లింగ మహా పురాణము

Table of Contents

44 - నంది కేశ్వరునకు గణాధిపత్య పట్టాభిషేకమును మరియు వివాహమును జరిపించుట

శంకరుఁడు స్మరించినంతనే ప్రమథగణేంద్రులు పరమేశ్వరుని ముందునకు ఏతెంచి నిలువఁ ఒడిరి. వారండరు వేయి చేతులలో వేయి ఆయుధములను పట్టుకొనియుండిరి. వారందరికి మూడు కన్నులుండెను. దేవతలు గూడ వారికి ప్రణమిల్లుదురు. ప్రళయకాలాగ్నింబోలినవారై జడలను కిరీటములను ధరించియుండిరి. వారి ముఖములు కోటులతో భయము గొలుపుచుండెను. వారివెంట కోట్లు కొలది ప్రమథగణము లేతెంచిరి. వారిని లెక్కింపనలవి గాకుండెను. వారిలో కొందరు పాడుచు
ఆడుచుండిరి. మరికొందరు ముఖ వాద్యములను మ్రోగించుచుండిరి. రథములపై సింహ గజ అశ్వ వానరవాహనములపై సువర్ణ చిత్రితములగు విమానములపై నధిష్ఠించి అనేకవిధ వాద్యములను మ్రోగించుచుండిరి.

ఇట్టి గణేంద్రులు మహా దేవుని మ్రోల నిలచిన వారై మహేశ్వరునకు మహేశ్వరికిని సాగిలబడి భగవానుడా! దేవదేవేశ్వరా! మమ్మేందుకు జ్ఞాపకము చేసికొంటివో ఆజ్ఞాపించుము! సముద్రములను శుష్కింప జేయుదుమా? కింకరులతో కూడ యముని బంధింపవలెనా? మృత్యువు యొక్క కుమార్తెయగు జర (ముసలితనము) తోకూడ మృత్యు దేవతను పశువును వలె బాదుదుమా? బ్రహ్మదేవుని దేవేంద్రుని నారాయణుని దేవతలతో సహ బంధించి తేవలెనా? దైత్యులను  దానవులను బాధింపవలెనా? సెలవీయుఁడు!“ అని ప్రార్థింప-మహేశ్వరుఁడు గణేంద్రులారా! వినుఁడు! ఈ సందీశ్వరుఁడు మాకు పుత్రుఁడై లోకాధిపతులచే సత్కరింపఁదగియున్న వాడు. ఈతడు బ్రాహ్మణుడు, శిలాదతనయుడు మీ యందరి నాయకుడు కాదగినవాడు గాన నీతని పట్టాభిషేకమునకు వలయు సన్నాహమును చేయుఁడు!“ అని యాజ్ఞాపించెను.

అంత గణేంద్రులు మనోహరము మేరుపర్వతకాంతివంతము నగు పీఠమును అనేకస్తంభములు గలది, సువర్ణ కాంతి గలది ముత్యాల హారములు గలది, మణిరత్నఖచితంబు నగు  పందిరిలో నునిచి - దాని ముందు నీలవజ్రరచితమగు పాదపీఠమును నెలకొలిపిరి. సువర్ణ రజత కలశ సహస్రమును పందిరిలో వ్రేలాడ గట్టిరి. ఆ కలశములలో దివ్యగంగాజలమును నింపిరి. దివ్య పట్టువస్త్రయుగమును శ్రీగంధమును, కేయూరములను, కుండలములను, కిరీటమును, కంఠహారమును, శతశలాకఛత్రమును, వింజామరలను, బ్రహ్మదేవుని చెంతనుండి గొని తెచ్చిరి. కర్ణకుండ లాదులను విశ్వకర్మ నుండి సంగ్రహించిరి.

నా (నందీశ్వరుని) గణాధిపత్య పట్టాభిషేక మహోత్సవములో పాలుగొనుటకు శ్రీహరి, బ్రహ్మదేవుఁడు, దేవేంద్రాద్యమరులు, నారడాది దేవర్షులు, దక్షాది ప్రజాపతులు, మొదలగువారు రాగా బ్రహ్మదేవుఁడు వేదవిధియుక్తముగ కార్యక్రమమును జరిపించుచుండెను. నారాయణుఁడు శివానుమతిని స్వయముగా నందీశ్వరు నభిషేకింప బ్రహ్మాదులు నభిషేకించిరి.

మునులు నుతించుచుండగా శ్రీహరి ప్రాంజలియై నన్ను (నందీశ్వరుని) ప్రశంసించుచు జయశబ్దము నుచ్చరించెను. గణేంద్రులు దేవతలు అసురులు నన్నభిషేకించి ప్రార్ధించిరి. ఆ పిమ్మట పరమేశ్వరాజ్ఞచే మరుత్పుత్రికయగు సుయశాదేవితో వివాహమును పంకజాసనుఁడొనర్చెను. చంద్రని భంబగు శ్వేతఛత్రమును దేవతా స్త్రీలు పట్టుచుండ-నాతో గూడ నామె సింహాసనము నధిష్ఠించెను. అమ్మవారు ఆమెకు తన కంఠహారము నొసఁగెను. లక్ష్మీ దేవి కిరీటాదులతో సుయశ నలంకరించెను.

వృషేంద్రుడు, గజము, సింహము, సింహ ధ్వజము, సువర్ణఛత్ర విలసితంబగు రథము తనకు లభించినందున తనతో సమానుడైన ఘనుడు ముల్లోకములలో లేడని (నందీశ్వరుడు) నేను సంతోషించుచుంటిని.

ఆ తరువాత (నందీశ్వరుడు) నేను శివేచ్చ ననుసరించి పూజ్యులైన హరి బ్రహ్మాదులకు మునులకును “శివ“  “మహాదేవ”  ఇత్యాది నామములను నమస్కారముతో చేర్చి  “శివాయ నమః”  “మహాదేవాయ నమః“ అని యుచ్చరింపవలెను. కేవలము శివాది నామములను  “శివా ! మహాదేవా!“ అని యుచ్చరించినచో దోషము ఘటించును“ అని శాసించితిని. మరియు

“నమః” పదమును మొదటనైనా, చివరనైనా తగిలించి “నమశ్శివాయ“ “శివాయ నమః“ అని యుచ్చరించుట విశేష ఫల ప్రదమై శివానుగ్రహభాజనంబు నగును” అని వివరించితిని.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (44) నలుబది నాలుగవ అధ్యాయము.