లింగ మహా పురాణము

Table of Contents

77 - శివ మందిరనిర్మాణఫల నిరూపణము

“శివ లింగప్రతిష్ఠా పుణ్యఫలమును, శివలింగ భేదములను, నీవలన వినినాము. మృత్తిక మొదలగు వానితో శివాలయమును నిర్మించిన వారికి లభించు ఫలమును వివరింపుము !”  అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్ప దొడగెను.

“శివునియందు భక్తి కలిగినవాడై భార్యాపుత్రగృహాదులయందు అత్యంతమమకారము లేనివాడైనచో అట్టి మహాపురుషునకు గృహాదులతో అధిక ప్రయోజనము లేదు,

ఒకవేళ భార్యాపుత్ర గృహాదుల యందు ఆసక్తి గలవారైనను ఇటికెలతో మట్టి బెడ్డల తోడను శివాలయమును నిర్మించినచో సురేంద్రపద్మోద్భవ వంద్యమానుడగు శివుని ఆస్థానము లభించును.

బాల్యమున మట్టి బెడ్డలతో శివమందిరమును నిర్మించువానికిని కైలాస నివాసము చేకూరును గాన ప్రయాసపడియైనను శివాలయమును ధర్మకామార్ధమోక్ష సిద్ధికై భక్తితో కట్టించవలసియుండును.

కేసరము, నాగరము, ‘ద్రావిడము, కైలాసము, మందరము, మేరుపర్వతము, నిషభము, హిమశైలము, నీలాద్రిశిఖరము, మహేంద్రశైలముననుదాని మందిర భేదములు శిల్పశాస్త్రమునందు చెప్పబడినవి.

కేసరము నాగరము ద్రావిడము ననువానిలో నేదే నొకదానిని నిర్మించువాని పుణ్యమును నూరు యుగముల వరకైనను లెక్కింప నలవి గాదు. కైలాసము, మందరము, మేరుపర్వతము, నిషధము, హిమశైలము, నీలాద్రి శిఖరము, మహేంద్రశైలము నగువాని బోలిన శవముందిరములను నిర్మించువాడు - ప్రారబ్ధాంతమున దివ్య విమానము నదిష్ఠించి. అప్సరోగణములు కిన్నరంకిం పురుష గంధర్మ సిద్ధ చారణాదులు కీర్తించుచుండగా గొప్పవైభవముతో కైలాసము జేరి శివజ్ఞానము గలవాడై శివసాయుజ్యము నొందును.

శ్లో॥ జీర్ణం వా పతితం వాఽషి- ఖండితం స్ఫుటితం తథా। పూర్వవత్కారయే ద్యస్తు - ద్వారాద్యైః సుశుభం ద్విజాః। ॥ శ్లో॥ప్రాసాదం మండపం వాఽపి- ప్రాకారం గోపురం తు వా । కర్తు రష్యధికం పుణ్యం లభతే నాత్ర సంశయః ॥

ద్విజులారా !

విరిగిపడినది, పడగొట్టబడినది, పాతది, వర్షాడులచే పడినదియు నగు శివాలయమును ద్వారములు మున్నగువానితో శోభించునట్లు నిర్మింపజేయువాడు; మరియు ఆలయోపరి భాగమును చుట్టుగోడను మండపమును గోపురము నైనను పూర్వము ఉన్నట్లు కట్టించువాడును. శివాలయనిర్మాతకంటెనెక్కుడు పుణ్య ఫలము గలవాడగును. ఇందెంతమాత్రము సంశయము లేదు.

మఱియు - తన జీవనమునకై శివాలయమున శివు నర్చించువాడును, తనకు సుఖము చేకూరవలెనని ఆశించి- శివలింగము నారాధించువాడును ముక్తులగుదురు. మునిసత్తములారా ! కఱ్ఱలు ఇటికెలు మున్నగువానితో శివమందిరమును ప్రయాసపడియైనను కట్టించుట శివభక్తునకు అవశ్య కర్తవ్యమై శివానుగ్రహనిదానమగునని తెలిసికొనవలెను.

