లింగ మహా పురాణము
34 - భస్మ స్నానాదికమున కర్తవ్యములను నిరూపించుట
శ్రీ భగవానువాచ - భగవంతుడు పలికెను.
శ్లో॥ ఏత ద్వ స్సం ప్రవక్ష్యామి - కథాసర్వస్వ మద్య వై। అగ్నిర్హ్యహం సోమకర్తా - సొమశ్చాగ్ని ముపాశ్రితః ॥
శ్రుతి స్మృత్యాగమములలో చెప్పబడిన భస్మధారణమును గురించి పురాణములయందు ప్రతిపాదింపబడిన భస్మ మహిమ గల కథల యొక్క సారాంశమును ప్రస్తుతము మీకు నిర్ధారితముగా చెప్పుచున్నాను. ఎట్లనగా?
సోముఁడు కారణముగా గల అగ్ని నేను కాగా - సోముఁడు అగ్ని నాశ్రయించెను.
అగ్ని- కర్మఫలము నందజేయును. భరతఖండమున చేయఁ బడిన కర్మ అగ్నిద్వారా ఫలప్రచమగును. అగ్నిచే అనేక పర్యాయములు ఈ జగత్తు దహింపబడి భస్మమై పవిత్రము ఉత్తమంబు నగును. సోముఁడు - భస్మచేత సమర్థుడై ప్రాణుల నుజ్జీవింపఁజేయును. అగ్నినుపాసించి అగ్ని దగభస్మతో త్రిపుండ్రములను ధరించువాడు కల్మషముల నన్నిటిని పోగొట్టుకొనఁగలుఁగును.
భస్మయనగా - పాపభక్షణముచే ప్రకాశింపజేయునది. శుభమును కలుగజేయునదియు భస్మయనబడును. పితరులు ఆవిరిఁ ద్రాగుదురు. దేవతలు సోమునాశ్రంతురు. అగ్ని మరియు సోముడు కూడిన జగత్తంతయు అగ్నీషోమాత్మకమైనది.
మరియొక విభాగమును చెప్పుచున్నాను.
గొప్ప తేజస్సు గల అగ్ని నేను కాగా ఈ యంబిక సోమ యనఁబడును. అగ్నీషోమాత్మకమైన జగత్తు స్థూలరూపమును విడనాడి భస్మ మగును. అట్టి భస్మ నా మహిమ గాన నేను గూడ భస్మను ధరించుచుందును. అనాది కాలమునుండి భస్మ అశుభముల నుండి ప్రాణులను కాపాడుచున్నందున జాతాశౌచమృతాశౌచముల యందు నుపయోగింపఁబడుచున్నయది.
శ్లో॥ భస్మస్నాన విశుద్ధాత్మా - జితక్రోధో జితేంద్రియః । మత్సమీపం సమాగమ్య - న భూయో వినివర్తతే ॥
పొడి భస్మను మేనునిండ పూసికొని స్నానమును చేయువాడు చిత్తశుద్ధి గలవాడై క్రోధము నదుపులో పెట్టి ఇంద్రియములను వశపఱుచుకొనిన యెడల నా దరిజేరి మరల నీ మానవ లోకమునకు రానివాడై కైలాసమున నా సాయుజ్యము నొందును. పాశుపత వ్రతము, కపిలునకు సంబంధించిన సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అను వానిని నేనే ఏర్పరచితిని. కాపిల యోగశాస్త్రముల కన్న ముందు పాశుపత వ్రతమును నిర్దేశించితిని. మిగత చతురాశ్రమములను బహ్మదేవుడు ఏర్పరచెను.
సిగ్గు, భయము, మోహము గల సృష్టిని నేనే యొనర్చితిని. దేవతలు, మునులు, మానవాది ప్రాణులందరు పుట్టుకతో నగ్నులై యుందురు గదా! ఇంద్రియములను జయింప లేవినారు వస్త్రములను ధరింతురు. జితేంద్రియులు మాత్రము దిగంబరులై యుందురు.
ఓర్పు, ధైర్యము, అహింస, వైరాగ్యము, మానావమానములను సమములుగా భావించుట యనునవి జితేంద్రియుని రక్షించును.
భస్మతో స్నానము, విభూతిని మేనునిండ పూసికొనుటయు. శివధ్యానంబు
పాశుపతవ్రతస్థునకు ముఖ్యములు.
శ్లో॥ యద్యకార్యసహస్రాణి - కృత్వా యః స్నాతి భస్మనా ।
తత్సర్వం దహతే భస్మ – యథాఽగ్నిస్తేజసా వనమ్ ॥
పాప కార్యములను వేలకొలది చేసినను భస్మస్నానముఁజేయువారి దురితములన్నియు దావాగ్నివలన వనము వలె దహించి పోవును. గాన ప్రయత్నించి యైనను ప్రతి దినము త్రికాలముల యందు భస్మస్నానము నొనర్చినచో కైలాసమున గణాధిపత్యము లభించును.
పంచమహాయజ్ఞాదుల నన్నిటినొనర్చి చిత్తశుద్ధిఁ బడసినవారై పరమేశ్వరుని లీలావిగ్రహములను భావించుచు శివు నేకాగ్రనిష్ఠతో ధ్యానించువారు అర్చిరాది గతి ద్వారా మోక్షము నొందుదురు. వినాశలక్షణముగల కామ్యకర్మల నాచరించువారు ధూమాది మార్గమున - స్వర్గాదిలోకముల (జెంది దేవతలగుదురు. ఇంద్రాది దేవతలు నిట్టివారేను.
మదము మోహము కామాదులు లేనివాడై కామ్యకర్మ అనిత్యంబని కనుగొనియు పాశుపత వ్రత దీక్షాపరుఁడు కావలెను.
శాశ్వత ఫలప్రదము పాశుపతంబని నిశ్చయించుకొని శుచియై పట్టుదలతో ఆచరించువాడు ఆచరింప జేయువాడును జితేంద్రియుడై సమస్త పాపనిర్ముక్తుఁడునై కైలాసనివాసి యగును.
వషిష్ఠాది మహర్షులందరు శివప్రోక్తమునంతయు విని భస్మధారణనిరతులై విరాగులునై శివతేజస్కులునై ప్రారబ్ధాంతమున శివలోకముఁజెంద నర్హులైరి.
అందువలన శివయోగులు వికారులైనను మలినులైనను సుందరులైన నవ్వారిని నిందింపక పూజింపవలెను. వేయేల? శివుని యందు అత్యంత భక్తిగల బ్రాహ్మణులను శివస్వరూపులుగా భావించి సత్కరింపవలెను.
పూర్వము - దధీచి యను మునీంద్రుఁడు శివభక్తి ప్రభావమున బ్రహ్మాది వంద్యమానుఁడగు నారాయణుని గూడ జయించెను గాన భస్మధారణము మొదలగు వానితో శివ వ్రతము నవలంబించి జడ దారులై బోడి తల గలవారునై నగ్నులై యున్న నవ్వారిని మనో వాక్కాయముల నారాధింపవలె నని ప్రబోధించుచున్నానని పరమేశ్వరుడు విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (34) చతుస్త్రింశాధ్యాయము.
