లింగ మహా పురాణము
16 - ఈశాన బ్రహ్మ సముద్భవము - పంచబ్రహ్మ స్తోత్రంబు
సూతుఁడు చెప్ప నారంభించెను.
విశ్వరూపము అను కల్పమునందు పూర్వ కల్పాంతము నందలి ప్రళయము తరువాత చరాచర ప్రపంచమును బ్రహ్మదేవుడు సృజింపఁదలచినవాడై పూత్రకాంక్షతో పరమేశ్వరుని ప్రార్ధింపగా,
విశ్వరూపయను మహానాదము గల దివ్యవాణితో నావిర్భవించిన ఈశానుని - విధాత - గాంచి నమస్కరించియు దిగువ విధము నుతించెను.
ఓ మీశాన! నమస్తేఽస్తు - మహాదేవ! నమోఽస్తుతే ।
నమోఽస్తు సర్వ విద్యానా - మీశాన! పరమేశ్వర!
నమోఽస్తు సర్వభూతానా - మీశాన! వృషవాహన ।
బ్రహ్మణోఽధిపతే తుభ్యం - బ్రహ్నణే బ్రహ్మరూపిణే ॥
నమో బ్రహ్మాధిపతయే - శివం మేఽస్తు సదాశివ ।
ఓంకారమూర్తే దేవేశ - సద్యోజాత! నమోనమః ॥
ప్రపద్యే త్వాం ప్రపనోఽసి - సద్యోజాతాయ వై నమః ।
అభవేచ భవే తుభ్యం - తథా నాతిభవే నమః ॥
భవోద్భవ! భవేశాన! - మాం భజస్వ మహాద్యుతే ।
వామదేవ నమస్తుభ్యం - జ్యేష్ఠాయ వరదాయ చ ॥
నమో రుద్రాయ కాలాయ - కలనాయ నమోనమః ।
నమో వికరణాయైవ - కాలవర్ణాయ వర్ణినే॥
బలాయ బలినాం నిత్యం - సదా వికరణాయ తే ।
బల ప్రమథనాయైవ - బలినే బ్రహ్మరూపిణే ॥
శ్లో॥ సర్వభూతేశ్వరేశాయ - భూతానాం దమనాయ చ ।
మనోన్మనాయ దేవాయ - నమస్తుభ్యం మహాద్యుతే ।
వామ దేవాయ వామాయ - నమస్తుభ్యం మహాత్మనే ।
జ్యేష్ఠాయ చైవ శ్రేష్ఠాయ - రుద్రాయ వరదాయ చ ॥
కాలహంత్రే నమస్తుభ్యం - నమస్తుభ్యం మహాత్మనే ॥
(ఈ స్తోత్రమునందు - పరమేశ్వరుని పంచబ్రహ్మమూర్తులలో - ఈశాన సద్యోజాత వాసుదేవ మూర్తులు కీర్తింపఁబడినవి. తత్పురుష అఘోర మూర్తులు తదుపలక్షితములుగా ఇందు చేరినవని భావింపవచ్చును.)
ఇట్లు చతుర్ముఖుఁడు ఈశానుని స్తుతించి మరల ప్రణమిల్లగా ఈశానుఁడు సంతసించి “వలయునది అడుగుము” అని కరుణించినందున విధాత యిట్లు ప్రశ్నించెను.
పరమేశ్వరా! మహానాదము గల వాక్కు స్వరూపముగా నున్నట్టి ఈమె ఎవరు? నాలుగు కాళ్లు, నాలుగు ముఖములు, నాలుగు కొమ్ములు, నాలుగు కోఱలు, నాలుగు స్తనములు, నాలుగు చేతులు, నాలుగు కన్నులును గల యీ మూర్తి విశ్వరూప యని పేర్కొనబడెనెట్లు? ఈమె నామధేయము గోత్రము ఎట్టివి?
పరేశ్వరు డిట్లు వచించెను.
నే చెప్పునది - రహస్యమని భావింపుము! ప్రస్తుతము విశ్వరూప కల్పము ప్రవర్తించుచున్నది.ఎచ్చోట నీవు నన్ను ప్రార్థించితివో అయ్యది బ్రహ్మస్థానమనఁబడును. నిన్ను మించిన శ్రీహరి నా ఎడమ భాగము నుండి యుద్భవించి వైకుంఠము అను ఉత్కృష్టపదమునందుండువాడు. ఇయ్యది ముప్పది మూడవ కల్పము. ఇట్టికల్పములు నూర్లకొలది వేలకొలది గడువనున్నవి. గోరూపముగా కనబడు మూర్తి ఆదిశక్తి యనియు, ఆనందమనియు, విద్యయనియు, ప్రకృతి యనియు వ్యవహరింపబడును. మాండవ్య సగోత్రుఁడగు ఈ శాసుడు తపస్సుచే నాకు కుమారుడైనందున నీ సృష్టికి సహకరింపఁ గలుగును. ఈశానునకు ప్రకృతికి నభేదమును పాటింపవలెను.
