లింగ మహా పురాణము

Table of Contents

38 - మహేశ్వరుని మహిమను విష్ణువు - బ్రహ్మదేవునకు చెప్పి - పూర్వము వలె ఆది సృష్టిఁ జేయుట

మహేశ్వరుఁడు కనుమఱుగైన తరువాత జనార్ధనుఁడు పరమేశ్వరుని మహిమఁజెప్పఁదొడఁగెను.

శ్లో॥ పరమేశో జగన్నాథః-శంకర స్త్వేష సర్వగః । ఆవయో రఖిలస్యేశః- శరణం చమహేశ్వరః ॥

ఈ పరమేశ్వరుడు శంకరుడునఁ బఱుఁగుచు మన ఇద్దరికి ప్రభువు, శరణ్యుండు నగుటే గాక చరాచర ప్రపంచము నంతయు శాసించువాడు.

నేను మహేశ్వరుని వామాంగము నుండి ఉదయించుటచే నన్ను ప్రధానమనియు ప్రకృతి యనియు ఋషులు పేర్కొనుచుందురు. నీవు దక్షిణాంగమునుండి జన్మించుటచే నిన్ను అవ్యక్తమనియు పురుషుఁడనియు మునులు నిరూపించుచున్నారు.

ఇట్లు విష్ణు ప్రభోధముఁ బడసిన బ్రహ్మదేవుడు మహేశ్వరుని వివిధములుగా నుతించి ప్రణమిల్లెను.

నారాయణుఁడు వరాహమై భూమి నుదకము నుండి లేవనెత్తి పూర్వ స్థలమున నెలకొలిపెను. మరియు నదీనద సముద్రములను పర్వతములను స్థిరపఱచెను. తరువాత తిర్యక్ జంతువులను దేవతలను మానవులను సనక సనందనాదులను, మరీచి భృగ్వాం గీరస పులస్త్య పులహ క్రతు దక్ష అత్రి వసిష్ఠులను సంకల్పమును ధర్మము నధర్మమును పుట్టించెను. సనక సనందన సనాతన ఋభు సనత్కుమారులు,ఊర్ధ్వరేత స్కులై సర్వజ్ఞులునై బ్రహ్మసమానులునై శివ ధ్యాన తత్పరులైరి. శిలాదా! ఇవ్విధము విష్ణువు
జగత్స్రష్టయై కృత త్రేతా ద్వాపర కలియుగ ధర్మముల నేర్పరచెనని గుర్తింపుము!

ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (38) ముప్పది యెనిమిదవ అధ్యాయము.