లింగ మహా పురాణము

Table of Contents

43 - నందికేశ్వరుఁడు మానవరూపధారియై పరమేశ్వరానుగ్రహపాత్రుఁడగుట

నందికేశ్వర ఉవాచ - నందికేశ్వరుఁడు చెప్పఁదొడఁగెను. నా తండ్రి సంతోషించినవాడై మహేశ్వరునకు మరియొకసారి ప్రణమిల్లి - నాతో గూడ తన ఆశ్రమము జేరగా నేను దైవికమగు రూపమును విడిచి మానవబాలుఁడ నైతిని. అప్పుడు నాదివ్యజ్ఞానమంతయు నీశ్వరేచ్ఛచే లోపింపగా నా జనకుఁడు కొంత తడవు ఆవేదనపడినవాడై పుత్రవాత్సల్యముతో జాతకర్మాది సంస్కారములఁ గావించి ఋక్ యజుస్సామవేదములను ఆయుర్వేదాదుల సభ్యసింపజేసెను.

అట్టితఱి నాకు ఏడేండ్లు నిండియుండినవి. (దీని బట్టి నందికేశ్వరునకు ఐదవయేటనే ఉపనయన సంస్కారము జరుపఁబడినదనియు, రెండు సంవత్సరములలోనే వేద శాస్త్ర పారంగతుడైనాడనియు అవగతమగుచున్నయది.)

శివాజ్ఞవశమున మిత్రావరుణులు అను తాపసులు విచ్చేసి నన్ను మాటిమాటికి పరీక్షించుచు “నాయనా! శిలాదా! ఈ నంది - యింక నొక సంవత్సరమే జీవించు“ నని చెప్పగా శిలాదుడు నన్ను కౌగలించుకొని “హాపుత్రా ! పుత్రా !“ అని బిగ్గఱగా అఱచుచు ఆర్తనాదముతో నేలఁబడి పాఱలుచుండెను.

శిలాదుని ఆశ్రమముఁదగు పరిసరములలో నుండు మునులు శిలాదుని ఆవేదనను చూచి భరింపలేక నాకు అనేకవిధ మంత్రములతో రక్షలఁగావించి తేనెలో తడుపబడిన దూర్వాంకురములను పదివేల సంఖ్య నగ్ని హోత్రమున త్ర్యంబక మంత్రము నుచ్చరించుచు హవనము జేసిరి. చచ్చినవాని వలె పడియున్న శిలాదుని మరియు పితామహుండగు పాలంకాయనుని చూచి వారికి ప్రణమిల్లి ప్రదక్షిణము జేసియు రుద్రాధ్యాయమును జపించుచు హృదయమున శివుని త్ర్యంబకుని గాను పదిచేతులు ఐదుముఖములు గలవానిగాను, శాంతునిగాను సదాశివునిగాను ధ్యానించుచు పుణ్యనదీ
ప్రవాహము నందున్నట్టి నన్ను కరుణించి సాక్షాత్కరించిన చంద్రశేఖరుడు  పత్సా ! నీకు మృత్యుభయ మెక్కడిది ? నేనే నిన్ను పరీక్షింప మిత్రావరుణులను పంపితిని. శిలాదుడు మొదట చూచిన నీ దైవికరూపము సిద్ధ గంధర్వదాన వాదులచే పుజింప బడునది గాన భూలోకమున నుండ (దగినది కాదు. మానవులకు సుఖము దుఃఖము పునః పునః తారసిల్లుచునే యుండును. అందువలన మానవులు జన్మ జరావ్యాధి మృత్యువులు మరల మరల రాకుండుటకు నన్నారాధింపవలసియుండును” అని నిర్వచించి తన అమృతహస్తములతో నన్ను స్పృశించి- దేవిని గణాధిపతుల నవలోకించియు జరామరణ
రహితుడవై నీ పితృపితామహాదులతో గూడ నా చెంత నుండుము ! నాకు ప్రియుఁడవై నాయంతవాడవై నా పార్శ్వ గతుడవునై శివయోగ బల సంపన్నుడవై చిరంజీవి కమ్ము ! “అని యనుగ్రహించెను.

ఇట్లు మహాదేవుఁడు ప్రవచించి తన మెడలోని పద్మమాళికను నా కంఠమునకు తగిలించినందున నేను మూడు కన్నులు పదిచేతులు మున్నగు నవి గల దివ్యరూపముతో రెండవ శంకరుడనైతిని. అట్టితఱి పరమేశ్వరుడు నన్ను చేయితో పట్టుకొని ఇంక నేమి కావలెనని అడుగుచు తన జడలలోని పవిత్రమైన ఉదకమును వెలికితీసి నదివి కమ్ము“! అని విడువగా ఆ యుదకము ఒకానొక మహానదియై కమలములు కలువలును నిండినదియునై ప్రవహించెను. ఈ “జటోదక“ అను పేరు గలదానవగుదువు! నీ యుదకముతో స్నానముఁ జేయు మానవుడు సమస్తపాపములను పొగొట్టుకొను“ నని పరమేశ్వరుడు జటోదకా నది ననుగ్రహించెను.

ఆ పిమ్మట శంకరుడు పార్వతీ దేవి (గాంచుచు “ఓ వీడు నీ కుమారుఁడు “ అని దేవి యొక్క కాళ్లమీద పడవేయగా జగదంబ వానిని దరి జేర్చుకొని శిరస్సునందాఘ్రాణించియు చేతులతో నిమురుచు - పుత్ర ప్రేమతో తన చేతి నుండి బయలుపడిన మూడు ధారలతో శంఖము పన్నెగల పాలతోడను నన్నభిషేకించెను. అందువలన నా జలధారలు మూడు కూడి త్రిసో “ అను పేరుతో నదిగా పరిణమించెను. నేనా నదిని చూచి సంతోషాతిశయముతో బిగ్గరగా అఱచితిని గాన నా కంఠధ్వని
“వృషధ్వని “ అను పేరుతో నదియయ్యెను,

అంతమహేశ్వరుఁడు కరుణతో బంగారము నిండినది, రత్న ఖచితంబు నగు తన కిరీటమును నా తలపై నుంచెను. మరియు వజ్రవైడూర్యభూషితములగు కుండలములను ధరింపజేయగా మేఘములు మధురశీతల జలమును నాపై కురిపించినందున నా జలము“ “స్వర్ణోదక“ నదియై ప్రవహించెను. నేను ధరించిన కిరీటము సువర్ణమయమగుటచే దానినుండి ఆవిర్భవించిన జలము  “జాంబూనది” గా పరిణమించెను.

ఈ ఐదు నదులు ఈ “పంచనదము“ అను పేరుతో జప్యేశ్వరుని చెంత వెలసినవి. ఈ పంచ నదులలో జలకమాడి జప్యేశ్వరు నర్చించువారు- ప్రారబ్ధాంతము వరకు శివునుపాసించి ముక్తులగుదురు.

అనంతరము అమ్మవారితో “నందికేశ్వరునకు గణాధిపత్య పదవి నొసఁగుదు” నని
సంభాషింపగా దేని యంగీకరించినందున ప్రమధగణములను స్మరించెను (తలచుకొనెను.)

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (43) నలబది మూడవ అధ్యాయము.