లింగ మహా పురాణము

Table of Contents

107 - ఉపమన్యుమహర్షిని పరమేశ్వరు డనుగ్రహించుట

“పూర్వము - ఉపమన్యువునకు మహేశ్వరుని వలన క్షీరసముద్రాదులు, జీవితాంతమున గాణపత్యంబు లభించిన నెట్లు?“ అను నైమిషీయ మహర్షుల ప్రశ్నకు సమాధానమును రోమహర్షణుఁడు (సూతముని) దిగువవిధము వాక్రుచ్చెను.

పూర్వోక్త విధముగా కాళికాదేవిని మహేశ్వరుఁడు శాంతింపఁజేసి కైలాసముఁజేరిన పిమ్మట. ఉపమన్యువు అను మునిబాలుడు-ఒకప్పుడు మేనమామయొక్క గృహమున ఆవుపాలు కొద్దిగా త్రాగి పాల రుచియందలి ఆసక్తితో తల్లిని పాలుబోయుమని పదే పదే అడిగినందున జనని తన పేదరికమును తలచుకొనుచు బాధపడినదై ఉంఛవృత్తి సంపాదిత తండులములను పొడిచేసి నీటిలో కలిపి  “ఇదిగో పాలు, త్రాగుము!” అని యీయగా బాలుడు ఆ పాలు త్రాగి - ఇవి నిజమైన పాలు గావని” పలుకుచు ఏడ్చుచుండెను.

అంత నాజనని బాలుని చేరదీసికొని కన్నీళ్లు తుడిచినదై దిగువ విధము సంభాషించెను.

“స్వర్గ మర్త్య పాతాళలోకముల యందు ప్రవహించు రత్ననదులు శివునియందు భక్తి లేనట్టి దౌర్భాగ్యులకు కనుపడవు. ఇంతియేగాక శివుఁడు ఎవరి ననుగ్రహింపడో నవ్వారికి భూలోక రాజ్యవైభవము, స్వర్గసుఖము, పాలు మున్నగువానితో కూడిన మధురభోజనము, ప్రారబ్ధాంతమున మోక్షంబు దుర్లభములగును.

శ్లో॥ భవప్రసాదజం సర్వం నాన్యదేవ ప్రసాదజం । అన్యదేవేషు నిరతా దుఃఖార్తా విభ్రమంతి చ ॥

 “ఇహ పర సుఖమంతయు శివానుగ్రహము వలననే లభించును. శివేతర దేవతల యొక్క కృపతో ప్రాప్తింపదు. శివేతర దేవతాభక్తి గలవారు-జనన జరావ్యాధి మరణ దుఃఖార్తులై సంసారచక్రమున పరిభ్రమించుచుందురు.”

పూర్వజన్మలో శివ ప్రీత్యర్థము దానము చేయఁబడిన వస్తువే ఈ జన్మయందు లభించును.” అని మాత నిర్వచింపగా బాలుఁడు “ అమ్మా! నేను నమస్కరించి నీ యనుజ్ఞ నడుగుచున్నాను. దుఃఖమును విసర్జింపుము!

“మహాదేవుఁడు” అనువాడు ఎక్కడనైన నున్నచో వాని నారాధించి శీఘ్రముగానో
ఆలస్యముగానో పాలసంద్రమును సంపాదింపగలను. “ఆని వచింపగా నా తపస్విని బాలుని దీవించి యనుమతించెను.

అంత ఉపమన్యువు హిమాలయముఁజేరి నచ్చోట శివునిఁగూర్చి తపించుచుండగా నా మునిబాలుని తపోజ్వాలచే జగత్తంతయు తపించుచున్నందున బ్రహ్మాదులు శ్రీహరి జేరి మొఱపెట్టుకొనిరి.

అట్టితఱి నారాయణుఁడు జగత్తాప కారణమును గుర్తించి మహేశ్వరుని దర్శింపఁ గోరినవాడై మందరపర్వతముఁజేరి - కృతాంజలియై ప్రణమిల్లి “భగవానుఁడా! ఉపమన్యువు అను బ్రాహ్మణ బాలుఁడు క్షీరార్థము తపించుచు తపోజ్వాలచే ప్రపంచమును తపింపఁజేయుచున్నవాడు. అట్టి బాలు ననుగ్రహించి జగత్తును రక్షింపుము!“ అని విన్నవింపగా మహేశ్వరుడంగీకరించి ఉపమన్యువును పరీక్షింపఁ దలచినవాడై - దేవేంద్రరూపమున బాలునిఁ జేరి నీ తపస్సును మెచ్చితిని వరము నడుగుము!” అని వచించెను.

అంత నా మునికుమారుఁడు వినమ్రుఁడై “నీ రాకతో నా యాశ్రమమము పవిత్రమైనది. కాని నేను నిన్ను గురించి తపింపలేదు. హరు నుద్దేశించి తపించితిని గాన “శివునియందు ఏకాగ్ర భక్తి కలుగునట్లు వరము నీయుము!” అని ప్రార్థించెను.

అంత శక్రరూపధరుఁడైన హరుడు కోపమును తెచ్చుకొని - “నేను దేవేంద్రుఁడను.

