లింగ మహా పురాణము
103 - పార్వతీ పరమేశ్వర కల్యాణవైభవ వర్ణనము
బ్రహ్మదేవుఁడు కృతాంజలియై ప్రణమిల్లి “మహేశ్వరా! వివాహవిధిని నడిపింద ననుమతి నీయము! “అని నివేదింపగా పరమేశ్వరుడంగీరించెను.
రత్నమయము శుభమదుంబు నగు కళ్యాణ మండపమును విశ్వకర్మ యేర్పరుపగా వివాహోత్సవమున సువాసినులు ముఖ్యముగా పాలుగొనవలసి యున్నందున దితి, దితి, దనువు, కద్రువు, సుకాలిక, పులోమ, సురస, సింహిక, వినత, సిద్ధి, మాయ, క్రియ, దుర్గ, సుధ, స్వధ, సావిత్రి, రజని, దక్షిణ, ద్యుతి, స్వాహా, మతి, బుద్ధి, ఋద్ధి, సరస్వతి, రాకా, కుహూ, సినీవాలీ,అనుమతి, ధరణి, ధారణి, చేల, శచి, నారాయణి, మొదలగు దేవమాతలు దేవపత్నులును శివకల్యాణము నందు పాలుగొనుటకు నేతెంచిరి.
మరియు నాగజాతులు, గరుడపక్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ప్రమథగణములు, సముద్రములు, పర్వతములు, మేఘములు, మాసములు, సంవత్సరములు, వేదములు, మంత్రములు, యజ్ఞములు, స్తోమ (స్తోత్ర) ములు, ధర్మములు, హుంకారము, ప్రణవము, వేలకొలది ద్వారపాలురు, కోటి సంఖ్యన దివ్యాప్సరసలు, అప్సరః పరిచారికలు, సమస్తద్వీపమునందలి స్త్రీ విగ్రహములతో
సంతుష్టాంతరంగలై యరుదెంచిరి. తుంబురపు, నారదుఁడు, హాహా, హూహూ, అందరును రత్నముల గైకొని పార్వతీ పరమేశ్వరులకు సమర్పింస నుద్యుక్తు లగుటయే గాక గ నరులు మంగళ వాద్యములను మ్రోగించుచుండిరి. ఋషులు వైవాహిక మంత్రములఁజదువు చుండిరి.
ఇట్లు పెండ్లి సంబరము జరుగుచుండగా కేశవుఁడు పార్వతీ దేవి నలంకరింపఁజేసి
కల్యాణమంటపము నందు ప్రవేశింపఁజేసెను.
ఆ సమయమున బ్రహ్మదేవుఁడు “నారాయణా! నీవు శివుని నుండి దేవితో సహ మొదట జన్మించితిని. ఈ హిమవంతుడు యజ్ఞార్థము నా యంశతో నుదయించినవాడు. ఈ పార్వతీ దేవి పరమేశ్వరుని ఆదిశక్తి యగును. శ్రౌత స్మార్త విధానమున వివాహమును జరిపించుటకు నేనే తెంచితిని. భూజల అగ్ని వాయు ఆకాశ సూర్య చంద్ర యజమాన (అష్ట) స్వరూపుడగు పరమేశ్వరునకు నీవు పార్వతీ దేవి నీయుము ! ఇది నా యభిమతము. ఇట్టి కన్యాదానము నొనర్చితివేని నీకు హిమవంతునితో చుట్టరికమేర్పడును. పాద్మకల్పమున నీ నాభికమలము నుండి యుదయించితిని గాన నాకును నీవు జనకుడవగుదువు; “అని ప్రవచింపగా శ్రీహరి సమ్మతించెను. దేవతలు మునులు నామోదించిరి. శంకరుడు నంగీకరించెను. అంత నారాయణుడు లేచి దేవికి నమస్కరించి దేవుని పాదములను కడిగి తన శిరస్సుపై చల్లుకొని బ్రహ్మదేవునిపై మేనకా హిమ వంతులపైనను చల్లెను.
శ్లో॥ త్వదీయైషా వివాహార్థం మేనజాహ్యనుజా మమ
ఇత్యుక్త్వా సోదకం దత్వా దేవీం దేవేశ్వరాయ తామ్ ।
స్వాత్మాన మపి దేవాయ సోదకం ప్రదదౌ హరిః ॥
‘‘మహేశ్వరా! మేనకాత్మజు, మత్సోదరియు నగు నీ పార్వతిని వివాహవిధిని నీదాన జేసితిని.” అని వచించి దేవేశ్వరుని చేతిలో నుదకముతో దేవిని సమర్పించియు తననుగూడ శివునకు సోదకముగా సమర్పించుకొనెను. సర్వవేదార్థపారగులగు ముని శ్రేష్ఠులు“ దాత, గృహీత, ఫలము, ద్రవ్యంబ. మహేశ్వరుడేను.” అని ప్రవచింది అనురాగాతిశయమున గగుర్పాటు గలవారైరి. ఖేచరులగు సిద్ధచారణులు దివ్య పారిజాతాది కుసుమములను కురిపించిరి. దేవదుందుభి వాద్యములు మ్రోగినవి. అప్సరసలు నాట్యమాడిరి. వేదములు మూర్తిమంతములై కల్యాణవరునకు ప్రణమిల్లెను.
