లింగ మహా పురాణము

Table of Contents

24 - తంత్రోక్త శివపూజా విధానము

పసుపుతో కూడిన వేడినీటితో - శివలింగమును పీఠముతో సహ శోధించి - గంధ హిరణ్య మంత్ర జలముతో రుద్రాధ్యాయమును పఠించుచు – నీలరుద్రత్వరితరుద్ర పంచ బ్రహ్మమంత్రాడులతో “నవఃశివాయ” మంత్రముతోడ నభిషేకింపవలెను.

అభిషేక సమయమున శివలింగశిరస్సునండు పుష్పమునుగాని బిల్వడళమును గాని యుంచవలెను. శివలింగ మస్తకము శూన్యము కారాడని దిగువ శ్లోకము నొక్కి వక్కణించినది.

శ్లో॥ యస్య రాష్ట్రే తు లింగస్య మస్తకం శూన్య లక్షణం ।

 తస్యాలక్ష్మీ ర్మహారోగో - దుర్భిక్షం వాహనక్షయః ॥

 “ఎవని రాష్ట్రమునందు శివలింగము శూన్యమస్తకముగ నుండునో, అట్టి రాజునకు - దారిద్ర్యము, మహారోగము, దుర్భిక్షము (కఱువు) గజాశ్వాది వాహనక్షయంబు సంభవించును.”

అందువలన రాజు - తన రాష్ట్రములో గల శివాలయముల యందలి శివలింగములు శూన్యమస్తకములు కారాదని ప్రజలను శాసింపవలెను. ఒకవేళ అట్లు శాసింపనిచో రాష్ట్రము ప్రజలును కాలక్రమమున క్షీణింతురు.

 అభిషేకానంతరము - ఆర్ఘ్యము నొసగి - శుభ్రవస్త్రముతో తుడిచియు “ఓం నమః శివాయ” మూలమంత్రము నుచ్చరించుచు వస్త్రమును శ్రీ గంధమును శుభ్రాక్షతలను నలంకారాదులను ధూపదీపాచమునీయ నైవేద్యములను సమర్పించి -  మంగళ నీరాజనమును శివలింగ మధ్యన లింగము క్రిందను చూపియు మంత్రపుష్పమును సమర్పింపవలెను.

పూజా ప్రారంభమున గణాధిపతిని పూజించినయెడల - శివారాధనము నిర్విఘ్నముగా సంపూర్ణమగును. గురువును కూడ నర్చింపవలెను.

యః శివం పూజయే దేవం - లింగే వా స్థండిలేపి వా

 స యాతి శివసాయుజ్యం - వర్షమాత్రేణ కర్మణా ॥

“శివలింగమునందు గాని స్థండిలస్థాపితాగ్నియందుగాని పూర్వోక్త విధానమున శివమూర్తి నొకసంవత్సరము పూజించువాడు - శివసాయుజ్యము నొందును. శివలింగము  నారునెలలు పూజించినచో శివసాయుజ్యము లభించునని - మరియొక నిర్వచనము.

పూజాంతమున శివలింగపీఠమునకు ఏడు తడవలు - ప్రదక్షిణముజేసి -  సాష్టాంగముగ నమస్కరింపవలెను.

 ప్రదక్షిణమున నొక్కొక అడుగు వలన శత అశ్వమేధయ  ఫలము చేకూరును. ఇట్లు నిత్యము సావధానముగా శివునర్చించినచో భోగార్థికి భోగము; రాజ్యార్థికి రాజ్యము; పుత్రార్ధికి తనయుఁడు; రోగవిమోచనార్థికి వ్యాధినివృత్తియు; సమస్తవాంఛిత సిద్ధియు సమకూరును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

 ఆంధ్రానువాద ప్రవచనమున (24)వ యధ్యాయము.