లింగ మహా పురాణము
24 - వ్యాస యోగాచార్య నిరూపణము
ఇవ్విధము పరమేశ్వరుఁడు వక్కాణింపగా - బ్రహ్మదేవుడు నమస్కరించి “దేవదేవా! ఉమాపతే లోకవందితములైన నీయవతారములలో ఏయే రూపమును ఏయే యుగమున బ్రాహ్మణాది ప్రజలు దర్శించెదరు? తపస్సు మున్నగు వానిచే తనా?” ధ్యానయోగము వలననా? అని ప్రశ్నించెను.
అంత మహేశ్వరుఁడు చిరునగవులో ఇట్లు చెప్పఁదొడఁగెను.
తపస్సు, సత్ప్రవర్తనము, దానధర్మాచరణము. తీర్థయాత్ర, యజ్ఞములు, వేదాధ్యయనము,ధనము, శాస్త్రపాండిత్యము అనువానితో మానవులు నన్ను చూడఁజాలరు. పైసాధనములను నిష్కామ్యముగా ఆచరించుటచే కలుగునట్టి చిత్తుశుద్ధిని చేయబడు ధ్యానయోగమువలన మాత్రము నేను సాక్షాత్కరించువాడను.
ఇక నా యవతారములైన యోగాచార్యులఁ గూర్చి చెప్పుచున్నాను. వారాహ కల్పమునందు వైవస్వతమనువు - నీకు (బ్రహ్మదేవునకు) మనుమడై జన్మించును. కల్పేశ్వరుఁడనగు నేను యవతరించెదను. కృత త్రేతా ద్వాపర కలియుగములలో మొదటి ద్వాపరయు గాంతమున విష్ణువు వేద వ్యాసుడుగ నవతరింపగా నేను కలియుగ ప్రారంభమున హిమాలయ శిఖరమగు ఛాగలము అను పర్వత శ్రేష్ఠమునందు శిఖాయజ్ఞోపవీతములు. పాశుపతవ్రతంబు గల శ్వేతాచార్యుడనై ఆవిర్భవించెదను.
శ్వేతుఁడు, శ్వేతశిఖుఁడు, శ్వేతాస్యుఁడు, శ్వేతలోహితుఁడు అను నలుగురు శ్వేతాచార్య శిష్యులై శైవ ధర్మ ప్రచారము నొనర్చి ధ్యానయోగ సిద్ధిచే నన్ను పొందుదురు.
ఇంక రెండవ ద్వాపరమున “సచ్యు” డను వ్యాసుడు ఉద్భవింపగా నేను “సుతారు” డను యోగాచార్యుఁడనై కలియుగమున నవతరింతును. దుందుభి, శతరూపుడు, ఋచీకుడు, కేతుమంతుడు అనువారు సూతాఁరుడ నగు నాకు శిష్యులై భూలోకమున వైదికశైవమును ప్రభోధించి - ధ్యానయోగము నవలంబించుటవలన నా(రుద్ర) లోకము జేరి ప్రమథ గుణములతో విహరింతురు.
ఇవ్విధము వ్యాసులు, యోగాచార్యులు, తచ్ఛిష్యులు నవతరింపగా ఇరువది యెనిమిదవ మహాయుగమున - ద్వాపరాంతమున “ద్వైపాయనుఁడు” అను వ్యాసుడుగ నారాయణుఁడు ఉద్భవించును. అప్పుడు విష్ణువు - తన ఆరవ అంశతో వసుదేవునకు కుమారుఁడై - వాసుదేవుడు కృష్ణుడు నను పేరులతో జన్మించును. ఈతనికి పురుషోత్తముఁడను నామధేయము గౌణముగా వర్తించును. ఆసమయమున కలియుగ ప్రారంభమునందు నేను బ్రహ్మచారినై శ్మశానమునందు గల శవమునందు ప్రవేశించి “లకు లీశు” డను పేరు గలవాడనై నీతోడను శ్రీహరితోడను మేరు గుహ యందు నివసించి - లోకకల్యాణము నొన గూర్తును.
అట్టి మేరుగుహ - కాయాపతారమునఁబడుచు సిద్ధ క్షేత్రముగా పరిణమించును. అప్పుడు గూడలకు లీశ స్వరూపుడవగు నాకు నలుగురు శిష్యులు ఏర్పడి - ఊర్ధ్వరే తస్కులునై - మహేశ్వర ధ్యానయోగసిద్ధులునై పునరావృత్తిరహితమగు నా లోకముఁ జెందుదురు.
