లింగ మహా పురాణము

Table of Contents

47 - శివలింగస్థాపనవిధిని ఫలశ్రుతితో సహ ప్రతిపాదించుట

“శిపలింగ ప్రతిష్ఠా విధానమును వివరింపుము.” అని శౌనకాదులు ప్రశ్నింపగా
సూతుడు చెప్పదొడగెను.

శిలామయాది లింగములలో నేదే నొక శివ లింగమును ప్రతిష్ఠించవలెను. శక్తి శివాత్మకము,బ్రహ్మవిష్ణుమహేశ్వరాత్మకంబు నగు శివలింగము. సువర్ణమయము గాని, రత్నమయము గాని, రజత (వెండి) మయము గాని, యపయుక్తమగును. మరియు వేదికతో కూడినదై పంచసూత్ర ఘటితంబునై యుండవలెను.
శివ లింగము - శక్తి శివాత్మక మెట్లనఁగా?

శ్లో॥ లింగవేదీ ఉమాదేవి - లింగంసాక్షా న్మహేశ్వరః ॥

 శివలింగము యొక్క వేదిక (పానపట్టము) సార్వతీ దేవి కాగా - పిండము సాక్షాత్తు
మహేశ్వరుఁడగును గాన శివలింగమును ప్రతిష్ఠించి పూజించినచో - శక్తి శివులను స్థాపించి యర్చించిన ఫలము చేకూరును. లింగమూలమునందు బ్రహ్మదేవుడు మధ్య భాగమున శ్రీహరి - పై భాగమున మహేశ్వరుడుండునని మరియొక నిర్వచనము.

అందువలన - సృష్టి స్థితి లయములకు ఆధారమగు శివలింగమును యథావిధిగా స్థాపించి  - పూజింపవలెనని యిటు విదితమైనది.

 అభిషేకము భస్మగంధాక్షతలు పుష్పబిల్వములు ధూపదీపనైవేద్యములు స్తోత్రపాఠము మంత్రజపము ఇత్యాద్యుపచారములతో నిత్యము శివలింగము నారాధించువారు - జన్మజరావ్యాధి మరణరహితులై - చేవతలు గంధర్వులు సిద్ధులు ప్రమథగణములును తమను ప్రశంసించుచుండగా – మహాకైలాసముఁజేరి - శివసాయుజ్యము నొందుదురు.

శివలింగమును దర్భ కూర్చ వస్త్రాదులతో నాచ్ఛాదించి - అష్టదిక్పాలకులు అధిదేవతలుగాగల కలశములను శివలింగముచుట్టు పెట్టియు లోకపాలుర యొక్క వజ్రాద్యాయుధములు గజ మహిషాది వాహనములు అనువానితో చిత్రింపబడిన ధ్వజములను మండపస్తంభాగముల యందు బంధించి  - శుద్ధోదకము నర్చించి యందు - ఐదు దినములు లేక దినత్రయము లేక నొకరాత్రి శివలింగము నుంచి వేదాధ్యయన సంపన్న విప్రులచే వైదికమంత్రముల నుచ్చరింపఁజేయుచు - నృత్య గీతాది మంగళ
ధ్యానములను గావింపఁజేయుచు - నిరీక్షింపవలెను.

