లింగ మహా పురాణము
80 - కైలాసవైభవమును మరియు పాశవిమోచనమును వర్ణించుట
“దేవతలు పశుపతిని దర్శించి పశుత్వమును పాశవిమోచనము నెట్లు పొందిరి ? అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుఁడు చెప్ప దొడఁగెను.
పూర్వముకైలాసము నందలి మహోన్నత శిఖరమున “భోగ్యము” అనఁబడు పట్టణమునకు హరిబ్రహ్మలు దేవతలందరిని తోడ్కొని-శివుని సన్నిధిఁజేరి పర్వతశ్రేష్ఠమగు మేరునగరమునకు ప్రణమిల్లిరి. దేవేంద్రుఁడు, సాధ్యులు, యముఁడు మొదలగు వారును గిరివరమునకు మ్రొక్కులిడిరి.
అంత శ్రీహరి గరుత్మంతునిపై నుండి దిగి దేవతలందరితో గూడ మేరుపర్వతముపైకి వెళ్లుచుండెను.
మేరు భూధరము దోషములు లేనిదై సమస్తభోగముల నొసఁగునదియై సంతోషముతో ఆడుచున్న మృగములు గలదియునై యుండెను.
మరియు నచ్చోట మధుర గీత నాదము; చరియల వెనుకవైపులయందు చీకటియు; మనోహరములైన పిల్లగాలులతో కూడిన ఉదకప్రవాహములు; నూర్లకొలది వేలకొలది దివ్య భవనములు; లలితగమనము గల రాజహంసలు; చందనాదివృక్షములు; కోయిలలు మున్నగు పక్షుల యొక్క. తుమ్మెదల యొక్కయు తియ్యని కూతలు, వివిధశిఖరములును కనబడుచు వినబడుచుండెను.
అట్టి మేరుపర్వతము యొక్క పైభాగమున విశ్వకర్మ నిర్మితమగు పట్టణమున గల
కైలాసశిఖరమునందు ప్రథమ ప్రాకారముఁదగు మహాద్వారమున శ్రీహరి, బ్రహ్మదేవుఁడును ప్రవేశించి. ద్వితీయ ప్రాకారము యొక్క మహాద్వారమును, తృతీయ ప్రాకారమునకు గల మహాద్వారము నతి క్రమింపగా అచ్చోట దేవతారమణులు శ్రీహరిని పరివేష్టించి, కుంకు మవుష్పాక్షతలను గోవిందుని శిరస్సుపై చల్లుచుండిరి. మరియు శ్రీహరి యొక్క మనోహర రూపము గాంచి కామపూరితనయనలై ఆడుచు పాడుచుండిరి.
కొందరు కేశవు నవలోకించి చిరునగువు గలవారై కొంగులు జారుచుండగా మొలనూళ్లు క్రిందికి పడుచుండగాను మదన వికారములఁ జూపెట్టుచుండిరి.
ఇట్లే – నాలుగవ - ఐదవ - ఆరవ – ఏడవ - ఎనిమిదవ – తొమ్మదవ - పదియవ ఆవరణములదాటి పదునొకఁడవ ప్రాకారమున మహా ద్వారము గుండా లోనికి చోఱబడిరి.
అచ్చోట సూర్యమండలము బోలిన సౌధము (మేడ) లు స్ఫటిక మణిమయమండపములు నానాభూషణాలంకృత గోపురములు ఇరువది యెనిమిది మహాద్వారములు గుహ్యమందిరములు గుప్త గ్రహములు, కుమార స్వామిభవనములు, గణపతి మందిరములును, ప్రమథగణ నివాసములు శ్రీగంధ వృక్షాది సమన్వితములగు ఉద్యానవనములు సువర్ణసోపానములు (మెట్లు) గల నడబావులు - తటాకములు “స్త్రీగమనము బోలిన నడకగల రాజహంసలు, నెమిళ్లు, కన్నెలేడిపక్షులు, కోయిలలు, జక్కవ (చక్రవాక) పక్షులు” ననువానితో శోభించు వాపీకూపతటాకములు, విలాస వాక్యచతురలు సర్వాభరణభూషితలు స్తనభారనమ్రలు మదఘార్ణితలోచనలు సంగీతముల నాలపించుటలో నేర్పు గల వేలకొలది రుద్రకన్యలు కనుల విందు గొలుపుచుండిరి. అమరులకు గూడ లభింపని అప్సరోగణనాట్యములు దృశ్యమానములగుచుండెను.
ఏతాదృశమహావైభవము గల మహేశ్వర నివాసము నవలోకించి హరి బ్రహ్మాది దేవతలు అచ్చెరువు నందుచు నిలువబడిరి. మరియు నచ్చోటనే వేలకొలది రుద్ర గణములు, స్ఫటిక సౌధములు, శిఖరములపై సంతోషస్వాంతలైన తరుణులు, యక్షులు, కిన్నర స్త్రీ పురుషులు, సిద్ధకన్యకలును కనబడుచుండిరి. అట్టి తఱి దేవేంద్రాదులు పరమేశ్వరుని భవనము యొక్క ద్వారమున వేత్ర హస్తుడై యున్న నందికేశ్వరుఁగాంచి ప్రణమిల్లగా నా మహాత్ముడు “అమరులారా ! మీ రాకకు కారణంబేమని యడిగెను.