దేవతలందరు నన్ను సేవించుచుండురు. త్రైలోక్యాధిపతిని గాన నన్నే సర్వదా పూజించుచు నాయందు భక్తి గలవాడవు కమ్ము! నీవు కోరినదంతయు నిచ్చెదను. గుణహీనుడైన రుద్రునిఁగూర్చి తపస్సును చాలించుము!“ అని నిర్వచింపగా ఉపమన్యువు “ ప్రణవఘటిత శివ పంచాక్షరి జపించుచు “ఒకానొక రాక్షసాధముడు దేవేంద్రరూపములో నేతెంచెనని “ తలచి “శివనిందారతుడవై శివుఁడు గుణహీనుఁడని - ప్రలపించితివి. నేను పూర్వకృత పాప ఫలముగా శివనింద నాలకించితిని.

అనియు

శ్లో॥ శ్రుత్వా నిందాం భవస్యాథ తత్క్షణాదేవ సంత్యజేత్ ।

స్వదేహం, తం నిహత్యాశు శివలోకం స గచ్ఛతి ॥

యో వాచోత్పాటయే జ్జిహ్వాం శివనిందారతస్యతు ।

త్రిః సప్తకుల ముద్ధృత్య శివలోకం స గచ్ఛతి ॥

“శివనిందను వినినవాడు అదేక్షణమున శివనిందకుని వధించి తాను మరణించినచో శివలోకము జెందును.” అథవా - “ఎవడు తన వాక్కుతో శివుని నిందించునో అవ్వాని నాలుకను పెఱికిన యెడల అట్టివాడు ఇరువదియొక తరముల వరకు తన వంశము నుద్ధరించుటయే గాక శివలోకముఁజేరి పునరావృత్తి లేనట్టి శాశ్వత సుఖముఁబడయును”.

అనియు నిర్వచించి పాలకోసమైన నా కోరిక అల్లుండుగాక! సురాధముడవైన నిన్ను శివాస్త్రముతో వధించి నా శరీరమును విసర్జింపగలను. “పూర్వజన్మలో శంకరుని పూజింప లేదు గాన నిట్టి పరిస్థితి యేర్పడినది. ఇట్లు నా జనని చెప్పియుండెను.” అని భావించి భస్మముష్టి నభిమంత్రించి యధర్వాస్త్రమును ప్రయోగించి “శివ! శంభో! హర! ఇత్యాది నామములను బిగ్గరగా సచ్చరించుచు తన ఒడలు విడుచుటకు యోగాగ్నిని చింతించుచు ఎండు కఱ్ఱవలె నిలువబడి యుండెను.

అంత పరమేశ్వరుఁడు ఉపమన్యువు యొక్క యోగాగ్నిధ్యానమును తొలగింపగా నందికేశ్వరుని యానతితో చంద్రికుఁడు అను గణుఁడు కాలాగ్ని సదృశమగు అథర్వాస్త్రము నుపసంహరింపఁజేసెను.

అట్టితఱి పార్వతీపతి బాలేందుశేఖరంబగు నిజరూపమును చూపెట్టి క్షీరధారాసహస్ర మన్వితంబగు పాలసంద్రమును, పెరుగు మున్నగువాని సముద్రములను, ఘృత సాగరమును, లార్ణవమును, భక్ష్య భోజ్యసముద్రముల నొసగుచుండగా అపూవ పర్వతములు సర్వత్ర నిలచియుండెను.

బంధు సమన్వితుఁడైన ఉపమన్యువును కరుణతో వీక్షించి పార్వతీదేవి నవలోకించియు మహాదేవుఁడు చిరునగువుతో “ముని కుమారా! నీ బాంధవులతో కూడ యథేష్టముగా సుఖముల ను భవింపుము! ఈ దేవి నీకు జనని యని భావింపుము! నాకు నీవు తనయుడ వైతివి. నీవు స్వేచ్ఛాధీన మరణుడవగునట్లు అనుగ్రహించితిని గాన అమరుడవని చెప్పవచ్చును. ప్రారబ్దాంతమున నా సన్నిధిని గాణాధిపతివై నివసింపగలవు ! ఇంకను పలయుచో కోరుకొనుము! ఇచ్చెద“ నని - వక్కాణించినవాడై తన అమృత హస్తములతో మునిడింభకుని తీసికొని శిరస్సు నాఘ్రాణించి అమ్మవారి తొడపై కూర్చుండఁజేయగా మహేశ్వరి మునికుమారుని దయతో చూచి శివధ్యానయోగనిష్ఠ గల బ్రహ్మవిద్యను ప్రసాదించెను.

అంత ధౌమ్యా గ్రజుఁడైన ఉపమన్యుపు- శివధ్యానయోగ నిష్ఠాగరిష్ఠుఁడగుటయే గాక ఎల్లకాలము కుమారుఁడై యుండుటను దేవి వలనఁబడసి మహేశ్వరునకు మాటి మాటికి మోకరిల్లుచు “దేవ దేవేశ్వరా! నీయందు నాకు అనన్యభక్తిని భస్మ రుద్రాక్షమంత్ర ధారణాదుల యందు శ్రద్ధను, నేను కోరెడు ప్రతిసమయమున నీ సాక్షాత్కరమును ప్రసాదింపుము! “అని ప్రార్థింపగా మహేశ్వరుడు సంతసించి - వరముల నొసఁగినవాడై అంతర్థానముఁజెందెను.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (107)వ అధ్యాయము.