శివాలయమును నిర్మింపజాలని వారు శివాలయ గర్భాగార మంటపాదులను ఒక నెల మెత్తని చీపిరితో తుడిచి శ్రీ గంధచూర్ణము గోమయము కలిసిన పరిశుభ్రజలమును చల్లి శుభ్రపరచినచో ఒక వత్సరము చాంద్రాయణ వ్రతము నాచరించిన ఫలము నొందును.

స్వయంభూలింగము గల ప్రదేశము అర్ధకోశము వరకు; ఋషి ప్రతిష్ఠిత లింగము గల ప్రదేశము పాదకోశము వరకు; మానవ ప్రతిష్ఠిత లింగము గల ప్రదేశము క్రోశషోడశ భాగము వరకు; సన్న్యాసులైన శివయోగులు నివసించుచోట గల శివాలయము క్రోశ షోడశభాగము వరకు; శ్వేతాచార్యాది శివావతార పురుషుల సన్నిధి గలదియు, అవ్వారి శిష్యప్రశిష్యులు గలదియు, ధర్మదేవతాపుత్రుడైన నరుని యవతారము గలదియు నగు శివాలయము అర్ధక్రోశము వరకును శివక్షేత్రములుగా పరిగణింపబడును.

విడువ నలవి గాని ప్రాణములను పై చెప్పబడిన శివక్షేత్రములలో నేదే నొకచో విడుచువాడును ముక్తుడగును. ఇక ముఖ్య క్షేత్రములు ఏట్టె వనగా ?

శ్రీ శైలము, దాని పరిసరప్రాంతము, కేదారము, ప్రయాగ, కురుక్షేత్రము, ప్రభాసము,
పుష్కరము, అవంతి, అమరేశ్వరము, త్రివిష్టపము, సంగమేశ్వరము, శాలకము, జంబుకేశ్వరము, శుక్రేశ్వరము, గోకర్ణము, భాస్కరేశ్వరము, గుహేశ్వరము హిరణ్యగర్భము, నందీశ్వరము అను శివ క్షేత్రముల యందు మరణించు వారు- దేవతాప్రతిష్ఠితము, ఋషిస్థాపితము, స్వయంభూసమన్వితము, మనుష్యప్రతిష్ఠితంబు నగు శివలింగము గల సమీప ప్రదేశములయందు ప్రాణత్యాగము నొనర్చువారు ముక్తుల గుదురు.

ప్రాణత్యాగవిధానము ఎట్టి దనగా ?

అగ్నిని విధివిధానముగ రగుల్కొలిపి శివపంచాక్షరీ మహాముత్రమును జపించుచు అగ్నియందు రుద్రాధ్యాయాదులతో హవనము జేయుచు నిరాహారుడై అనగా పాలు మొదలగు పంచగవ్యములను స్వల్పముగా స్వీకరించుచు ప్రాణత్యాగము జేయవలెను. శివక్షేత్ర నివాసంబు భుక్తి ముక్తి ప్రదంబగును.

శివక్షేత్రమును దర్శించుట పుణ్యరూపము కాగా దానిలో ప్రవేశించుట, శివలింగమును తాకుటయు, శివాలయమునకు ప్రదక్షిణమును చేయుటయు, శివక్షేత్రమందలి తీర్థజలమునందు స్నానము నొనర్చుటయు, ఒక దాని కన్న మరి యొకటిసూరురెట్లు ఫలము నొసగును. ఇక ఉదకముతో పాలతో పెరుగుతో తేనెతో ఘృతములో శర్కరతోడను శివలింగము నభిషేకించుట శివ పూజాంగములలో ముఖ్యమై శివప్రీతికరంబగును.

