లింగ మహా పురాణము

Table of Contents

26 - సంధ్యావందన - బ్రహ్మయజ్ఞ తర్పణాది నిరూపణము

నందికేశ్వర ఉవాచ = నందికేశ్వరుఁడు సనత్కుమారునకు దిగువతేఱుగున చెప్పఁ దొడంగెను.

స్నానానంతరము విభూతి రుద్రాక్షలఁధరించి “ఆయాతు వరదా దేవీ “ ఆనుదానితో గాయత్రీ దేవికి పాద్యమును ఆచమనీయమును ఆర్ఘ్యము నొసగి సూర్యునకు గాయత్రీ మంత్రమును ముమ్మారు, కాలాతిక్రమణమైనచో నాలుగవమారు అర్ఘ్యమును కూర్చుండిగాని నిలువఁబడి గాని ప్రాఙ్ముఖుడై సమర్పింపవలెను. (అనగా దోసిలిలో జల గంధపుష్పా క్షతల నునిచి సూర్యునకు చూపి పళ్లెరముతో విడువవలెనని తెలియునది.)

తరువాత గాయత్రీదేవిని ధ్యానించి గాయత్రీమంత్రమును 1000, 500, 108 అను ఉత్తమ మధ్యమ కనిష్ఠ సంఖ్యలలో నేడే నొక సంఖ్యగా ఓంకారముతో కూడ జపింపవలెను. జపానంతరము “ఉత్తమే శిఖరే జాతే’’ ఇత్యాది మంత్రము నుచ్చరించుచు గాయత్రీ దేవిని స్వస్థానమునకు పంపి తూర్పు దిసకు మ్రొక్కియు “ఉదుత్యం” “చిత్రం” “జాతవేదసం” అను మంత్రములతో సూర్యు నభి వందించియు బ్రహ్మదేవున కభివాదముఁ జేయవలెను. ఆ పిదప ఋగ్యజు స్సామవేద ప్రోక్తములగు సౌర సూక్తములఁ బఠింపవలెను.

ఇంక తర్పణముఁ గూర్చి చెప్పుచున్నాను. 

మొదట దేవతర్పణము, తరువాత ఋషి తర్పణము ఆపిమ్మట పితృతర్పణము కర్తవ్యములగును. తూర్పు లేక ఉత్తరం ముఖముగా దేవతలకు కుడి చేతి వ్రేళ్ల కొనల మీదుగామ, ఋషులకు చిటికెన వ్రేలు మొదటి మీదుగాను. పితరులకు బొటన వ్రేలు మీదుగాను ఉదకము   
నెడమచేతి ఉద్ధరిణితో కుడిచేతిని పోయుచు విడువవలెను. ఇది దేవర్షిపితృతర్పణము యజ్ఞోపవీతమును సవ్యముగా దేవతర్పణ మునందు; మాలాకారముగా ఋషి తర్పణము నందు; అపసవ్యముగా పితృతర్పణమునందు ధరింపవలెను. దేవతర్పణమునందు ఒకమారు, ఋషి తర్పణమున రెండు పర్యాయములు,పితృతర్పణమునందు మూడు తడవలు ఉదకమును విడువవలసియుండును.

పితృతర్పణములో దివ్యపితరుల గూర్చి జందెము నపసవ్యముగాను స్వపితృతర్పణమునందు సవ్యముగాను ధరింపవలెను. బ్రహ్మయజ్ఞమును అనగా నాలుగు వేదముల మంత్రములను వేదాంగసూక్తములను ఎడమ అరచేతిలో ఉదకమునునిని, దానిపై కుడిచేతిని మూసి - కుడిమోకాలుపై పెట్టి వేదవేదాంగములను చదువ వలెను. బ్రహ్మయజ్ఞానూతరమే తర్పణము జేయుట – ప్రశస్తము - తరువాత - దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము,   భూతయజ్ఞము, పితృయజ్ఞము అను ( బ్రహ్మయజ్ఞముతో కూడ) పంచయజ్ఞముల  నాచరింపవలెను.

తన వేదశాఖ యందలి మంత్రములు మున్నగువానిని పఠించుట బ్రహ్మయజ్ఞమనబడును.అగ్నియందు అన్నమును వ్రేల్చుట వైశ్వదేవము అను దేవయజ్ఞ మగును. ఇంటి ముందు శునకాది ప్రాణులకు అన్నాడుల నొసగుట భూతయజ్ఞమగును. ఉత్తములు గృహస్థులు నగు బ్రాహ్మణాదులకు భోజనము నొసగుట మనుష్యయజ్ఞ మనఁ బఱుగును. పితరుల నుద్దేశించి చేయబడు దానము శ్రాద్ధంబు పితృయజ్ఞమని చెప్పబడును.

ఈ ఐదు యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము ముఖ్యమైనది. బ్రహ్మయజ్ఞము వలన - బ్రహ్మవిష్ణు మహేశ్వర దేవేంద్రాది అమరులందరు సంతోషింతురు. మరియు పితరులును ప్రసన్నులగుదురు, వేద వేదాంగములు అష్టాదశ మహాపురాణములు, ఉపపురాణములు, ఇతిహాసములు ఆగమములును ప్రసన్నములుగ నుండును.

 అనంతరము నదీ తటాకాది సన్నిధి నుండి బయలుదేరి ఇల్లు జేరి పాద ప్రక్షాళము నొనర్చియు భస్మస్నానముఁ జేయవలెను. శుద్ధాగ్ని సంభవంబగు విభూతిని ప్రణవముతో శోధించి తడిపియు ఈశాన మంత్రముతో శిరస్సునందు, తత్పురుషమంత్రమున నొసలునందు, అఘోర మంత్రముతో ఱొమ్ముపై కడపుపైనను, వామదేవ మంత్రముతో నడుము పైనను, సద్యోజాత మంత్రముతో పాదముల యందును, సమస్త శరీరమునందు ప్రణవముతోడను మూడు రేఖలు ధరింపవలెను.

భస్మస్నానమునకు ముందు ఆపోహిష్ఠాది మంత్రముల (జదువుచు ఉదకప్రోక్షణము అను మంత్ర స్నానము నొనర్పవలెను.

 ఇట్లు ఆచరించిన మహా పురుషుడు శివానుగ్రహపాత్రుడై ప్రారబ్దాంతమున కైలాసము (జేరి శివానందము ననుభవించును.

ఇయ్యది ”శివవిజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (26) ఇరువది యారవ అధ్యాయము.