లింగ మహా పురాణము

Table of Contents

40 - కలియుగ ధర్మ నిరూపణము

కలియుగమున కపటము, ఓర్పలేనితనము, దైవభక్తులను వధించుటయు. తమోగుణముచే ఇంద్రియవికారము, పొరపాటువలన రోగములు సంభవించుటయు, ఎల్లకాలము ఆకలితో భాధపడుటయు, కరువు భయము, దేశములు మారుటయు, వేదములపై విశ్వాసము లేకుండుటయు, అధర్మాచరణము, అనాచారము, మహాక్రోధము, అబద్ధములాడుటయు, దుష్ట సంతాన ప్రాప్తి, బ్రాహ్మణుల దురాచారము వలన ప్రజలకు భయమేర్పడుటయు, బ్రాహ్మణులు వేదాధ్యయనమును నిత్య పంచయజ్ఞములను చేయకుండుటయు, సంభవించును. క్షత్రియులు వైశ్యులును స్వధర్మభ్రష్టులగుదురు. శూద్రులకు బ్రాహ్మణులు మంత్రముల జెప్పుచు పడక, కూర్చుండుట, భోజనముతో సంబంధము కలవారగుదురు. శూద్రులు రాజులై బ్రాహ్మణులను బాధింతురు గర్భస్రావములు, శిశుహత్యలు వీర హత్యలును ప్రజలలో మిక్కుటమగును. రాజులు దొంగలగుదురు. ఒకే భార్య గలవారు లేనందున స్త్రీలు వ్యభిచరింతురు , బ్రాహ్మణులు శూద్రాచారులుగాను శూద్రులు బ్రాహ్మణాచారులు గాను ప్రవర్తింతురు. వర్ణాశ్రమధర్మములుండవు. భూమిస్వల్పముగా ఫలించును. ఒకానొకచో నధికముగా ఫలించును. శూద్రులు జ్ఞానులై బ్రాహ్మణులచే నమస్కరింపఁ బడుదురు. రాజులు ప్రజలను కాపాడ కుందురు. విప్రులు శూద్రుల ఆశ్రయముతో జీవింతురు. బ్రాహ్మణులను శూద్రులు చూచియు తమ ఉన్నతాసనముల నుండి లేవకుండుటే గాక నవ్వారిని దండింతురు. బ్రాహ్మణులు శూద్రుల చిబుక (గడ్డ) ములపై చేయి పెట్టి - చెవి దగ్గ రప్రాధేయపడుచు మాటలాడు చుందురు. శూద్రులు బ్రాహ్మణులచే పూలమాలలతో నూతన వస్త్రములచేసత్కరింపబడి గర్విష్టులై భూసురుల విషయమై నిర్లక్ష్యము గల వారగుదురు. బ్రాహ్మణ సమూహములో ఉన్నతపీఠములపై ఆసీనులైన శూద్రులను రాజులు శిక్షింపకుందురు. బ్రాహ్మణులు - తమ అనుష్ఠాన ఫలము నితరులకు విక్రయించెదరు. పెక్కురు కుటుంబమును పోషింపలేక సన్న్యాసులగుదురు. పురుషులు తగ్గుదురు. స్త్రీలు ఎక్కువగుదురు. మహా దేవుడైన శంకరుఁడు - కలియుగమున ధర్మమును నెలకొలుపుటకు ప్రకాశము గలవాడుగ నుండును.

శ్లో॥ యే తం విప్రా నిషేవంతే-యేన కేనాపి శంకరం । కలిదోషా వినిర్జిత్య - ప్రయాంతి పరమం పదమ్ ॥

కలియుగము ఇట్టి దైనను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యు (ద్విజు)లు భక్తిచే గాని ప్రార్థనచే గాని ధ్యానముచే గాని శంకరు నారాధించినచో కలియుగదోషములను పోగొట్టుకొని మహాకైలాసముఁజేరుదురు. మరియు కలియుగమున క్రూర జంతువు లెక్కువ నుండును. గవాశ్వాదులు తగ్గియుండును. సత్పురుషులు కనఁబడరు. గొప్పదానముల వలన కొద్ది ఫలము కలుగును. నాలుగు ఆశ్రమములు లేనందున ధర్మము క్షీణించును. స్త్రీలు వెంట్రుకలు విరబోసికొని సంచరింతురు. మేఘము అతిగా లేక స్వల్పముగాను వర్షించును. రాజులు కప్పమును తీసికొని ప్రజలను రక్షింపక స్వార్ధపరులగుదురు. దేశములయందు అన్నవిక్రయ శాలలు ఏర్పడును. వ్యాపారులు వడ్డీల నపరిమితములుగా తీసికొనెదరు. బ్రాహ్మణులును పాషండులతో మైత్రిఁ జేయుచు శూద్రాదులతో యజ్ఞములను చేయించుచుందురు.