శివక్షేత్ర సమీపమునండు గల మహానదిలో గ్రుంకులిడి హఠాత్తుగా ప్రాణములను విడుచుట సద్యోముక్తి దాయకమగును. శివక్షేత్రసన్నిధి గలనదులు, వాపీ కూపతటాకాదులును శివ తీర్థములగును గాన యవ్వానిలో స్నాతుడగువాడు బ్రహ్మహత్యాది పాపములను పోగొట్టుకొనును. వీనిలో ప్రాతఃస్నానము అశ్వమేధ ఫలమును; మధ్యాహ్నస్నానము గంగా స్నానఫలమును; సాయంకాల స్నానము కైలాస
నివాసము నొనగూర్చును. ప్రాత ర్మధ్యాహ్న సాయంకాల స్నానము త్రిషవణస్నానమన బడును, ఇద్దాని నొక్క పర్యాయమైన నాచరించువాడు శివ సాయుజ్యము నొందును.

పూర్వకాలమున నొకానొక వరాహము తన మార్గములో గల శునకమునకు భయపడినదై వారం దినములు శివతీర్థమునందు గ్రులకులిడి సాయంకాలమున మరిణించినదై కైలాసము జీరి చిరకాలము నివసించెను.

శివలింగమును ఉదయమున దర్శించువాడు ఊర్ధ్వలోకములలో ఉన్నతపదవి నధిష్ఠించును. మధ్యాహ్నమున శివలింగమూర్తి నవలోకించు వాడు ఒకానొక మహాయాగమును నెరవేర్చిన ఫలము గలవాడగును. సాయంకాలమున మందిరస్థుడగు పరమేశ్వరుని చూచువాడు సమస్త యజ్ఞఫలము నొందును. మరియు కాయిక వాచిక మానసిక దురితములను పోగొట్టుకొనును. సంక్రాంతి మొదలగు పర్వకాలములలో శివదర్శనము ఒక నెలలో చేసిన పాపములను పరిహరించును. దక్షిణ ఉత్తరాయణాది
సుదినకృత శివదర్శనము అర్ధమాస నిర్వర్తితదురితహర మగును.

శుచియై శివాలయముచుట్టు సవ్యాపసవ్యముగా మెల్లని నడకతో మూడు ప్రదక్షిణములఁజేయువాడు ఆడుగడుగున అశ్వమేధయాగ ఫలము నొందును.

సవ్యాప సవ్యమనగా ? ధ్వజస్తంభమునుండి ఎడమవైపు నడిచి మరల ధ్వజస్తంభమునుండి కుడివైపు నడిచియు మొత్తం చుట్టు తిరిగి ధ్వజస్తంభము వద్దకి వచ్చి- మ్రొక్కినచో నొక ప్రదక్షిణమగును.

అశక్తులు- ఒకేసారి మందిరమునకు - ధ్వజస్తంభమునుండి- ధ్వజస్తంభము వరకు తిరిగి ప్రదక్షిణమును చేయవచ్చును. ప్రదక్షిణత్రయానంతరము లోనికి వెళ్లి నందికేశ్వరుని గణపతిని దర్శించి శివు నవలోకించియు దేవీదర్శనమును చేసికొనవలెను.

శ్లో॥ వాచా యస్తు శివం నిత్యం సంస్తాతి పరమేశ్వరం । సోఽపియాతి శివస్థానం ప్రాప్య కిం పునరేవచ ?॥

ప్రతిదినము పరమేశ్వరుని వాక్కుతో ప్రార్థించువాడు శివస్థానమును చేరుచుండగా
శివాలయమునకు వెళ్లుట మహాఫలప్రదమగునని వేరు చెప్ప నవసరము లేదు.

శ్రీగంధచూర్ణముతో కూడిన గోమయ (ఆవుపేడ) జలముతో శుభ్రపరుపడిన స్థలమున ముత్తెములు, ఇంద్రనీలములు, పద్మరాగములు, స్ఫటికములు, మరకతములు, సువర్ణము, రజతము (వెండి) అనువాని చూర్ణములను ముగ్గుపిండిలో కలిపిపదిమూఱల వెడల్పున కాడతో కూడిన దశదళ కమలమును శివుని సమీపమున నేలపై వ్రాయవలెను. అట్టి పద్మముపై నవశక్తులను లేక పంచ శక్తులను మహాదేవునితో గూడ ఆవాహనము చేసి పూజించి నమస్కరించినచో భూచానఫలము సంప్రాప్తించును. ముక్తాచూర్ణాడులతో ముగ్గువేయుటకు శక్తి లేనివారు బియ్యపు పిండి మున్నగు వానితో కమలమును వ్రాసి అందు శివు నారాధించినను భూచానఫలము లభించును.

