లింగ మహా పురాణము

Table of Contents

3 - తృతీయాధ్యాయము

నారదునకు తుంబరువుతో సమానత్వము, తుంబురువును గానములో మించుటయు ఇందు వివరింపబడినవి.

నారదుఁడు చిరకాలము శ్రీహరిని గానముతో సుతించుచు లోకములన్నిటియందు

సంచరించుచు వైకుంఠమున కేతెంచి తన ముందు భక్తి గీతములను మృయమధురముగ పాడినందున శ్రీహరి సంతోషించి “ఇంకను నీకు గానపరిపూర్ణత కలుగలేదు గాన ద్వాపర యుగమున నేను  శ్రీకృష్ణుఁడై యున్నతరి నావద్దికి రమ్ము!“ అని చెప్పగా నారదుడు ద్వాపర యుగము వచ్చువరకు ఉలూకుఁడనువాని చెంత సహస్రవత్సరములు గానవిద్య నభ్యసించి శ్రీ కృష్ణు జేరగా “జాంబవతిని సత్యభామనాశ్రయించి గాన పరిపూర్ణుఁడవు కమ్ము! అని యాదేశింప - నారదుడిట్లే యొనర్చి శ్రీకృష్ణుని వలనసు గానవిద్యాశేషము నభ్యసించి పరిపూర్ణ గానవిద్యావిశారదుఁడై తుంబరువును మించినవాడై ఎల్లకాలము వీణవాయించుచు సప్తస్వరములు గల గానముతో హరిని పొగడుచుండెను. తత్పూర్వము

ఉలూకుఁడు “ నారదా! స్త్రీ సంగమునందు గానమునందు జూదమునందు ఏదే నొక

మంచి విషయమును వివరించుటయందు వర్తకము నందు ఆహారమునందు ధనకనకాదులు లభించు తరుణమున ఆదాయము నందు వ్యయము నందు సిగ్గుపడగూడదు.” మరియు

వంగి కాని పైన వస్త్రమును కప్పుకొని గాని చేతులు త్రిప్పుచుగాని నోరు తెరుచి గాని నాలుకను బయలు పఱచిగాని చేతులు లేపిగాని పైన చూపుతో గాని ఆకలిదప్పులతో గాని భయము కలిగినపుడు గాని చీకటిలో గాని గానమును చేయరాదు. అని నిర్వచించెను.

ఇట్లు గానబంధువు అనఁబడు ఉలూకుఁడు గాన విద్యనభ్యసింపఁజేసినతఱి “ గురుదక్షిణ నేమి యీయవలె” నని నారదుఁడు ప్రశ్నింపగా “ఒక కల్పము వరకు నాకు ఆయుష్యమునీయు” మని ఉలూకుఁడుకోరినందున నారదుఁడు “తాథాఽస్తుగా“ గురుదక్షిణ సమర్పించి “నీవు రాబోవు కల్పమున - గరుత్మంతుడుగా జన్మించి విష్ణు వాహనమగుము” వని వరము నొసగియు - వైకుంఠమునకు శ్రీహరిని దర్శింపనేగెను. శివపూజా సమయమున శ్రీకృష్ణునిచే నియోగింపఁబడి నారదుడు భక్త్యతిశయమున గానములతో మహేశ్వరుని ప్రార్థించెను. రుక్మిణీ సత్యభామా జాంబవతులు పరమేశ్వరుని గానములతో నారాధించిరి.

గానములతో శ్రీహరిని ప్రార్థించువాని కన్న శివుని సేవించువాడు సర్వశ్రేష్ఠుఁడగును. శివకేశవులు వినాయక షణ్ముఖాదులు దక్క నితరులైన మానవమాత్రులను గానములతో పొగడువాడు ప్రారబ్దాంతమున నరకము నొందును.