లింగ మహా పురాణము
79 - ఉచ్ఛిష్టత్వా దికృతశివపూజనఫలా దినిరూపణము
మదాంధులు, అల్పాయుష్కులు, కించిజ్ఞులు నగు కలియుగ మానవులకు పరమేశ్వరుడెట్లు ప్రసన్నుడగును?
ఒక కల్ప (బ్రహ్మదిన) ము వరకు ఆయుష్యము గల దేవతలు-వేలయేండ్లు శివపంచాక్షరి జపించుచు తన నారాధించినను ప్రత్యక్షము కాని మహేశ్వరుని అసమర్థులెట్లు ప్రసన్ను జేసికొనవలెను?
అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్పదొడగెను. మునిపుంగవులారా! “పరమేశ్వరుడు సామాన్యులకు సాక్షాత్కరించువాడు కాడు” అని మీరు చెప్పిన విషయము నిజమేను.
ఐనను మానవులు పట్టుదలతో భక్తితోడను శంకరుని పూజించినచో ఆ దేవదేవుని
చూడవచ్చును. ఆ పరాత్పరునితో సంభాషింపవచ్చును. సదాశివుడు భక్తుల భావముల ననుసరించి ఫలము నొసగుచుండును.
ఇక ఎంగిలిపడి శివు నర్చించువాడు రుద్రపిశాచమగును. క్రోధ పరవశుడై మహేశ్వరు నారాధించువాడు రాక్షసుడగును. తినఁదగని మాంసాదులను భక్షించి మహాదేవుని పూజించువాడు యక్షుడగును. పాటలు పాడుచు నాట్యమాడచును శంభు నర్చించువాడు గంధర్వుడగును. ప్రసిద్ధికాముడై బహుస్త్రీ సుఖాకాంక్షియునై ఈశ్వరు నారాధించువాడు బుధుని లోకమున నివసించును. మదగర్వోద్రిక్తుడై - త్రిశూలధారి నర్చించువాడు చంద్రుని లోకమున నుండును. గాయత్రీ మంత్రము నుచ్చరించుచు దేవ దేవు నర్చించినచో ప్రజాపతిలోకనివాసము లభించును. ప్రణవ (ఓంకార) ముతో శివుని ఆసక్తితో పూజించినయెడల బ్రహ్మలోకము లేక వైకుంఠము సంప్రాప్తించును.
ఇక పూజా విధానమెట్లనగా ?
పంచసూత్ర ఘటితమై సలక్షణముగా నున్నట్టి శివలింగమును ప్రాణప్రతిష్ఠాదులతో శోదించి పీఠమును పవిత్రజలముతో ప్రోక్షించియు ధర్మజ్ఞానమయము, ఓం కారము మధ్యన గల శాలిపిష్ట నిర్మిత పద్మముతో కూడినదియు నగు పీఠముపై తామ్ర రజత సువర్ణములమయములలో నేదేనొక పాత్రయందు ఆవాహనజేసియు - పాద్య అర్ఘ్య ఆచమనములను సమర్పించి క్షీర దధి ఘృత మధు శర్కర (పంచామృతము) లతో నారికేళోదకముతో శుద్ధ జలము తోడ నభిషేకింపవలెను. శ్రీగంధాదులతో, ఎర్ర కలువలు మొదలగు వికసిత పుష్పములతో, అఖండ బిల్వదళములతో కమలములతో, నల్లకలువలతో, నంది వర్ధన మల్లికా చంపక (సంపెంగ) జాతీ (జాజి) వకుళ (పొగడ) కరవీర (గన్నేరు) శమీ (జమ్మి) బృహతీ (వాకుడు- లేక-ములక) ఉన్నత్త (ఉమ్మెత్త) అగస్త్య (అగిసె) అపామార్గ (ఉత్తరేణి) కదంబ (కడప) పుష్పములతో నర్చించి. నానావిధాలంకారములను సమర్పించియు ఆ గరుజవ్వాజి శ్రీగంధ చూర్ణాదిమిశ్రిత పంచవిధ ధూపమును, దీపమును, తేనె నెయ్యి కలిసిన పెరుగన్నమును సూప శాకాది వ్యంజనములతో నెయ్యి తోడను కూడిన శుద్ధాన్నమును పరమాన్నమును నివేదింపవలెను. మరియు ఒకతూము బియ్యం ఉడికించిన శుద్ధాన్నముపై కాస్తనెయ్యి
వేసి మహా భోగముగా నివేదింపవచ్చును. తాంబూల ఫల మహానీరాజన మంత్ర పుష్పములను సమర్పించియు ప్రదక్షిణ నమస్కారముల జేసియు శివ స్తోత్రములఁజదివి మరల ఛత్ర చామరాది రాజోపచారములచే నర్చింపవలెను.
