లింగ మహా పురాణము

Table of Contents

54 - మృత్యుంజయ మంత్రి సుష్ఠానఫలాది నిరూపణము

త్ర్యంబక మంత్రముతో బాణలింగమును లేక స్వయంభూలింగమును
ఆయుర్వర్ధనోపాయుజ్ఞులైన శ్రోత్రియ బ్రాహ్మణులతో అష్టోత్తరసహస్ర (1008) కమలములచే - లేక - నల్లని కలువలచే పూజింప జేయవలెను. ఘృతముతో కూడిన క్షీరపరమాన్నమును తేనెతో సహ ముద్దాన్న (పులగ) మును రుచికరములైన లేహ్యపేయ చోష్య స్వాద్యరూపములగు భక్ష్యములను నివేదింపవలెను.

 అగ్నియందు - లక్కు లేక - పదివేలు, లేక - సహస్రము కమలోత్పల పుష్పములతో చరువుతోడను హవనముఁజేయవలెను. త్ర్యంబక మంత్రమును లక్ష జపించి వేయి బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణలను సమర్పించవలెను. గోసహస్రమును హిరణ్యమును దానముఁజేయవలెను.

 “దేవ దేవుఁడైన మహేశ్వరుని వలన మేరు శిఖరమున కుమారస్వామి విని సనత్కుమారునకీ విషయము నుపదేశించెను. సనత్కుమారుని వలన వ్యాసమహర్షి పరిగ్రహించి నాకు చెప్పెను” అనియు, “శుకుడు ముక్తుడైనందున పుత్రదుఃఖముతో క్రుంగుచున్న “కుమారస్వామి ఉదయించిన వృత్తాంతమును వినిన వ్యాసునకు - త్ర్యంబకమంత్ర మహిమ విశేషించి సనత్కుమారునిచే చెప్పబడినట్లు  వ్యాసుని కరుణచే నేను మీకు వివరింపగలుఁగుచున్నా” ననియు సూతుఁడు శౌనకాదుల గూర్చి
చెప్పఁదొడగెను.

శ్లో॥ దేవం సంపూజ్య విధినా - జపే న్మంత్రం త్ర్యంబకం । ముచ్యతే సర్వపాపైశ్చ - సప్త జన్మకృతై రపి ॥

“విధియుక్తముగా రుద్రాభిషేకాదులతో శివలింగమును పూజించి త్ర్యంబక మంత్రమును జపించినచో - ఏడు జన్మల యందు చేయఁబడిన పాపములన్నియు పటాపంచలగును.”

మరియు నీ మంత్రానుష్ఠానముతో యుద్ధమున శత్రువుల నోడించి, అసమాన సౌభాగ్యము గలవాడగును.

లక్ష హోమముతో - స్వరాజ్యమును స్థిరపడుచుకొని సుఖించును. మరియు పుత్రార్థి - సత్పుత్రుఁబడయును ధనార్జి - లక్ష జపించినచో అఖండ శ్రీమంతుడగును.

శ్లో॥ నానేన సదృశో మంత్రో - లోకే వేదే చ చ సుప్రతాః । తస్మా త్ర్యంబకం దేవం - తేన నిత్యం ప్రపూజయేత్ ॥

సువ్రతులారా!

“దీనితో సమానమైన మంత్రము - వేద వేదాంగాది వాఞ్మయమున  లోకవ్యవహారమునందును లేదని  - చెప్పవచ్చును. అందువలన మృత్యుంజయ మహాదేవుని త్ర్యంబకమంత్రముతో నిత్య మారాధింపవలసియుండును, ఇట్లు చేసినచో అగ్నిష్టోమ యాగమునకన్న నెనిమిది రెట్లు ఎక్కువ ఫలము లభించును.

త్ర్యంబకశబ్దమంత్రార్థములు

“త్రయాణాం – అంబకః” త్ర్యంబకః

·      “ముల్లోకములకు సత్తరజస్తమోగుణములకు వేద త్రయమునకు బ్రహ్మవిష్ణు రుద్రులకు బ్రాహ్మణ క్షత్రియవైశ్యాది మానవులకును జనకుడై యవ్వానిని
రక్షించునుగాన త్ర్యంబకుఁడనఁబడును.”

·       అకార ఉకార మకార శబ్దాత్మకమగు ఓంకారము నధించువాడు గాన త్ర్యంబకుడన బఱఁగును.

·      బ్రహ్మ విష్ణురుద్రులకు సూర్య చంద్రాగ్నులకును జనని యగు అంబ - అర్ధాంగిగా గలవాడు గాన త్ర్యంబకుడని నిర్వచింపబడును.