మృదుసంబాషణము, ఋజువర్తనము, సహనము, కలియుగమున నుండవు. ఒకరినొకరు తూలనాడుచు ధర్మ భ్రష్టులగుదురు. కలియుగము గడచిన కొలది పరిపాలకులు క్షీణించుచుందురు. భూమిపై పంటలు శూన్యమగును. ధనము దుర్లభమగును. దేశములయందు నగరములలోను మండల (నిర్జన స్థల)ము లేర్పడును. పరద్రవ్యాపహరణము, పరస్త్రీ సంయోగము, ప్రత్యుపకారమును చేయకుండుటయు అధికములగును. పదునారు (16) వత్సరములు ఆయుష్యముండును. బోడితల
గలవారై కాషాయవస్త్రములను ధరించువారు- కొందరుందురు. శూద్రులు వైదిక ధర్మము
నాచరింతురు. ధాన్యములను దొంగలింతురు. దొంగల సొత్తు నపహరించువారుందురు. యోగ్యమైన కర్మ లోపించుటచే ప్రజలు కర్మశూన్యులు కాగా కీటమూషకసర్పములు మానవులను బాధించుచుండును. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యంబు కొఱవడుటచే ప్రజలు ఆకలిచే భాదపడుచు కౌశికీనది నాశ్రయించెదరు.

యజ్ఞములు అధర్మభూయిష్ఠములై - ప్రవర్తించును. శూద్రులు వేదాధ్యయనము జేయుదురు. ప్రజలు - స్త్రీలను బాలురను గోవులను వధించి స్వార్థమును సాధించుకొందురు. తామసులై బ్రహ్మహత్యల నొనర్తురు. అందువలన మానవులకు ఆయుష్యము బలము రూపము కలియుగాంతమున క్షీణించును. ఇట్టి ఘోర కలియుగమును పాటింపక భక్తి శ్రద్ధలుతో పుణ్యకార్యములను గావించుచు తత్ఫలమును త్వరలో నను భివించువారు కొందరుందురు.

త్రేతాయుగమున సంవత్సరకాలములో, ద్వాపరయుగమున నెలలో, కలియుగమున ఒక దినము నందు పుణ్యము ఫలప్రదమగును.

కలియుగాంతమున విష్ణ్వంశతో చంద్రవంశమున “ప్రమితి“ యనువాడు జన్మించి గజ తురగ రథపదాతి సంకుల మగుసైన్యమును వెంట నిడుకొని ఘేంఛులను దుష్టులను సంహరించును. గంగా యమునా నదుల మధ్య తన యనుచరులతో కూడి నివసించును.

ఆ సమయమున పురుషులు కళత్రపుత్రాదులను విడనాడి నదీ తీరములను సముద్ర తీరములను కొండల నాశ్రయించెదరు. మరియు పరితాపముతో విచారపడుచుందురు. ఒక రేయింబవళ్లే ఒక యుగముగా కనబడును.

ఇట్లు కల్కి యనబడు ప్రమితి సంహరింపగా ధర్మాత్ములు కొందరు జీవింతురు గాననప్పుడు కృతయుగము ప్రారంభమగును. కృతయుగమున ప్రజలకు సప్తర్షులు వైదిక ధర్మమును ప్రబోధించుటచే వర్ణాశ్రమధర్మము ప్రవర్తించుచుండును.

అందువలన ధార్మిక ప్రజా సృష్టి పెంపొందును. మనువులు మునులు ధర్మ ప్రవక్తలగుదురు. కృత త్రేతా ద్వాపర కలియుగములతో నేర్పడు చతుర్యుగములు వేయి గడచినచో బ్రహ్మదేవునకు ఒక దినమగును. డెబ్బది యొక చతుర్యుగములైనచో నొక మన్వంతరమగును.

 పూర్వోక్త క్రమ మంతయు నాలుగుయుగములలో జరుగు చుండును.
ఇఁక బ్రహ్మదేవుఁడు సతీదేవికి పుత్రుడెట్లయ్యెనో చెప్పెదనని దేవేంద్రుడు విరమించెను.

ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (40) నలుబదవ అధ్యాయము.