లింగ మహా పురాణము

Table of Contents

99 - ఆదిశక్తి దక్షపుత్రికగా సతీదేవియై మరల పార్వతిగా జన్మించుట మొదలగువానిని నిరూపించుట

“సూతా! మహామతే! అమ్మవారు సతీదేవియై పార్వంగా పునర్జన్మ నొందిన వృత్తాంతమును గూర్చి దక్షయాగ ధ్వంసమును గూర్చియు సవిస్తరముగా వచింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింపగా రోమహర్షణుడు చెప్పదొడగెను.

మున్ను బ్రహ్మదేవుడు దండికి చెప్పినట్లు, సాంబశివుడు కుమార స్వామికి భోధించినట్లును వేదవ్యాసుడు నాకు వక్కాణించినట్లును నేను మీకు నివేదించుచున్నాను.

మీయందలి గౌరవముచే సుముఖడనై ఉమాశంకరులకు నమస్కరించియు నా జ్ఞాపకము కొలది మీకు జగదంబాబా వృత్తాంతమును వివరించుచున్నాను.

శివుని లింగాకారమునకు శక్తి వేదికగా భగమనఁబడును. శివలింగము భగవంతుఁడగును. వీరిరువురి కలయికతో జగత్సృష్టి ప్రారంభింపఁబడును. తమస్సు అనఁబడు మూల ప్రకృతి నదిష్ఠించిన శివుడు లింగమూర్తిగా పేర్కొనఁబడును. లింగము, వేదిక, యనువాని నిత్యసంబంధము వలన అర్ధనారీశ్వరత్వము ఏర్పడినదై మొదట చతుర్ముఖుని పుట్టించి ఆతనికి కర్మజ్ఞాన సముచ్చయ ప్రతిపాదకమగు వేదము నంతయు నుపదేశించెను. అప్పుడు బ్రహ్మదేవుఁడు “దేవా! నీ స్త్రీ పురుషరూపములను వేరు చేయు” మని ప్రార్థింపగా మహాదేవుడు తన వామాంగమునుండి ఆది శక్తిని విడదీసి పురుషుని పత్నియగు ప్రకృతిగా పరిణమింపఁజేసెను. ఆ ఆదిశక్తియే శివాజ్ఞననుసరించి. దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించి సతీదేవియై పరమేశ్వరు సర్ధాంగియై నారదుని శాపము వలన దక్షుడు భ్రష్టమతియై శివుని నిరాకరించి చేసిన యజ్ఞమున తన పతిని నిరాదరించిన దక్షునకు పుత్రికగా నుండనొల్లక తన దేహమును పరిత్యజించినదై హిమవంతుని తపస్సుచే ప్రసన్నురాలునై మేనకా హిమవంతుల గారాబు పట్టికయై జన్మించెను.

సతీదేహత్యాగమును దధీచిముని వలన తెలిసికొనిన శివుఁడు వీరభద్రస్వామి నావిర్భవింపఁజేసి హరిరక్ష్యమాణంబగు దక్షయజ్ఞమును ధ్వంసింపఁ జేసెను.

దధీచి మహర్షి- చ్యవనునకు కుమారుఁడై మహాశివభక్తుడుగా వఱలిన వాడని తెలియుఁడు! మరియు నీతఁడు శివానుగ్రహసంపన్నుఁడై పోరాటమున విష్ణువు నోడించి విష్ణువునకు లోకపాలురకును “రుద్రకోపాగ్నిచే మీరందరు దహింపఁబడుదురు! త్వరలోనే మీకు వినాశము సంఘటించు” నని శపించెను.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (99)వ అధ్యాయము.