అంత దేవతలు - తొల్లి- “త్రిపురాసురసంహారకాలమున మీరందరు సంసార పాశబద్ధులగుటచే పశువులన బఱగుదురు” అని మహేశ్వరుడు సెలవిచ్చి యుండెను. “అట్టి పశుత్వమును బాపుకొనుటకు ముహేశ్వరుని ప్రార్ధింప నేతెంచితి” మని నుడువగా శిలాదతనయుఁడు హరి బ్రహ్మాదులకు పరమేశ్వరుని దర్శింప జేసెను.
అంత నవ్వారు శివుని దర్శించి గగుర్ఫాటు గలవారై పార్వతీ పరమేశ్వరులకు సాగిలఁబడి అనేక విధములుగ నుతించియు- “పశుత్వమును తొలగించు వ్రతము నుపదేశింపు” మని వేడుకొనఁగా మహేశ్వరుఁడు –
శ్లో॥ అథ ద్వాదశ వర్షం వా-మాసద్వాదశకం తు వా । దినద్వాదశకం వాపి- హ్యజన్మాంత మథాపి వా ॥ శ్లో॥ ప్రతం పాశపతం కృత్వా-పశుః పాశై ర్విముచ్యతే । భస్మరుద్రాక్షమంత్రాంశ్చ శివలింగం చధారయేత్ ॥
“పాశుపత వ్రతము భస్మధారణాత్మకము, భస్మరుద్రాక్షధారణాత్మకము, భస్మరుద్రాక్షమంత్ర ధారణాత్మకము, భస్మరుద్రాక్ష మంత్రశివలింగ ధారణాత్మకంబు నని చతుర్విధంబగును. ఇవ్వానిలో మొదటిదాని కన్న రెండవది, దాని కంటే మూడవది, తడపేక్షయా నాలుగవది శ్రేష్ఠములగును. ప్రథమ ద్వితీయవిధములను పన్నెండు వత్సరములైనను, పండ్రెండ్రు నెలలైనను, పదిరెండు దినములైనను కామ్యములుగా చేయవలెను. తృతీయ చతుర్థవిధముల నా జన్మాంతము ఆచరింపవలసియుండును.” అని యుపదేశించి హరిబ్రహ్మాది దేవతలందరికి తమ తమ యభీష్టానుసారము పాశుపతదీక్ష నొసగగా అవ్వారు పాశుపతవ్రతము నాచరించి సంసారపాశవిముక్తులైరి.
ఇందుకు శ్రుతి ప్రమాణమిట నుదాహరింప బడుచున్నది.
“వ్రత మేతత్ పాశుపతం తత్సమాచరే స్ముముకు రపునర్భవాయ”
ఇయ్యది - పాశుపతవ్రతము, దీనిని ముముక్షువు పునర్జన్మలేకుండుటకై గురూపదిష్టుడై ఆచరింపవలెను.”
మరియొక శ్రుతివాక్యముఁదగు నిర్వచనము నవధరింపుఁడు !
“ తస్య తావదేవ చిరం- యావన్న విమోష్యే అథ సంపత్స్యే”
“తస్య = పాశుపత వ్రత ముఖ్యమగు శివలింగధారణ జేసి జన్మాంతము వరకు శివలింగము నెడబాయక ప్రతిదినము నర్చించు మాహేశ్వరునకు యావత్ ఎంతవరకు న విమోక్ష్యే శరీరమునుండి విడుదల కాదో; తావదేవ- అంత వరకే; చిరం = అవధి; అథ = శరీరవిమోచనానంతరమే; సంపత్స్యే = లర్చిరాదిగతి ద్వారా శివుని పొందును. అనగా - పునరావృత్తిరహితమగు శాశ్వత శివసాయజ్యము లభించు నని భావము.
పాశుపతులగు హరిబ్రహ్మాదులు “ప్రారబ్ధాంతమున శివసాయజ్య భాజనులమైతి” మని భావించి తమ తమ నివాసములకుఁజని సుఖముగ నుండిరి.
ఇట్లు బ్రహ్మదేవుడు సనత్కుమారునకు; సనత్కుమారుడు వేదవ్యాసునకు; సాత్యవలేయుఁడు నాకు నుపదేశించినట్లు పాశుపతవిధానమును వక్కాణించితిని.
దీనిని వినినవాడు, ద్విజులకు వినుహించినవాడును తమ దేహాంతమున పశుత్వమును విడనాడి విముక్తుఁడగును.
అని సూతుఁడు నిర్వచించి విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (80)వ అధ్యాయము.