ఇట్లు 28 వ్యాసులు, 28 యోగాచార్యులు, 112 యోగాచార్య శిష్యులు ఉద్భవించి
పాశుపతయోగమును బ్రాహ్మణాదులకు ప్రభోధించువారని తెలియుము!
మరియు పరమేశ్వరుఁడు దిగువవిధము వచించెను.
ఈ యోగాచార్యులు వారి శిష్యులును భస్మోద్ధూళిత విగ్రహులు, శివ లింగారాధన తత్పరులు,బాహ్యమునందు అంతరంగమునందును శివుని ధ్యానించువారు, జితేంద్రియులునై సంసారబంధ విముక్తి కొరకు ఆత్మాంతర్యామిని కనుగొనుటకును పాశపతయోగము నవలంబింతురు. యోగమార్గములు, జ్ఞానమార్గములు ననేకములున్నను ప్రణవసహిత శివ పంచాక్షరీమంత్రజపము లేనిది మోక్షము చేకూరదు.
శ్లో॥ ఏ కేన జన్మనా సమ్యక్ - చరేత్ పాశుపతవ్రతం । నసాంఖ్యే పాంచరాత్రే వా - న ప్రాప్నోతి గతిం తథా ॥
ఒకే జన్మయందు పాశుపత వ్రతమును విధివిధానముగ నాచరించిన యెడల జన్మరాహిత్యముతో శివ సాయుజ్యము లభించును. ఇట్టి మహాఫలము సాంఖ్యయోగమున గాని పాంచరాత్ర ఆగమ ప్రోక్తమగు వైష్ణవదీక్షచే గాని లభింపదు.
మనువు మొదలు కొని కృష్ణుని వరకు 28 మహాయుగములందలి. అవతారములను నిర్దేశించితిని 28వ ద్వాపరమున కృష్ణద్వైపాయనుఁ డనఁబడు వ్యాసుఁడు వేదములను విభజించును.
మహా దేవుని ప్రవచనము నాలకించిన విధాత “సర్వదేవోత్తముఁడైన నారాయణుఁడు నీ (శివ) లింగార్చనము నెందుకు చేయును? నీకు ప్రణమిల్లు నెందుకు? “అని ప్రశ్నింపగా పరమేశ్వరుఁడు - “నీవు, నారాయణుఁడు దేవేంద్రుఁడు సప్తర్షులు, తదితరులును విధిపూర్వకముగ భక్తి శ్రద్ధలతో శివలింగమును నిత్యము పూజించి తమ తమ పదవులను పొందినారు గొన ఇప్పటికిని శివలింగము నర్చించుచు నాకు సాష్టాంగముగ నమస్కారము నొనర్చుచుందురు. అనియు
శ్లో॥ లింగార్చనం వినా నిష్ఠా - నాస్తి తస్మా జ్జనార్ధనః । ఆత్మనోయజతే నిత్యం - శ్రద్ధయా భగవాన్ ప్రభుః ॥
శివలింగార్చనము లేనిది శివధ్యానమునందు ఏకాగ్రత కలుగదు. అందువలన విష్ణు భగవానుఁడు తనలోని భావలింగమును బాహ్య లింగమునందు చూచుచు పట్టుదలతో నిత్యము బాహ్య లింగము నారాధించుచుండునని తెలియ వలెను.
పాశుపతవ్రతము - భస్మరుద్రాక్ష ధారణాత్మకము, భస్మరుద్రాక్ష మంత్ర స్వీకారాత్మకము, విభూతి రుద్రాక్ష శివ మంత్ర శివలింగధారణాత్మకంబునని మువ్విధంబగును. మొదటి దానితో విలంబ ముక్తి, రెండవ దానితో జన్మత్రయానంతరముక్తి, మూడవదానితో ఒకే జన్మాంతమున ముక్తి లభించును. ఇట్లు శివయోగసిద్ధులు నిరూపించిరి.
ఇవ్విధము మహేశ్వరుడు ప్రభోధామృతము గ్రోలించి బ్రహ్మదేవు నొక సారి దయతో చూచియు అంతర్ధానముఁ జెందెను. బ్రహ్మదేవుడు శంకరుని వలన సమర్థుడై పరమేశ్వరు నుద్దేశించి చోసిలొగ్గినవాడై మోకరిల్లియు జగత్తు నంతయు సజింప నుపక్రమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద
ప్రవచనమున (24) ఇరువది నాలుగవ అధ్యాయము.
