లింగ మహా పురాణము
10 - శివునకు ప్రాకృతాది బంధరాహిత్యమును సూర్య చంద్రాదుల శివాజ్ఞా పరిపాలనమును నిరూపించుట,
ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు, చిత్తము, శ్రోత్రములు, నేత్రములు, జిహ్వ, ప్రాణము, త్వక్కు, పాదములు, హస్తములు, వాక్కు, ఉపస్థేద్రియము, తన్మాత్ర పంచభూతములు, ననువానివలన కలుగు బంధములు అనఁగా ప్రకృతాదుల యొక్క వికారములు శివునకుండవు గాన శివుఁడు నిత్యశుద్భస్వభావుడు, నిత్యబుద్ధుఁడు, నిత్యముక్తుడు సగునని తత్త్వవేత్తలైన మునులు నిరూపించుచున్నవారు.
శివునినుండి ఆవిర్భవించిన పురుషుని శాసనముతో ప్రకృతి - బుద్ధిని అహంకారమును కల్పించును. పరమేష్ఠియగు శివు నాజ్ఞతో అహంకారము కర్మజ్ఞానేంద్రియములు పదిటిని, మనస్సును, తన్మాత్రలను పుట్టించును.
మహాదేవుఁడు పంచమహా భూతములను కల్పించి బ్రహ్మదేవుఁడు మొదలుకొని గడ్డి పఱక వరకు గల ప్రాణులకు శరీర సంబంధము నేర్పరచును. బుద్ధి - శివాజ్ఞ ననుసరించి సర్వార్థములను నిర్ణయించును. అహంకారము శివచేష్టితములగు విషయములపై “ నేను చేయుచున్నా’’ నని అభిమానమును వహించును.
శరీరములలో నంతర్యామి యగు మహేశ్వరుని ఐశ్వర్యము, విభూతులును స్వభావసిద్ధములై యున్నవి.
చిత్తము ఆలోచించుటయు, మనస్సు సంకల్పించుటయు, చెవి వినుటయు, శబ్ద స్పర్శరూప రసగంధములు ప్రవర్తించుటయు, వాక్కు మాటలాడుటయు; హస్తములు స్వీకరించుటయు; పాదములు సంచరించుటయు, పాయువు విసర్జించు టయు; ఉపస్థము ఆనందపడుటయు, కోశము అవకాశము నొసఁగుటయ; వాయువు ప్రాణాపానాది భేదములతో శరీరములను వహించుటయు; బ్రహచ్చాయువు స్వైరవహాది భేదములతో లోకమున ప్రవర్తించుటయు; అగ్ని దేవతలకు హవ్యమును పితరులకు కవ్యమును చేకూర్చుచు మానవులకు పాకము నేర్పరచులుయు, ప్రాణులకు ఆహారమును
జఠరాగ్నిరూపమున జీర్ణింపఁజేయుటయు, ఉదకములు ప్రాణులను జీవింపఁజేయుటయు,పరమేశ్వరుని శాసనము వలననే సంభవించునని తెలియవలెను.
దేవదేవుడైన ఇంద్రుఁడు - జీవులకు జీవితకాలమున రోగములను మరణానంతరము సరకయాతనల ననుభవింప జేయుటయు; దేవతలను రక్షించుచు రాక్షసులను వధించుటయు; వరుణదేవుఁడు లోకుల నుదకములతో జీవింపఁజేయుచు ఆసురీసంపన్నులను పాశములతో బంధించుటయు; కుబేరుడు ప్రాణులందరికి పూర్వపుణ్యాను సారముగ విత్తము నొసఁగుటయు; సూర్యుఁడు- ఉదయాస్తములఁజెందుచు దివారాత్రాది కాలమును విభజించుటయు; పుష్పములుఓషధులును ప్రజల నాహ్లాదింపఁజేయుటయు; చంద్రుఁడు అమృతకళలను ప్రసరింప జేయుటయు; ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు - అశ్వినీ దేవతలు మరుత్తులు, ఇతర దేవతలందరు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, యక్షులు, రక్షస్సులు, పిశాచములు, గ్రహములు, నక్షత్రములు, చుక్కలు, యజ్ఞములు, వేదములు, తపస్సులు, ఋషిగణములు, పితృదేవతలు, సప్తసముద్రములు, పర్వతములు, నదులు, అరణ్యములు, సరస్సులు, కళాకాష్ఠానిమేషముహూర్త దివసరాత్రి ఋతు సంవత్సరపక్షమాస యుగ మన్వంతర పరార్ధాది కొలవిభాగములు, అష్టవిధ దేవజాతులు పంచవిధతిర్యక్ జంతువులు (గో వృషభాదులు) మానవులు, పదునాలుగు
లోకములయందు జన్మించు ప్రాణులు, సప్తపాతాళములు, రాబోవు బ్రహ్మాండములు, వర్తమాన బ్రహ్మాండములు అసంఖ్యాతములుగా గడచినవియు నగు బ్రహ్మాండములు శివాజ్ఞవలననే ప్రవర్తించుచున్నవి.
ఇల్లు సూతమహాముని శౌనకాది మహర్షులకు ప్రబోధించి విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (10)వ యధ్యాయము,
