లింగ మహా పురాణము

Table of Contents

7 - శివానుగ్రహము వలననే బ్రహ్మానందభోగము లభించుననుట - యోగాచార్య నిరూపణమున్ను

సూతుఁడు చెప్పఁదొడఁగెను.

శ్లో॥ రహస్యం వః ప్రవక్ష్యామి భవస్యామిత తేజసః । ప్రభావం శంకరస్యాద్యం - సంక్షేపా త్సర్వదర్శినః ॥

అమిత తేజస్కుఁడు సర్వచర్శియునగు పరమేశ్వరుని యొక్క మహిమఁగూర్చి - భక్తులు కాని వారికి గ్రాహ్యము గోచరము కానట్లు రహస్యముగా మీకు చెప్పుచున్నాను.

సర్వతత్త్వజ్ఞులు, అత్యంత వైరాగ్యవంతులు నగు శివయోగులు ప్రాణాయామము మొదలగు అష్టాంగయోగము నభ్యసించుచు కరుణ మున్నగు సద్గుణములు కలవారైనను అనేక విధ కర్మల నాచరించిన కారణమున స్వర్గమును - లేక - నరకమును తమ కర్మానుసారముగా చెందుదురు. ఏతావతా-అష్టాంగయోగము వలనమోక్షము లభింపదని సారాంశము. ఐతే శివాను గ్రహము వలన శివునుపాసించు జ్ఞానము కలుగగా అట్టి యుపాస నాత్మక జ్ఞానముతో శివధ్యానయోగము సిద్ధించును. అట్టిధ్యానయోగము వలననే ముక్తి సులభమగును. వస్తుతః - శివానుగ్రహము వలన భక్తి జ్ఞానవైరాగ్యములు ధ్యానయోగము సమస్తంబు చేకూరునని తేటపడినది

ఋషులిట్లు ప్రశ్నించిరి.

శివ ప్రసాదము వలన విజ్ఞానము కలుఁగునెడ అట్టి విజ్ఞానముఁదగు స్వరూపమును విశదీకరింపుము! యోగవిదులలో శ్రేష్ఠుడవైన సూతమునీ! శివ సంబంధమైన యోగముఁ గూర్చి వక్కాణింపుము! ఎట్టి చింత లేనట్టి శివభగవానుఁడు-యోగ మార్గా వలంబనులగు మానవులకు ఎప్పుడు ఆనుగ్రహము గలవాడగును?

సూతుఁడిట్లు ప్రత్యుత్తరించెను.

పూర్వము - నందికేశ్వరుఁడు సనత్కుమారునకు దేవతలు ఋషులు పితరులు మొదలగువారు చెంత నుండగా వక్కాణించిన విధమును చెప్పుచున్నాను. వినుఁడు!

ద్వాపరాంతమున వ్యాసావతారములు, కలియుగ ప్రారంభమున యోగాచార్యా వతారములు యోగాచార్యులలో ఒక్కొకరికి నలుగురు శిష్యులు ప్రశిష్యులు పెక్కురు నవతరింతురు.వీరందరిని పరమేశ్వరు డనుగ్రహించును. ఇట్లు శివానుగ్రహము వలన కలుగు జ్ఞానము భువిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో వారి వారి యోగ్యత ననుసరించి హెచ్చు తగ్గులలో ప్రవర్తింపఁ జేయబడును.

శౌనకాదులిట్లు ప్రశ్నించిరి.

ప్రతి ద్వాపర యుగమునందు వ్యాసావతారములు ఏయే మన్వంతములలో ఏయే కల్పములలో సంభవించును?

సూతుడు డిగువ విధము వాకృచ్చెను.

మునులారా! వినుడు!

శ్వేత వరాహకల్పము నందు వైవస్వత మన్వంతరమున సంభవించిన వ్యాసావతారములను శివయోగా చార్యావతారములను నిర్దేశించుచున్నాను. వీరు వేద పురాణములలోని జ్ఞానమును ప్రవర్తింప జేయువారని తెలియ వలెను.

క్రతువు - సత్యుఁడు - భార్గవుఁడు - అంగిరస్సు - సవిత - మృత్యువు - శతక్రతువు
మునిపుంగవుఁడైన వసిష్ఠుఁడు - సారస్వతుఁడు - త్రిధాముఁడు - త్రివృతుఁడు - శతతేజస్కుఁడు-నారాయణుఁడు - తరక్షువు - ఆరుణి - దేవుఁడు - కృతంజయుఁడు - ఋతంజయుఁడు-భరద్వాజుఁడు- గౌతముఁడు - వాచః శ్రవుఁడు - శుష్మాయణి - తృణబిందువు - రుక్షుఁడు - శక్తి - పరాశరుడు - జాతూక కర్ణ్యుఁడు - కృష్ణద్వైపాయనుఁడు అనునవి-వ్యాసావతారములు.

