లింగ మహా పురాణము

Table of Contents

60 - ముఖ్యములైన సూర్యకిరణముల నేడిటిని వాని ప్రభావాదులను వర్ణించుట

సూర్యచంద్రులు దక్క ఇతర గ్రహములగు అంగారకాది పంచగ్రహములు -ఆకాశమునందు స్వేచ్ఛగా సంచరించునట్టివి. అగ్ని సూర్యుని సంక్రమించును. ఉదకము చంద్రునాశ్రయించును. సుర సేనాపతియగు కుమారస్వామి - అంగారుకు నధిష్ఠించును. బుధుఁడు నారాయణుఁడు అధిపతిగా గలవాడు; మెల్లగానడుచు శనైశ్చరగ్రహము లోకేశ్వరుడగు మహాదేవు (మృత్యుంజయు) నిచే నదిష్ఠివబడును.

దేవాచార్యుఁడు ఆంగీరసుని కుమారుఁడు నగు బృహస్పతి శివారాధనముచే శాంతించును. అసురాచార్యుఁడు భృగునందనుఁడు నగు శుక్రుఁడు దేవీ ప్రార్థనతో ప్రసన్నుఁడగును.

ముల్లోకముల సంస్థితికి సూర్యుఁడే మూలకారణమగును. దేవతలు, రాక్షసులు, మానవులు,ఏకాదశరుద్రులు, ఇంద్రుఁడు, ఉపేంద్రుఁడు, చంద్రుఁడు, అగ్ని మొదలగు స్వర్గవాసులు అనువారికి సూర్యుని తేజస్సు ఉపకరించును. సూర్యుఁడే తనలో బ్రహ్మ విష్ణు రుద్రులుగా భావింపఁబడును గాన సృష్టి స్థితిలయములు సంభవించుటకు అవసరమగు కాలమునకు సూర్యగతియే ఆధారమగును.

క్షణములు, మహూర్తములు, దినములు, రాత్రులు, శుక్ల కృష్ణ పక్షములు, మాసములు, సంవత్సరములు, దక్షిణోత్తరాయణములు, ఋతువులు, యుగములు నివియన్నియు సూర్యుని సంచారము వలన నేర్పడునవి. సూర్యుఁడు లేనిది కాలమును పరిగణింపరాదు. కాలము లేనిది నియమము గాని, దీక్షగాని. అహ్నిక కర్మగాని, ఋతువిభాగము గాని, పుష్పవికాసము గాని, కందములు (గడ్డలు) గాని, ఫలములు గాని, ధాన్యములు గాని, తృణము (గడ్డి) గాని, ఓషధులు గాని, రుద్రాంతర్యామికుఁడగు రవి వలననే సంభవించును. ఈ లోకమున పరలోకమనందును సూర్యగతి లేనిది సుఖ దుఃఖానుభవములుండవు.

సూర్యుఁడే కాలమనియు, అగ్నియనియు, వ్యవహరింపఁ బడును. మరియు తేజోరాశియని పేర్కొనఁబడుచు లోకముల నన్నిటిని ప్రకాశింపఁజేయుచుండును. సూర్యుఁడు ఆకాశమున సంచరించుచు క్రింద, పైన, పార్శ్వములయందును ప్రకాశము నొసఁగుచుండును.

రవియొక్క సహస్రకిరణములలో - సుషుమ్నము, ‘హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచష్సు, సన్నద్ధము, సర్వావసువు, స్వరాట్ అను ఏడు కిరణములు ముఖ్యములైనవి.

ఎన్నిటికిని క్షీణింపని తారలు నక్షత్రములన ఁబడును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (60) అరువదవ అధ్యాయము.