లింగ మహా పురాణము

Table of Contents

75 - శివుని నిరాకార సాకార స్వరూపములను నిర్దేశించుట

శౌనకాది మహర్షులు –

“పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్మలుడు, నిత్యుడును గడా! సాకారత్వము నెట్లు (ఎంచుకు) పొందెను ? ఇవ్విషయమును నీవు వినినవిధముగా వచింపుము !” అని ప్రశ్నింపగా ---

సూతముని చెప్ప దొడగెను.

“పరమేశ్వరుడు ప్రణవ (ఓంకార) స్వరూపుడని కొందరు; వేదాంతవిజ్ఞాన స్వరూపుడని మరి కొందరు, శబ్దస్పర్శ రూప రస గంధాత్మకములగు విషయములను యథాతథముగా గుర్తించు తెలిని (జ్ఞానము) అని అన్యులు నిరూపించిరి. కాని శివుని సాక్షాత్కరింపజేయునట్టి జపపూజాస్తోత్రధ్యానాత్మకంబు నగు ఉపాసన (జ్ఞాన) మే పరమేశ్వరుడగునని వేడవ్యాసమహర్షి నిర్ధారించెను.

ఇట్టి జ్ఞానమువలననేమోక్షము లభించును. జ్ఞానము కలుగుటకు శివానుగ్రహము సాధనము కాగా - నిష్కామకర్మాచరణరూపమగు భక్తితో చిత్తశుద్ధిద్వారా శివానుగ్రహము ప్రసరించును.

ఇక పరమేశ్వరుని విరాట్ స్వరూపము ఎట్టిదనగా ?

స్వర్గము- శిరస్సుగా; క్షేత్రరూపమైన భూలోకము నాభిగా; సూర్య చంద్రాగ్నులు నేత్రములుగా; దిశలు చెవులుగా; పాతాళము పాదములుగా; సముద్రము వస్త్రముగా; దేవతలందరు భుజములుగా నక్షత్రములు భూషణములుగా; ప్రకృతి భార్యగా; పురుషుడు జననేంద్రియముగాను సదాశివుడు విశాల విశ్వరూపము కలిగియుండును.

ఇక అట్టి విరాట్ పురుషుని నోటి నుండి బ్రహ్మదేవుడు, బ్రాహ్మణులును; భుజముల నుండి ఇంద్రోపేంద్రులు, క్షత్రియులును; ఊరువు (తొడ) లనుండి వైశ్యులు; పాదముల నుండి శూద్రులు నుదయించిరి. మరియు నా విశ్వరూపునకు-

పుష్కరావర్తకాది మేఘములు వెంట్రుకలుగా నుండెను. మరియు నా మహాపురుషుని నాసిక (ముక్కు) నుండి వాయువులు సంభవింపగా శ్రుతిస్మృతి ప్రోక్తమగు కర్మము గమనముగా నుండెను.

ఇంతియే గాక సృష్టికాలమున ప్రకృతిని ప్రేరేపించు పరనూత్మ పూర్వోక్తమగు కర్మసముచ్చిత జ్ఞానముతోడనే లభించును. కామ్యకర్మవలన గాని, ఇంద్రియ విషయజ్ఞానాదులచే గానీ గమ్యుడు కాడు. ఇంక ఉపాసనాత్మక జ్ఞానము కర్మతపోజపధ్యానరూపముగా చతుర్విధంబగును.

నిష్కామకర్మాచరణ సహస్రముల కంటె తపోయజ్ఞము శ్రేష్ఠము; తపోయజ్ఞ సహస్రములను మించినది జపయజ్ఞము కాగా వేలకొలది జపయజ్ఞముల కన్న గొప్పది- ధ్యానయజ్ఞమగును. ధ్యానయజ్ఞమును మించినది మరియొకటి లేదు. ధ్యానమే శివసాక్షాత్కారమునకు పరమసాధనము;

తపోయజ్ఞమనగా రుద్రాధ్యాయాది పఠనము;

ధ్యానయజ్ఞమనగా “చిదానందరూపః శివోఽహం – శివోఽహమ్” అని నిశ్చలమైన మనస్సులో నొక ముహూర్త(24 ని.) కొలము భావించుట. లేక నొక క్షణకాలము చింతించుట.

ధ్యాన యజ్ఞము నొనర్చువానికి ఏనాటికైనను శివుడు మనస్సులో సాక్షాత్కరించును. ధ్యానయజ్ఞసిద్ధిచే విశ్వమును శివమయముగా భావించువారికి ప్రాయశ్చిత్తాదులు ఉండవు గాన వారు సదా శుద్ధులుగా నుందురు. మరియు కర్తవ్యము, సుఖము, దుఃఖము, ధర్మము, అథర్మంబు, జపము, హోమము, శివజ్ఞానులకు అవసరము లేదు.