ఇంక రుద్రుని యోగేశ్వరావతారముఁ గూర్చి చెప్పెదనని సూతుఁడనఁగా శౌనకాదులు “వరాహకల్పము నందుఽగల మన్వంతరములను వివరింపు” మని ప్రశ్నించిరి.
సూత ఉవాచ :-

మనువులలో మొదటివాడు స్వాయంభువు, ఆతని తరువాత స్వారోచిషుఁడు - ఉత్తముడు తామసుఁడు రైవతుఁడు - చాక్షుషుఁడు - వైవస్వతుఁడు - సూర్యసావర్ణి - బ్రహ్మసావర్ణి - రుద్రసావర్ణి - పిశంగుఁడు - శబలుఁడు - వర్ణకుఁడు అను పదునాలుగురు మనువులు ప్రవర్తించువారి కాలము మన్వంతర మనబడును. ఈ మనువులలో నొక్కొకరికి-నొక్కొకవర్ణము ఉండుము.

ఇట్టి మన్వంతరములు ఆరు గడచినవి. ఏడవడగు వైవస్వత మన్వంతరమున ఇరువదియెనిమిదవ మహాయుగము లోని కలియుగముఁడగు ప్రారంభమున సంభవించు శివయోగాచార్యుల క్రమము - ఎట్టిదనఁగా?

శ్వేతుఁడు - సుతారుఁడు - మదనుఁడు - సుహోత్రుఁడు - కంకణుఁడు - లోగాక్షి - జైగీషవ్యుఁడు - దధివాహనుఁడు - ఋషభుఁడు - ముని - ఉగుఁడు - అత్రి - సుబాలకుడు-గౌతముఁడు - వేదశీర్షుఁడు - గోకర్ణుఁడు - గుహాదాసి శిఖండభృత్తు - జతామాలి - అట్ట్స్హాసుడు - దారుకుఁడు - లాంగలి - మహాకాయముని - శూలి - భుండీశ్వరుఁడు - సహిష్ణువు - సోమశర్మ - నకులీశుఁడు - ననువారు - శివయోగాచార్యుల నఁబడుదురు.

ఇట్లు వ్యాసావతారములు, యోగాచార్యా వతారములును ప్రతి ద్వాపరాంతమున - కలియుగ ప్రారంభమునను ప్రవర్తించుచుండును యోగాచార్యులలో నొక్కొకరికి నలుగురుచొప్పున నూట పండ్రెండుగురు శిష్యులుందురు.

శో॥ ఏతే పాశుపతా స్సిద్ధా - భస్మ రుద్రాక్షధారిణః । ప్రాప్య పాశుపతం యోగం - రుద్రలోకాయ సంస్థితాః ॥

ఈ యోగాచార్యులు పాశుపతులనియు తపస్సిదులనియు పేర్కొనఁబడువారు. మరియు వీరు భస్మరుద్రాక్ష ధారులై పాశుపత మనబడు శివధ్యాన యోగము నాశ్రయించి రుద్రలోకము జెందుటకై-భువిని-సంచరించు చున్నవారు.

పాశుపత మనగా పశుపతికి సంబంధించిన యోగమగును.

పశుపతి యనగా?

శ్లో॥ దేవాదయః పిశాచాంతాః - పశవః పరికీర్తితాః । తేషాం పతిత్వా త్సర్వేశో - భవః పశుపతిః స్మృతః ॥

ఇంద్రాది దేవతలు మొదలుకొని పిశాచముల వరకు గలవారు పశువు లనఁబడుదురు. సంసార పాశముచే బంధింపబడు వారు పశువు లనఁబలుఁగుదురు. అట్టి పశువులను శాసించు ప్రభువగు మహేశ్వరుఁడు - పశుపతి యనఁబడును. పశుపతిచే రచింపఁబడిన భస్మ రుద్రాక్ష శివలింగ ధారణ పూర్వకమగు శివారాధన యోగము పరమేశ్వర విభూతి ప్రాప్తికిని దానమగు చున్నయది.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (7) సప్తమాధ్యాయము.