లింగ మహా పురాణము

Table of Contents

33 - శివుడు మునికృత స్తుతి సంతుష్టుఁడై వారికి పాశుపత వ్రతమును ప్రబోధించుట

నంద్యువాచ - నందికేశ్వరుఁడు పలికెను. 

శ్లో॥ తతస్తుతోష భగవా - నసుగృహ్య మహేశ్వరః । స్తుతింశ్రుత్సామునే। తేషా - మిదం వచనమబ్రవీత్ ॥

 సనత్కుమారమునీ! భగవానుఁడగుమహేశ్వరుఁడుమునులు చేసిన స్తోత్రము వలన సంతోషించి అనుగ్రహముతో దిగువ విధము సంభాషించెను.

“మీరు కీర్తించిన స్తోత్రమును పఠించువాడు, వినువాడు, ద్విజులకు వినుపించువాడును మరణానంతరము నాకైలాసము (జేరి ప్రమథ గణాధిపతులగుదురు.”

మునిపుంగవులారా! నాయందు భక్తి గల మీకునొక మంచిమాట చెప్పుచున్నాను. వినుఁడు!

శ్లో॥ న నిందే ద్యతినం తస్మా - ద్దిగ్వాసన మనుత్తమం ।

బాలోన్మత్త విచేష్టం తు - మత్పరం బ్రహ్మవాదినమ్ ॥

యతికంటెనుత్తముఁడు లేడుగాన నాతఁడు దిగంబరుఁడై బాలునివలె, ఉన్మత్తు బోలినవాడై విచిత్రములగు చేష్టల జేయుచుండును గాన యతిని నిందింపఁగూడదు. ఎందుకనగా? యతి (సన్న్యాసి) నా యందు నిరంతరాసక్తి కలిగి యుండుటఁజేసి యతి నేనే యని భావింపవలెను.

భస్మ దిగ్ధ సర్వాంగులు, భస్మ త్రిపుండ్రధారణచే పాపముల బోగొట్టు కొనిన వారు, కల్పోక ప్రకారముగ విరజాదీక్షను స్వీకరించి, ఇంద్రియ నిగ్రహ పరులై నన్ను ధ్యానించుచు నాయందే ఆసక్తి కలిగి ఊర్ధ్వ రేతస్కులునై మనోవాక్కాయములతో నన్ను పూజించువారు - ప్రారంభాంతమున కైలాసముఁ జేరి జన్మరాహిత్యము నొందుదురు. అందువలన భస్మధారణాదులు గల వ్రతము నవలంబింపవలెనని ప్రబోధించుచున్నాను.

బుద్ధిమంతుఁడు - ఈ లోకమున పరలోకమునను సుఖముఁ గోరినచో - భస్మ ప్రతులను తూలనాడరాడు. నిరాకరింపఁగూడదు. పరిహసింపవలదు. అప్రియమును పలుకరాదు. యతులను నిందించువాడు శివుని తిరస్కరించినవాడగును. వీరిని సత్కరించువాడు శివు నారాధించినట్లేను; ఇట్లు నేను (మహాదేవుఁడను) లోక కల్యాణార్థము ప్రతియుగమునందు భస్మచ్ఛన్న దిగంబర రూపముతో విహరించుచుందునని తెలియుఁడు!

ఇట్లు మీరు ఈ వ్రతము నాచరించి ముక్తులు కండు! సంసారక్లేశము అను మహాభయమును పోగొట్టునది, అసమానంబునగు దీక్షను గురించి  ఆలకించిన మునులులో భమోహాదులు లేని చిత్తశుద్ధి గలవారై హఠాత్తుగా తలలు వంచి పరమేశ్వరునకు ప్రణమిల్లి కుశ పుష్పమిశ్రములగు గంధోదకములు నిండిన మహాకుంభములతో శివ పాదాబ్జముల నభిషేకించుటే గాక. సుస్వరములు హుంకార మిశ్రి తములునగు గీతములఁ బాడుచుండిరి. మరియు భక్త్యతిశయముతో దిగువ విధము నుతించిరి.

 “శంకరా! నీవు దేవాధిదేవుడవు, మహాదేవుఁడవు, అర్ధనారీశరీరుఁడవు, మేఘరూపమున వాహనమగు విష్ణువు గలవాడవు, గజచర్మధారివి, కృష్ణాజినోత్తరీయుడవు, సర్పయజ్ణోవీతుడవు, విచిత్ర కుండలుడవు, దివ్య పుష్పమాలాలంకృతుఁడవు, లోకవేద ప్రసిద్ధమైన కీర్తి గలవాడవు, నీకు నమస్కారము.
“మునులారా! మీ భక్తిని మెచ్చితిని. వరము నడుగుడు! అని మహేశ్వరుఁడు వచింపగా మరల వారు నమస్కరించిరి. వారు ఎవరెవరనఁగా?

భృగువు, అంగిరస్సు, వసిష్ఠుఁడు, విశ్వామిత్రుఁడు. గౌతముఁడు, అత్రి, సుకేశుఁడు,
పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, మరీచి, కశ్యపుఁడు, కణ్వుఁడు, సంవర్తుఁడు ననువారు  ప్రణతులై  “భస్మ వ్రతావలంబులు నగ్నులై ఆచరింపవలసిన విధానముఁగూర్చి”  ప్రశ్నించిరి.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (33) ముప్పది మూడవ అధ్యాయము.