లింగ మహా పురాణము

Table of Contents

4 - చతుర్థాధ్యాయము

“శ్రీ వైష్ణవుల లక్షణములను వివరింపు” మని శౌనకాదులు అడుగగా సూతుడు

చెప్పదొడగెను.

ఇదే విషయమును గురించి అంబరీషుడు ప్రశ్నింపగా మార్కండేయుఁడు దిగువవిధము నిర్వచించెను.

విష్ణు భక్తుడు ఉండుచోటు విష్ణుభగవానుఁడు గుప్తరూపముతో నివసించును. సర్వత్ర సర్వావస్థలయంచు నారాయణునినే స్మరించుచు హరికీర్తనము జరుగుచుండగా వినుచు పుల కాంకురములు (గగుర్పాటు) కలిగియుండుటయు; ఆనందముతో కన్నీళ్లు కార్చుటయు; శ్రౌతస్మాత్త ప్రవర్తకులగు వైష్ణవులఁజూచి సంతోషించుటయు, తన ఒడలు పై ధోవతి దక్క నితరవస్త్రములను వాడకుండుటయు, వైష్ణవుడు తన చెంతకు వచ్చుచుండగా ఎదురేగి ప్రణమిల్లుటయు, ఎదుటివాడు కఠినముగా మాటలాడినను ఓర్పుతో ప్రియసంభాషణముల జేయుటయు; శ్రీహరికి సమర్పింపబడిన గంధమును పుష్పాదికమును “సమస్తము విష్ణువుదే” నను భావనతో శిరస్సున ధరించుటయు, విష్ణు క్షేత్రమున శుభకార్యముల నొనర్చుచు శ్రీహరివిగ్రహమును మనో వాక్కాయ (త్రికరణ) శుద్ధి నర్చించుటయు; శ్రీవైష్ణవులకు భోజన పానీయాదులను యుథాశక్తి నొసగుటుయు; వైష్ణవుడు భుజించు ఆహారమునారాయణుని జెందునని భావించుటయు, “తనను పూజించుటకన్న మించినది తన భక్తుని పూజంచుట” యని శ్రీహరి భావించును గుర్తించుటయు, వైష్ణవును లక్షణములుగ పరిగణింపబడును.

వాసుదేవపరుఁడైన వైష్ణవుని గాచి దేవతలు కూడా నమస్కరించి వెళ్లుతురు. పూర్వము యముఁడు కూడా విష్ణు భక్తుడు చ్యవనుని ప్రాంజలియై సమస్కరించెను అందువలన విష్ణు భక్తు నవలోకింపగానే విష్ణువును వలె సత్కరింపుట వైష్ణవుని కర్తవ్యమగు ననియు వైష్ణవులను పూజంచువాడు ప్రారబ్దాంతమున వైకుంఠముఁజేరి విష్ణు సాయుజ్యముఁజెంచుననియు. ఇతర దేవతాభక్తులను మించినవాడు విష్ణు భక్తు డనియు, గ్రహింపవలసియుండును.

మరియొక రహస్యమును చెప్పుచున్నాను,

శ్లో॥ విష్ణు భక్త సహస్రేభ్యో - రుద్రభక్తో విశిష్యతే ।

రుద్రభక్తాత్ పరతరో-నాస్తి లోకేన సంశయః ॥

“లోకమున వేలకొలది విష్ణు భక్తుల కంటే శివభక్తుడు మిన్న యగును. భక్తుని మించిన వాడు లేడు. ఇందెంతమాత్రము సంశయము లేదు.”

విష్ణు భక్తుని పూజించుట కన్న శివభక్తు నారాధింపులులో విశేషఫలము కలదని ఇందు విదితమైనది.