లింగ మహా పురాణము

Table of Contents

62 - ధ్రువుని చరితమును వర్ణించుట

“బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ధ్రువుఁడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమునకు పాత్రుఁడై సూర్యచంద్రాది జ్యోతిస్సులకు ఆలంబనమగు పదవి నెట్లు సంపాదించే?“ నని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుఁడు సర్వశాస్త్ర విశారదుఁడగు మార్కండేయ మహర్షి నివ్విషయము నడుగగా ఆ మహానుభావుడు చెప్పిన విధముగా వివరించెను” అని వక్కాణింప నారంభించెను.

మహాతేజస్వియగు ఉత్తానపాదమహారాజు భూమినంతటికి ఏలికయై రాజ్యమును చేయు  చుండెను. ఆ మహారాజునకు సునీతి, సురుచి యను ఇరువురు భార్యలుండిరి. పెద్ద భార్యయైన సునీతి యందు జన్మించి ఏడు వత్సరముల బాలుడైన ధృవుడు ఒకనాడు తండ్రి తోడపై కూర్చుండగా సురుచి యను సవతి తల్లి ధృవుని త్రోసి తన కుమారుని కూర్చుండఁజేసెను. సుందరరూపముతో గర్వితురాలైన సురుచిని మహారాజు వారింపఁజాలలేదు.

అందువలన ధ్రువుఁడు ఆవేదనతో కన్నతల్లి యగు సునీతికి తనకు జరిగిన అవమానవమును చెప్పుకొని దుఃఖింపగా సునీతి - తానును - దుఃఖపడినదై నాయనా! సురుచి మహారాజునకు ప్రియమైన భార్య, ఆమె కుమారుఁడును ప్రియుఁడేను; నీవిట్లు బాధపడుచునన్నెందుకు వెతల పాలు జేయుదువు?  సమర్థుఁడవై స్వప్రయత్నమున సుస్థిరమగు పదవిని సంపాదింపుము!“ అని సంభాషించగానే ధ్రువుఁడు అరణ్యముఁ జేరి నడచుచుండగా దైవవశమున ఎదురుపడిన విశ్వామిత్ర మహామునికి ప్రణమిల్లి
“సర్వోన్నత స్థానము నెట్లు పొందుదునో, సెలవీయు“ మని ప్రార్థించెను.

అట్టితఱి విశ్వామిత్రుఁడు సంతోషించి“ కుమారా! మహాదేవుని దివ్య శరీరముఁదగు కుడివైపు నుండి ఆవిర్భవించినవాడు, ఆర్తత్రాణ పరాయణుఁడునగు కేశవుని “ఓం నమో భగవతే వాసుదేవాయ“ అను ద్వాదశాక్షర మహామంత్రమును జపించుచు ఆరాధింపుము!  అని యుపదేశింపగా ధ్రువుడు నిర్జన పవిత్ర ప్రదేశమున తూర్పుముఖము గలవాడై నియమనిష్ఠలతో వాసుదేవ మంత్రమును నిరంతరము జపించుచు నొక సంవత్సరము గడిపెను. వేతాళ రాక్షసులు భయంకర మృగములును ధ్రువుని భయపెట్టినను బాలుడు ఇసుమంతయైనను చలింపనందున నయ్యవి మరలిపోయెను. ఒకానొకపిశాచిని సునీతిరూపముతో సమీపించి “కుమారా ! ఎందుకీ ఘోర తపస్సు? నన్ను విడనాడి అడవిలో నుందువెందులకు ? అని పలువిధముల పలుకుచున్నను ధ్రువుఁడు - సరకు సేయ లేదు.

 అట్టి పరాకాష్ఠతో ధ్రువుఁడు వాసుదేవునియందు నిష్ఠ గలవాడగుటచే తపో విఘ్నములన్నియు తొలగి పోయెను.

దేవతలందరు వెంటరాగా మహర్షులు పొగడుచుండగా విష్ణుభగవానుడు గరుత్మంతు నధిష్ఠించి ప్రత్యక్షము కాగా ధ్రువుఁడు చూపులతో- కేశవు నాస్వాదించుచు “ఈతఁడెవరు?” అని మనస్సులో తర్కించుచు వాసుదేవ మంత్రమును జపించుచునేయుండెను. అంత శంఖచక్రగదాధారి దరిజేరి తన శంఖముతో బాలుని ముఖమును తాకగా- ధ్రువుఁడు భగవదాజ్ఞానము గలవాడై ప్రాంజలియునై” దేవ
దేవేశ్వరా ! సనకాదులే నిన్ను పూర్తిగా గుర్తెరుఁగఁజాలరు నేనెంత వాడను నీ మహిమ (దెలియుటకు?”  అని పలువిధములఁ బ్రార్థించెను.

అంత మాధవుఁడు “వత్సా! రమ్ము, నీ తల్లితో కూడ సర్వోన్నత స్థానమున శాశ్వత
కాలము వసించుచు సూర్య చంద్రాది జ్యోతిస్సారము ననుభవింపుము!

మత్ స్థాన మేత త్పరమం- ధ్రువం నిత్యం సుశోభనం । తపఽఽరాధ్య- దేవేశం-పురా లబ్ధం హిశంకరాత్ ॥

సుస్థిరము, శాశ్వతము, సుశోభనము, నాకు సంబంధించిన నీ సమున్నత స్థానమును పూర్వము తపస్సుచే మహాదేవునారాధించి శంకరుని వలన సంపాదించితిని. అట్టి స్థానమునే నీ కొసగుచున్నా” నని యనుగ్రహించెను.

అటు పిమ్మట - అమరులు గంధర్వులు సిద్ధులు మహర్షులును శ్రీహరి యొక్క ఆజ్ఞతో డ్రువుని సునీతితో సహ మహోన్నత స్థానమున ప్రవేశింపఁజేసిరి. ధ్రువుఁడు మహాజ్యోతిస్సుగాను సునీతి తారగా నచ్చోట ప్రకాశించుచుండిరి.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక’ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (62) అరువది రెండవ అధ్యాయము