లింగ మహా పురాణము
10 - శివానుగ్రహాది నిరూపణము
జితేంద్రియులు, ధర్మాధర్మజ్ఞులు, శివుఁడే తమ ప్రాణమని భావించు వారు, భూతదయ గలవారు, అనుష్ఠాన పరులు. వైరాగ్యముతో కర్మఫలము నపేక్షింపనివారు. దానకర్తలు, సత్యవాదులు, లుబ్ధులు కానివారు, శ్రుతిస్మృతి విదులు, శ్రౌత స్మార్తములకు విరుద్ధము కానట్టి ప్రవర్తనగలవారు, శివధ్యాన యోగులు నగు సత్పురుషులను మహేశ్వరుఁడను గ్రహించును. సత్అనగా బ్రహ్మము; అట్టి బ్రహ్మమును ప్రారబ్దాంతము నందు పొందువారు సంతులని చెప్పబడుదురు. అనగా పై లక్షణములు గలవారు శివానుగ్రహము వలన శివసాయుజ్యము నొందుదురని భావము. (సత్= బ్రహ్మ; అంతే లభంతీతి సంతః” అని లింగపురాణ నిర్వచనము.
దశ ఇంద్రియముల విషయముల యొక్కయు యోగసాధనముల యొక్కయు ప్రాప్తివిషయమైఆ ప్రాప్తియందును సంతుష్టులు కృద్ధులుకాని వారు జితేంద్రియులనఁబడుదురు. వర్ణాశ్రమ సదాచారమును స్వర్గాది సుఖ ప్రదమగు రౌత స్మార్త ధర్మమును క్షుణ్ణముగా తెలిసికొని ఆచరింపజేయువాడు -- ధర్మజ్ఞుడనబఱఁగును. విహితమైనబ్రహ్మచర్యమునుపాటించుచు-కర్మ సముచ్చితజ్ఞానము నవలఁబించు గృహస్థుడుసాధువనబడును.అరణ్యమునందుతపస్సు నాచరించువాడు వైఖానసుఁ (వానప్రస్థుఁ) డనబడును. యోగసిద్ధికై యత్నించువాడు యతి యని చెప్పఁబడును. కుశల(క్షేమ)మునొసఁగునది ధర్మమనియు కీడు నిచ్చునది అధర్మమనియువివేకము. ప్రజలను అభివృద్ధిఁ జెందించుచు ధరించునది ధర్మమనఁబడును. ప్రజలకు మొదలు బాగుగా కనుపడినను చివరకీడుకలుగజేయునదిఅధర్మమగును.
వృద్ధులు ఆసక్తి లేనివారు బుద్ధిమంతులు, డాంబికులు కానివారు, బాగుగా వినయము గలవారు సరియైన ప్రవర్తనగలవారు నగు ఉత్తమ పురుషులు ఆచార్యులనఁబడుదురు.తానుధర్మమునాచరించుచుఇతరులచే ఆచరింపజేయుచు శాస్త్రార్థముల నెరిఁగినవాడు ఆచార్యుఁ డగునని మరియొక నిర్వచనము.
వినుట వలన శ్రౌతకర్మను; స్మరించులతో స్మార్త కర్మను గుర్తించు యజ్ఞాదికమగు శ్రౌత కర్మను, వర్ణాశ్రమాచార ప్రయుక్తమగు స్మార్త కర్మ నాచరింపవలెను.
ఎవరైన అడిగితే ఏమాత్రము దాపరికము లేకుండా చూచినది చూచినట్లు చెప్పుట సత్యమని లింగమహాపురాణ నిర్వచనము.
బ్రహ్మచర్యము, మౌనము (మితసంభాషణము) నిరాహారము (అల్పాహారము) అహింస,జీవాత్మలందరి విషయమై శాంతి కలిగియుండుటయు తపస్సు అని చెప్పఁబడును.
తనకు వలె నితరులకు మేలు కీడులగునని భావించి అల్లు ఎల్ల కాలము ప్రవర్తించుట-భూతదయ యగును. ఎవరెవరికి ఏదేది ఇష్టమో దానిదానిని న్యాయముగా సంపాదించి సద్గుణవంతునకు సమర్పించుట - దాన మగును. ప్రాణులందరికి దయతో నొసగుటచే దానము సార్థకమగును. శ్రుతిస్మృతులయందు చెప్పబడినది, వర్ణాశ్రమా చారయుక్తము శిష్టాచారమునకు విరుద్ధము కానిదియు నగు ధర్మము శ్రేష్ఠమగును.