తదనంతరము ఉదకమునుండి శివలింగమును తీయించవలెను. తూర్పు మొదలగు ఎనిమిది దిశలయందు అష్టకుండములను మధ్యన వేదికను వేదిక ముందు ప్రధానకుండమును నిర్మింపఁజేసి - అథవా పంచకుండములను లేక నొక కుండమును లేక స్థండిలము నేర్పరచియు - వేదికా మధ్య యందు ఐదు దూదిపరుపులతో ఎత్తైన పడక (శయ్య) యందు బంగారముతో సహ ధవళ వస్త్రమును  పఱచి - తూర్పు శిరస్సుండునట్లు ఈశానమంత్రముతో పరుండఁజేసియు శివలింగముపై  ధవళవస్త్రయుగ్మమును కప్పవలెను. స్థాపన ప్రదేశము ముందు - ధాన్య రాశి నునిచి దానియందు కొంతకాలము శివలింగము నుంచి తీసియు - గుంటలో నవరత్నములను సువర్ణమును చేర్చి - గర్తముపై సంస్కరిపఁబడిన శివ యంత్రము నుంచియు - యంత్రముపై శివలింగమును ప్రతిష్ఠింపవలెను. మరియు అష్ట కలశములయందు సువర్ణ రత్నాదులఁజేర్చి అష్టవిద్యేశ్వరమంత్రములతో ప్రధానకుండమున శివ మంత్రముతోడను సమిధాజ్య చరువులతో జయాది స్విష్ట కృత్ పూర్ణాహుతి పర్యంత హవనము
నొనర్చియు శివలింగమును ప్రతిష్ఠించుతఱి - శివగాయత్రిని, విష్ణుగాయత్రిని, బ్రహ్మజ
జ్ఞానమంత్రమును, ఉచ్చరింపవలెను.

“ఓం నమః శివాయ” “నమో హంసః శివాయ” అను మంత్రములతో జల శయ్యా
ధాన్యాధివాసాది - ప్రతిష్టాంతమగు సమస్త ప్రక్రియను కొనసాగింపవచ్చును. రుద్రాధ్యాయ పఠనముతో సమస్తము నాచరింపవచ్చును.

 అష్ట విద్యేశ్వర కలశముల మధ్య శివకుంభమున దేవీకలశమునందు నవరత్న సహిత శుద్ధోకమును నింపి - వానియందు పార్వతీ పరమేశ్వరుల నావాహించి శివలింగ ప్రతిష్ఠకంటె ముందు పూజింపవలెను. అష్ట విద్యేశ్వర కలశములు - నవవ స్త్రవేష్టితములై పూజింపబడవలెను. ప్రతిష్ఠానంతరము - పురుష సూక్త నమకచమకములతో దశశాంతులతోడను శివలింగమును పంచామృతములతో శుద్ధోదకముతోడ
నభిషేకించి - భస్మగంధాక్షత పుష్ప బిల్వ ధూపదీ పనై వేద్యాది షోడశోపచారములతో రాజోపచారముల తోడ నర్చింపవలెను.

 ఆచార్యునకు సహస్రసువర్ణ ముద్రికలను ఋత్విజులకు పంచశత సువర్ణముద్రికలను - లేక యథాశక్తి మహాదక్షిణలను వస్త్రాదులతో సహ సమర్పించవలెను. బ్రాహ్మణులకు దీనాంధకృపణులకు అన్నదానము.

 ఈ ప్రతిష్టాకార్యక్రమమును - తొమ్మిది దినములు గాని, సప్తాహముగాని, దినత్రయము గొని ఏకాహము గాని చేయవచ్చును.

ప్రతిష్ఠిత శివ లింగమును మనస్సులో ధ్యానించుచు - బాహ్యమున నిత్యము పూజించుచుండవలెను.

శ్లో॥ య ఏవం స్థాపయే ల్లింగం - స ఏవ పరమేశ్వరః । తేన దేవగణా రుద్రా - ఋషయోఽప్సరస స్తథా ॥ స్థాపితాః పూజితాశ్చైవ - త్రైలోక్యం సచరాచరమ్ ॥

 ఇందు చెప్పఁబడిన విధముగా శివలింగమును ప్రతిష్ఠించు పుణ్యాత్ముఁడు -పరమేశ్వరుఁడేనని భావింపవలెను. అట్టిద్విజుడు - శివలింగస్థాపనచే - బ్రహ్మ విష్ణు దేవేంద్రాద్యమరులను, ఏకాదశరుద్రులను, ద్వాదశాదిత్యులను నారదాది దేవర్షులను రంభాది దివ్యరమణులను చరాచరపాణి భరితమగు త్రైలోక్యమును ప్రతిష్ఠించి పూజించిన ఫలమును పొందఁగలుఁగును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (47)వ యధ్యాయము.