్వరుఁడు ప్రబోధించి విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (27)వ యధ్యాయము.