పన్నెండు దళములు గల పద్మమును రత్నచూర్ణాడులతో నేలపై వ్రాసి పద్మదళములలో పన్నెండు సూర్యులను, మధ్యన భాస్కరుని అష్టగ్రహములను వ్రాసియు పూజించినచో సూర్యలోకనివాసము లభించును.

ఇట్లే ఆరుదళముల గల పద్మమునండు మధ్యన పరమేశ్వరార్ధాంగియగు పార్వతీ దేవిని, కుడివైపున సత్త్వ రూపిణి (మహాలక్ష్మిని), ఎడమవైపున రజోమూర్తి (సరస్వతీదేవి)ని, ముందు తమోమయి (కాళీదేవి) ని వ్రాసి కుడి రేకులయందు పంచతన్మాత్రలను పంచమహాభూతములను, ఎడమ రేకులలో కర్మజ్ఞానేంద్రియములను, జీవాత్మను, అంతరాత్మను, బుద్ధిని, అహంకారమును మహత్తత్త్వమును భావించి పూజించినచో రుద్రయాగాది సమస్తక్రతు ఫలము చేకూరును.

గోచర్మమాత్ర ప్రదేశమును గోమయజలముతో కడిగి, నలుచదరముగా మండలము నేర్పరచి అఘోర మంత్రముతో నుదకమును చల్లియు మేలుకట్లతో గొడుగులతో అష్టమి నాటి చంద్రరేఖల తోడను, బంగారు రేకులతో రావి ఆకులతో వికసించిన తెల్లని కమలములతోడను, ఎర్రని కలువలతోడ మండలము నలంకరించి మేలుకట్టులకు ముత్యాల హారముల తోరణములను కట్టవలెను. తెల్లని ధ్వజములను మండల స్తంభచతుష్టయమునకు తగిలించవలెను. మూలు వెడల్పుగల పద్మము యొక్క
దుద్దులో (నడుము) ఉమామహేశ్వరుల నావాహనముఁజేయవలెను. పద్మములో తూర్పు మొదలుకొని ఉత్తరమువరకు ఓంకారము మొదలుకొని నమః పదమువరకు (ఓం శివాయ నమః) అను అక్షరములను వ్రాశి గంధపుష్పాదులతో నర్చించియు ఏబది (50) బ్రాహ్మణులకు రుద్రాక్షమాలలు, యజ్ఞోపవీతములు, కర్ణకుండలములు, కమండలములు, ఆసనములు, కఱ్ఱలు శిరోవేష్టనములు అనువాని నొసగి భోజన తాంబూల దక్షిణలను సమర్పించవలెను. యాగోపయాగ ద్రవ్యములగు స్రుక్ స్పష్టములతో ఘృతాదులను శివునకు సమర్పించి ఓంకారాది నమోంత మంత్రమును యథాశక్తి జపించియు ఆత్మీయులతో ప్రియ బందువుల తోడను హవిష్యాన్నమును భుజింపవలెను.

ఇట్లు చేసినచో సాంగవేదాధ్యయనము నొనర్చి గృహస్థుడై జ్యోతిష్టోమాదికములు
విశ్వజిద్యాగాంతములు నగు యజ్ఞముల నొనర్చి పుత్రసంతానము బడిసిన తరువాత వానప్రసుడునై బ్రహ్మవిద్యాశాస్త్రము నభ్యసించి శివు సుపాసించియు శివజ్ఞానమును కలిగించుకొనిన ఫలము సమకూరును.

శివాలయ గర్భగృహమును శుభ్రపరచి సుగంధపుష్పములను పఱచియు సుగంధ ధూపముల నా ఘోషణింపఁజేసియు పరమేశ్వరుని ప్రార్థించినయెడల శివలోకము సంప్రాప్తమగును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (77)వ అధ్యాయము.