బ్రహ్మదేవుఁడు, మునులందరును వందనంబు నిడిరి.
మహాదేవుఁడు సిగ్గుపడుచున్న హైమవతిని పునః పునః అవలోకించుచుండగా పార్వతియు పరమేశ్వరు నోరచూపులతో గొంచుచు ఇంకను చూడఁదలచినదై తృప్తి పడకుండెను. “వరముల నొసగుదు” నని శ్రీహరి నుద్దేశించి మహేశ్వరుడనగా నీ యందు భక్తి కలిగియుండునట్లు అనుగ్రహింపుము!“ అని శ్రీహరి కోరినందున తథాస్తు అని వచించి బ్రహ్మపదవి రాబోవు కాలమున నీకు లభించు” నని పరమేశ్వరుడు వరము నొసఁగెను.
అసంతరము “వహ్నయందు హవనము నొనర్ప నసుజ్ఞనీయు“ మని బ్రహ్మదేవుఁడు ప్రార్థింపగా హరుడు “సురశ్రేష్ఠా! కర్తవ్యము నంతయు నిర్వహింపుము! “ అని యామోదించెను.
అంత విధాత మరల శివునకు మ్రొక్కి దేవుని హస్తమును దేవియొక్క హస్తముతో జతపఱుపగా అగ్నిదేవుడు కృతాంజలియై సమీపించెను. శ్రౌతస్మార్త మంత్రములు మూర్తిమంతములై యేతెంచెను. అంత బ్రహ్మదేవుడు నారాయణునిచే తేబడిన లాజ (పేలా) లఁదీసికొని యథోక్తవిధిని హవనము నొనర్చెను. బ్రాహ్మణులకు గోదానాదులు సమర్పింపబడెను. అగ్నికి ముమ్మారు ప్రదక్షిణమును పార్వతీపరమేశ్వరులు గావింపగా బ్రహ్మదేవుడు పాద్య ఆచమనముల నొసగి మధు పర్కమును గోవును సమర్పించెను. భృగ్వాది మహర్షులు సూర్యాదులును తిలతండులములతో పూజించి శంకరుని సుతించిరి. బ్రహ్మోక్తము నంతయు నెరవేర్చి శివుడు అగ్ని నాత్మారోపణముఁజేసికొని పార్వతీ దేవితో కూడ నటనుండి బయలుదేరెను.
ఇట్టి శివ కల్యాణ ఘట్టమును చదివినను వినినను వినుపించినను ప్రారబ్దాంతమున కైలాసమునందు గాణపత్యము లభించును. మరియు శివునితో కూడ ఆనందము ననుభవింపబడును. ఈ ఉపాఖ్యానము కీర్తింపఁబడువరకు నట భవుడు సన్నిహితుఁడై యుండును.
అందువలన శౌనకాదిద్విజులారా! శివు నర్చించియే దీనిని పఠింపవలసియుండును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వివాహకల్యాణము జరిగిన చోట నీ శివవివాహఘట్టము నవశ్యము పఠింపవలెను.
అనంతరము శంకరుఁడు పార్వతీసమేతుఁడై హిమగిరి నుండి వారాణసీ (కాశీ) క్షేత్రము జేరెను.
నందికేశ్వరుఁడు, ప్రమథగణములు, అమరులును పార్వతీ పరమేశ్వరుల ననుసరించి కాశీక్షేత్రములో నడుగిడిరి. అవిముక్త మనఁబడు కాశీ క్షేత్రమున సుఖాసీనుడై యున్నట్టి మహేశ్వరుని కాశీ క్షేత్రమహిమఁ గూర్చి ప్రశ్నింపగా చంద్రార్థ శేఖరుడు_ “ కాశీలో మరణించువారు పాపాత్ములైనను అవ్వారికి నొకే జన్మయందు ముక్తి లభించును. ఇతరత్ర చేసిన పాపము వారాణసియందు నశించును. కాశీకృత దురితము పిశాచజన్మ నొసగినను పిశాచజన్మాంతమున కైలాసనివాసము ప్రాప్తించును. వేలకొలది పాపముల నొనర్చియు కాశీ క్షేత్రమున మరణించి పిశాచమగుట మేలగును. ఎందుకనఁగా? పుణ్యముల నాచరించి సహస్రపర్యాయములు దేవేంద్రుఁడగుట కీడు అని భావింపవలెను. కాశీ క్షేత్రమున మరణించువారికి నేను ప్రణవపంచాక్షరి నుపదేశించి సాయుజ్యమోక్షము నొసఁగుచుండును. మరియు నిట మరణించినచో పునర్జన్మము సంఘటింపదు “ ఇత్యాది నమ్మవారికి ప్రబోధించి ఒకానొక దివ్య ఉద్యానవనమును చూపెట్టెను. గజాననుడు ఈ ఉద్యానమునందు ఆవిర్భవించి దైత్యులకు విఘ్నములను దేవతలకు కార్యసిద్ధిని కలిగించువాడుగా వెలసెను.
వేదవ్యాసునివలన నేను వినినదంతయు మీకు వినిపించితినని సూతుడు విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (103)వ అధ్యాయము.