అథవా ఈశానతత్పురుష అఘోరవామదేవ సద్యోజాతములనబడు పంచ బ్రహ్మమంత్రములను పఠించుచు శివు నారాధింపవచ్చును.
ఇట్టి పుజావిధానముతో మహేశ్వరుడు ప్రసన్నుడై శివ భక్తులనవశ్య మనుగ్రహించును.
శ్లో॥ వృక్షాః పుష్పాది పత్రాద్యై రుపయుక్తా శ్శివార్చనే। గావశ్చైవ ద్విజశ్రేష్ఠాః । ప్రయాంతి పరమాం గతిమ్ ॥
ద్విజశ్రేష్ఠులారా !
“శివారాధనమునకై పుష్పాదులతో బిల్వపత్రాదులతో నుపయోగించు వృక్షములు, క్షీర దధిఘృతముల నొసగు ఆవులును పరమగతిని (మోక్షమును) పొందగలవు.
జన్మ మొత్తములో సోమవార మాసశివరాత్రి మహాశివ రాత్ర్యాది పర్వకాలములయందు. భక్తి శ్రద్ధలతో నొక్క పర్యాయమైనను శివలింగమును విధివిధానముగ పూజించువాడు కర్మశేషరహితుడై పునరావృత్తి లేనట్టి శివసాయుజ్యము నొందును.
భక్తులచే పూజింపబడిన శివుని ప్రసంగ వశాత్తు నొక తడవ దర్శించువాడు సమస్త పాపములను పోగొట్టుకొనును. మరియు మహాదేవునర్చించునపుడు భక్తితో నవలోకించువాడు, శివారాధనమును విని ఆమోదించువాడును ముక్తులగుదురు. శివలింగము ముందు ఘృతదీపమును వెలిగించినచో ఆశ్రమ ధర్మాచరణసాధ్యము కానట్టి స్థిరమైన మోక్షసామ్రాజ్యము లభించును.
చెమ్మె పైనను మట్టి ప్రమిదయందు కఱ్ఱస్తంభముపైనను దీపమును శివాలయములో వెలిగించినయెడల తన వంశమువారితో గూడకైలాసములో వైభవముతో నివాసము లభించును. ఇనుము రాగి ఇత్తడి వెండి బంగారము అనువానిలో నేదేనొకదానితో చేయించబడిన ప్రమిదయందు శివసన్నిధానమున దీపమును వెలిగించినవారును కైలాసముఁ జేరుదురు. కార్తికమాసమున శివుని ముందు ఘృతదీప జ్వాలనము బ్రహ్మలోకనివాసము నీయును.
శివపూజనమున ఆవాహనము సాన్నిధ్యము స్థాపనము పూజనము ననువానిని “తత్పురుషాయ విద్మహే – మహాదేవాయధీమహి - తన్నోరుద్రః ప్రచోదయాత్” అను రుద్రగాయత్రితో గావింపవలెను. ఓంకారమును ఆసనముగా భస్మతో వ్రాయవలెను. పంచరుద్రములతో నభిషేకము నొనర్పవలెను.
మరియు శివలింగమునకు ఎడమప్రక్కన బ్రహ్మదేవుని ప్రణవముతోడను, కుడివైపున శ్రీహరిని గాయత్రీ మంత్రముతోడ నర్చించి ప్రణవముతో కూడిన పంచబ్రహ్మ మంత్రములతో యథావిధి హవనము నొనర్చియు మాహేశ్వర (ఆరాధ్య) బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణల నొసగి తాను సకుటుంబముగా హవిష్యాన్నమును భుజింపవలెను.
ఇట్లు లింగార్చన విధానమును సంగ్రహముగా వేడవ్యాసుఁడు చెప్పగా విని మీకు తెలిపితిని. ఈ విధముగా నిత్యము శివలింగము నారాధించువాడు ప్రారబ్ధాoతమున శివసాయుజ్యము నొందుననుటలో సంశయ మిసుమంతయు లేదు.
అని సూతముని విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రపచనమున (79)వ అధ్యాయము.