“త్రయాణా మంబా - తామధితిష్ఠతీతి - త్ర్యంబకః”

సుగంధి శబ్దార్థము

·      బాగుగా పుష్పించిన వృక్షము యొక్క పరిమళము దూరము ప్రసరించునట్లు - పరమేశ్వరుని వలన సుగంధవాయువు - దేవ మానవాదులకు  లభించును గాన సుగంధియన బడును.

పుష్టివర్ధనశబ్దార్థము.

·      పూర్వకాలమున ఆద్యసృష్టియందు - శ్రీహరి యొక్క నాభిరూపమగు
యోనియందు - తన సంకల్పము లను వీర్యమును నెలకొలిపి బ్రహ్మాండము
నుదయింపఁజేసియు - సూర్యచంద్రులు నక్షత్రములు  భూర్భువస్య్యర్లోకములు మహోజనోతపః సత్యలోకములు ననువాని యందు - అవ్వానిని మించినట్టి అంతరిక్షమునందున తన సంకల్పాత్మక రేతస్సు యొక్క పుష్టిని నెలకొలిపినవాడగుటచే పుష్టివర్ధనుఁడనఁబడును. మరియు నీ రేతః పుష్టియే - పంచమహాభూతములుగాను అహంకారము గాను బుద్ధిగాను ప్రకృతిగాను బ్రహ్మాండముగాను పరిణమించినది.

త్ర్యంబకుఁడు పుష్టివర్ధనుఁడు నగు మహాదేవుని - ఘృతముతో క్షీరపరమాన్నముతో తేనెతో గూడిన యవలతో, గోధుమలు, మినుములతో మారేడు పండ్లతో, జిల్లేడు తెల్లకలువ జమ్మి తెల్ల ఆవాలు వరిధాన్యము నసువానిలో నేదే నొకదానితో హవనము నొనర్చియు శివలింగమునందు
యజామహే, ఆరాధించుచున్నాము.

 మాం = నన్ను; ఋతాత్ = సంసారబంధమునుండి, కర్మసంబంధము నుండియు, ముక్షీయ = నీ మహిమచే విడిపించుము!

పండిన దోసకాయ తొడిమెనుండి విడిబడునట్లు నన్ను జననమరణపరంపరాసంపన్నమగు సంసార కారాగారమునుండి విడిపించుము!

ఇల్లు మంత్రార్థమును తెలిసికొని జపించియు శివలింగము నర్చింపవలసి యుండును.

శ్లో॥ త్రియంబకసమో నాస్తి - దేవో వా ఘృణయాఽన్వితః । ప్రసాదశీలః ప్రేత - తథా మంత్రోఽపి సుప్రతాః ॥

అనుగ్రహము స్వభావముగా గలవాడు సంతుష్టచిత్తుఁడు కనికరము గలవాడు నగు త్ర్యంబకదేవునితో సమానుఁడైన దేవుడు - మరియొకడు లేడు. ఆట్లే నీ మంత్రముతో తులదూగు మంత్రము మరియొకటి లేదని చెప్పవచ్చును.

అందువలన అన్యదేవతలను అన్యమంత్రములను విడనాడి - త్ర్యంబక మంత్రముతో త్ర్యంబకుఁడగు ఉమాపతి నారాధించి త్ర్యంబక మంత్రమును జపించవలె ననియు, సర్వవిధ దురవస్థల పాలైనను శివారాధనము వలన దురితములన్నిటిని పోగొట్టు కొనవచ్చుననియు, త్ర్యంబక మంత్రానుష్ఠాత - స్వయముగా శివతుల్యుడనియు నిట విదితమైనది.

శ్లో॥ హత్వా భిత్వా చ భూతాని - భుక్త్వా చాన్యాయతోఽపివా శివ మేకం సకృత్స్నత్వా - సర్వపాపైః ప్రముచ్యతే ॥

“ప్రాణులను పీడించి యైనను - వధించియైనను -  అన్యాయార్జితముతో జీవించి యైనను - త్ర్యంబక మహాదేవు  నారాధించినయెడల అంతవరకు చేసిన సంచిత పాపములన్నియు  నశించును.”

 అనగా - త్ర్యంబకారాధన ప్రారంభమునుండి - ప్రాణిపీడన - హింసలను అన్యాయ జీవనమును విడనాడి - అహింస నవలంబించి న్యాయార్జన జీవనమును కొనసాగింపవలెనని ఇట ద్యోతక మగుచున్నయది.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (54)వ యధ్యాయము.