1. చిత్తవృత్తి నిరోధ (యోగ)ము, 2. సాంఖ్య (తత్త్వ గణన)ము, 3. తపస్సు, 4. విద్య, 5. విధి,
6. క్రియ, 7. ఋత (ప్రియభాషణ)ము, 8. సత్య (యథార్థ భాషణ)ము, 9. దయ, 10. బ్రహ్మము (వేడములు), 11. అహింస, 12. సన్మతి (నిశ్చిత బుద్ధి), 13. క్షమ ( ఓర్పు), 14. ధ్యాన
( ఏకాగ్రచిత్త)ము, 15. ధ్యేయ (ఈశ్వర సన్నిధాన) ము, 16. దమ( ఇంద్రియ నిగ్రహ)ము, 17.
శాంతి (కోపము లేకుండుట), 18. విద్య (జ్ఞానము), 19. అవిద్య (అజ్ఞానము), 20. మతి
(సద్బుద్ధి), 21. ధృతి (ధైర్యము), 22. కాంతి (వర్చస్సు), 23. నీతి (న్యాయము), 24. ప్రథ
(ప్రసిద్ది), 25. మేధ (ధారణాశక్తి), 26. లజ్జ (లోకాప వాదమునకు భయపడుట), 27. దృష్టి
(దివ్యజ్ఞానము), 28. సరస్వతి (సర్వలక్షణ సమన్వితమగు వాక్కు), 29. తుష్టి (సంతోషము),
30. పుష్టి (ఇంద్రియ పాటవము), 31. క్రియ (వేదవిహితమైన కర్మ), 32. ప్రసాదము (మనః
ప్రసన్నతయు).
ఈ ముప్పది రెండు గుణములు నా వలన ఆదిశక్తి యనఁబడు మూల ప్రకృతి ద్వారా సంక్రమించినవి. విష్ణువునకును నావలన ప్రకృతి ద్వారా - సంక్రమించినవి. అందువలన విష్ణువునకు నీకును ఇంద్రాదులకు నీ మూల ప్రకృతియే జననియై - దివ్యవాణిగా గోచరించుచుండును. గౌరి, మాయ, విద్య, కృష్ణ, హైమవతి, ప్రధానము, ప్రకృతి యను పేర్లతో తత్త్వచింతకులు ఈ మూల ప్రకృతిని వ్యవహరించుచుందురు.
శ్లో॥ అజా మేకాం లోహితాం శుక్లకృష్ణాంచిశ్వ ప్రజాం
సృజ మానాం సరూపామ్ । అజోఽహం మాం విద్ధి తాం
విశ్వరూపం – గాయత్రీం గాం విశ్వరూపాం హి బుద్ధ్యా ॥
ఈ శ్లోకము (శ్వేతాశ్వతరోపని షన్మంత్రమునకు ఉపబృంహణము)
అర్ధము:- జన్మలేనిది, మఖ్యురాలు, ఎరుపు తెలుపు నలుపు వన్నెలు గలదియు, తన రజస్సత్త్వతమోగుణముల ననుసరించి ప్రపంచ ప్రజలను పుట్టించు నదియు నగు ఆది
శక్తి (మూల ప్రకృతి)ని విశ్వరూపుడ నగు నేను అధిష్ఠించియుందునని తెలిసి కొనుము! అట్టి మూల ప్రకృతి గాయత్రియనియు, దివ్యవాణీ రూపయగు గోమాత యనియు, విశ్వరూప యనియు పేర్కొనఁబడును.
అట్టి మూల ప్రకృతి నెడబాయని ఈశానుని ప్రక్క నుండి - జటి, ముండి, శిఖండి,
అర్ధముండుడు నను నలుగురు కుమారులు ఉదయించి శివధ్యానయోగము అను శివధర్మమును శిష్యులకు సుపదేశించి వేయి దివ్యసంవత్సరముల చివరన మహేశ్వరునుపాసించి శివ సాయుజ్యము జెందినవారైరి.
ఇయ్యది “శివవిజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రాను వాద
ప్రవచనమున (16) పదునారవ యధ్యాయము.
శివ భక్తులు జపించుటకు దిగువ పంచ బ్రహ్మమంత్రములు ఉదాహరింపఁబడినవి.
- : సద్యోజాత మంత్రము: -
“ఓం సద్యోజాతం ప్రపద్యామి - సద్యోజాతాయ వై నమోనమః భవే భవే నాతి భవే భవస్వ మాం - భవోద్భవాయ నమః”
- : వామదేవ మంత్రము: -
“వామదేవాయ నమో - జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః - కలవికరణాయ నమో బలవికరణాయ నమో - బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో - మనోన్మనాయ నమః”
- : అఘోర మంత్రము:-
“అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో - ఘోరఘోర తరేభ్యః
సర్వేభ్య స్సర్వశర్వేభ్యో - నమస్తే అస్తు రుద్రరూపేభ్యః”
- : తత్పురుష మంత్రము: -
“తత్పురుషాయ విద్మహే - మహాదేవాయ ధీమహి - తన్నోరుద్రః ప్రచోదయాత్”
- : ఈశాన మంత్రము: -
“ఈశాన స్సర్వవిద్యానా - మీశ్వర స్సర్వ భూతానాం - బ్రహ్మాధి పతి ర్ర్బహ్మణోఽ
ధిపతి ర్బహ్మ - శివో మే అస్తు సదాశివోమ్”