మాయామోహమును కర్మఫలమును విడిచి శివుని యందే మనస్సు గలవాడై సర్వసంగ పరిత్యాగము నొనర్చువాడు శివయోగి యనఁబటఁగును. ఇంద్రియ సుఖములు హానికరములని భావించి వానియందు ఆసక్తి లేనివాడై ఎవరైన కోరినను విషయసుఖమును అంగీకరింపక నుండులు శమ మనఁబడును. కర్మఫలము ఎంత గొప్ప దైనను దాని నపేక్షింపకుండుట సన్న్యాసమగును. అవ్యక్తము మొదలగు అచేతనమునందు ఆసక్తి లేకుండులు జ్ఞాన మనఁబడును.
శ్లో॥ ఏవంతు జ్ఞానయుక్తస్య - శ్రద్ధాయుక్తస్య శంకరః ।
ప్రసీదతిన సందేహో - ధర్మశ్చాయం ద్విజోత్తమాః ॥
ద్విజోత్తములారా! పై చెప్పబడిన జ్ఞానము కలిగి శ్రద్ధతో కూడుకొనిన వాని విషయమై - శంకరుఁడు ప్రసన్నుఁడగును. ఇదియే సర్వ శ్రేష్ఠమైన ధర్మముగా చెప్పఁబడుచున్నది.
జ్ఞానము - అధ్యాపనము ( ఇతరులకు వేదశాస్త్రములను నేర్పుట) హవనము, ధ్యానము, యజ్ఞము, తపస్సు, శ్రుతము, దానము, వేదాధ్యయనము ఈ మొత్తము శివునియందు భక్తి కలుగలుకే ఉపయోగించవలెను. ఇందెంతమాత్రము సంశయము లేదు. వేలకొలది చాంద్రాయణములతో సూర్లకొలది ప్రాజాపత్యముల తోడను మాసోపవాసముల వలనను శివభక్తి కలుగును. ఈ లోకమున శివునియందు భక్తి లేనివారై తమ సుఖము కొరకు యజ్ఞాదులను ఆచరించువారు సంసార కూపమునందు
పడుచుందురు.
శివభక్తుఁడు భక్తి భావముతోడనే ముక్తుఁడగును.
శివభక్తులను దర్శించి సత్కరించువారికే స్వర్గాది భోగములు లభించు చుండగా శివభక్తులకు లభించునని వేరు చెప్ప నవసరము లేదు. బ్రహ్మవిష్ణు దేవేంద్రులు ఇతరులును శక్తి సామర్ధ్యములతో తమ లోకములయందు స్థిరులై యుండుట- శివభక్తి వలననే యని తెలియవలెను. పూర్వము కాశీక్షేత్రమున పరమేశ్వరుడు అమ్మవారికి ఈ విషయమునంతయు వక్కాణించెను.
అట్టతఱి అన్నపూర్ణాదేవి విశ్వనాథునిట్లు ప్రశ్నించెను.
శ్లో॥ కేన వశ్యో మహాదేవ - పూజ్యో దృశ్య స్త్వ మీశ్వరః ।
తపసా విద్యయా వాఽపి - యోగేనేహ వద ప్రభో ॥
మహాదేవా! ప్రభో! నీవు దేనిచేత వశ్యుడవు దృశ్యుఁడ వగుదువో; తపస్సు చేతనా? జ్ఞానము చేతనా? యోగము చేతనా? వచింపుము!
శ్వేత వరాహ కల్పము నందు బ్రహ్మదేవుఁడు- నా యొక్క సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మూర్తులఁ గాంచి యిట్లే ప్రశ్నింపగా - శ్రద్ధ (పట్టుదల) చేతనే వశ్యుడ నగుదునని చెప్పితిని.
మరియు -
శ్లో॥ ధ్యేయో లింగే త్వయా దృష్టే - విష్ణునా పయసాం నిధౌ ।
పూజ్యః పంచాస్యరూపేణ - పవిత్రైః పంచభిర్ద్విజైః ॥
చతుర్ముఖా! నీవు విష్ణుమూర్తియు మహాసముద్రమధ్య నవలోకించిన శివలింగమునందు నన్ను ద్విజులు మాత్రము (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు) సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములనబడు ఐదు ముఖములు గలవానిగా - ధ్యానించి పవిత్రములైన సద్యోజాతాది పంచ బ్రహ్మమంత్రముల నుచ్చరించుచు పూజింపవలెను. అందువలన నీ లింగార్చనకు- శ్రద్ధయే ముఖ్యసాధనమని తెలిసికొనుము! శ్రద్ధవలననే స్వర్గము మోక్షము చేకూరును. శ్రద్ధ గలవారికే నేను ప్రత్యక్ష మగుదును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (10) పదియవ యధ్యాయము.