శివలింగము బాహ్యమనియు, ఆభ్యంతరమనియు రెండు విధములు- మృచ్ఛిలాది నిర్మితము బాహ్యమగును. ఇయ్యది స్థూలమనబడును. పరానందాత్మకము- అభ్యంతరమై సూక్ష్మమగును. సూక్ష్మము శివాఖ్యమై శివయోగుల హృదయ స్థానమున ఇష్టలింగముగా విరాజిల్లుచుండును. స్థూలము కర్మనిష్ఠగల జనులచే పీఠాదులపై పూజింప బడుచుండును. మనస్సులో ఆరాధింపబడునదియు సూక్ష్మలింగమగును. దీనినే ప్రాణలింగమని భావింపవచ్చును. సూక్ష్ములింగమును హృదయములో దర్శింప జాలనివారు - మొదట స్థూలలింగమును నియమనిష్ఠలతో పూజించినచో కాలక్రమమున
సూక్ష్ములింగారాధనము అలవడును. ఆ పిదప భావలింగము జ్యోతిర్మయముగా భాసించును.

సూర్యుడొకడే యైనను జలాధారములయందు వేరువేరుగా కనుపడునట్లు -
సచ్చిదానందమయుడగు శివుడొక్కడే స్థూల సూక్ష్మలింగములయందు కరచరణాద్యవయవ విశిష్ట విగ్రహములయందును భిన్న భిన్న లక్షణములతో గోచరుడగుచుండును. తథైవ లోకమున జాతివ్యక్తి భేదముతో ప్రాణులు వివిధరూపులుగా నుందురు.

కనబడునది, వినబడునదంతయు శివాత్మకంబని తెలియవలెను. స్వప్నమున నానావిధభోగముల ననుభవించుచు తృప్తిపడుటయు; మరియు నదే స్వప్నమున అనేక సంకటములను చూఱగొనుచు బాధపడుటయు కలుగును. కాని వస్తుతః జాగ్రదవస్థయందు అట్టి సుఖదుఃఖములుండనట్లు పరమేశ్వరుని సాక్షాత్కారమైనచో జాతి వ్యక్తి భేద మెంతమాత్రముండజాలదు.

సంసారులగువారి హృదయస్థానమునందు పరమేశ్వరుడు సూక్ష్మ (చిన్న) ఇష్టలింగముగాను, లోన జ్యోతిర్మయమగు ప్రాణలింగముగాను భాసించుచుండును. నిరాభారులైన శివయోగులు తమ హృదయాంతరాళమున ప్రకాశించు జ్యోతిర్లింగమును కరపీఠస్థిత ఇష్టలింగమునందు నిరంతరము గాంచుచు శివానందానుభూతి గలవారగుదురు. మరియు-

సర్వజ్ఞుడైన పరశివుని తమ హృదయమునందు శివలింగమునందు సూర్యునిలోను భావించుచు ఆరాధించుచుందురు.

శ్లో॥ యథా శివ స్తథా దేవీ-యథా దేవీ తథా శివః । తస్మా దభేదబుద్ధ్యైప- శివం దేవీం యజే న్నరః ॥

“శివుడెట్టివాడో దేవియు అట్టిదేను; దేవి ఎంతటి మహిమ గలడో శివుడు నంతటి సామర్థ్యము గలవాడు. గాన ఇరువురిలో భేదము లేదని భావించి శక్తి శివుల నారాధింపవలెను. కాని ముందు శివుని, తరువాత దేవిని పూజింపవలసియుండును.

శివుడు ప్రకృతి పురుషాత్మకుడని కొందరు; బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడని మరికొందరు. జగజ్జన్మస్థితిలయకారకుడగు నాలుగవ మహాపురుషుడని కొందరు భావించు చుందురు.

ధర్మాత్ములైన భూసురులు ఏకాగ్రభక్తితో శివునినే పూజింతురు. (ఇట్లు చెప్పుటచే శివారాధనమే బ్రాహ్మణులకు ముఖ్యమైనదని తేట పడినది.)

భ్రూమధ్యస్థానమున దేవితో కూడ శివుని దర్శించువారు మాత్రము అదే జన్మాంతమున శివసాయజ్యము నొందుదురు. ఇతరులైన శివోపాసకులైతేనో విలంబ (ఆలస్య) ముగా ముక్తులగుదురు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (75)వ అధ్యాయము.