లింగ మహా పురాణము

Table of Contents

56 - చంద్రరథమును వర్ణించుట మరియు చంద్రుని కళలు క్షీణించుటను నిండుటను నిరూపించుట

సూత ఉవాచ:

చంద్రుడు తమ మార్గము జెందినట్టి అశ్విన్యాది నక్షత్రములను వరుసగా చేరుచు ఆకాశమున సంచరించుచుండును. చంద్రుని రథమునకు ఇరువైపుల అశ్వములు, మూడు చక్రములుండును. రథాశ్వములు పది తెల్లనివై బలిష్ఠములునై మనోవేగము గలవియునై భూమినంటకయే చంద్రరథమున ఆకాశమున నడుపుచుండును. జలమయములు తెల్లనివియు నగు కిరణములతో ప్రపంచము నాహ్లాదింపఁజేయు చంద్రుని అమరులు పితరులును వెంబడించుచుందురు. శుక్లపక్ష ప్రతిపదనుండి సూర్యునికన్న ముందు అంతరిక్షమున సంచరించుచు పౌర్ణిమ వరకు దిన క్రమముగా నిండుకొను. చంద్రుని అమృతమయ కిరణములను కృష్ణపక్షమున దేవతలు ఆస్వాదింపగా క్షీణించిన చంద్రునకు “సుషుమ్న” యను కిరణముతో దినక్రమముగా సూర్యుడు పరిపూర్ణత నొసగుచుండును. అందువలన శుక్లపక్షమున పౌర్ణమినాడు చంద్రుడు పరిపూర్ణకళా సంపన్నుడుగా కనుపడుచుండును. కృష్ణ పక్షప్రతిపదనుండి కృష్ణచతుర్దశి వరకు ముప్పది మూడు వేల ముప్పది మూడు వందల ముప్పది మూడుగురు దేవతలు చంద్రకిరణామృతముఁ గ్రోలుచుందురు. అమావాస్యనాడు సూర్యున కెదురుగా నున్న చంద్రుని పితరులు సమీపించి కొద్దిగా మిగిలిన కళను అపరాహ్లామున రెండు భాగములు
అనుభవింపగా అవశిష్టమైన కళ పితృప్రియమైన స్వధ (కవ్యము) గా పరిణమించును. ఇట్లు చంద్రుని వృద్ధి క్షయములు సూర్యుని నిమిత్తముగా సంభవించుచుండునని వ్యక్తమైనది.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక’ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (56) ఏబది ఆరవ అధ్యాయము.