లింగ మహా పురాణము
17 - బ్రహ్మ విష్ణు వివాద శాంతికై లింగా విర్భావము
సూతుడు పలికెను.
సద్యోజాత - వామదేవ - అఘోర - తత్పురుష - ఈశానములనఁబడు పంచబ్రహ్మల ప్రాదుర్భావమును సంగ్రహముగా చెప్పితిని. దీనిని చదువువాడు, వినువాడు, వినుపించువాడును - శివానుగ్రహ పాత్రులై ప్రారబ్ధాంతమున శివసాయుజ్యముఁజెందుదురు.
శౌనకాదులు సూతోకము నంతయు నాలకించి ఒక్కొక కల్పము నందు ఒక్కొకరూపముతో నావిర్భవించి బ్రహ్మదేవుఁడు చేయుదలచిన సృష్టికి సహకరించిన పరమేశ్వరుని లింగ స్వరూపముఁదగు జిజ్ఞాస గలవారై ఇట్లు ప్రశ్నించిరి.
పరమేశ్వరునకు లింగ స్వరూపము ఎందు కేర్పడినది ? లింగము నందు శంకరు నెట్లు పూజింపవలెను? లింగమనగా నెట్టిది ? లింగాధిష్ఠాత యెట్టివాడు?
రోమహర్షణుఁడనఁబడు సూతముని దిగువవిధము ప్రత్యుత్తరించెను. దేవతలు ఋషులును పితామహునకు మ్రొక్కులిడి మీరడిగిన విధముగానే ప్రశ్నింపగా చతుర్ముఖుఁడు చెప్పినట్లు వివరించుచున్నాను.
శ్లో॥ ప్రధానం లింగ మాఖ్యాతం - లింగీ చ పరమేశ్వరః ।
ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుగా పరిణమించు ఆదిశక్తి (మూల ప్రకృతి) శివునకు
అధిష్ఠాన (ఆశ్రయ)ముగా లింగ మగును. లింగము నధిష్ఠించి యుండువాడు పరమేశ్వరుడగును.
నన్ను విష్ణు మూర్తిని రక్షించుటకు ప్రళయసముద్రమున మహేశ్వరుఁడు జ్యోతిర్లింగముగ నావిర్భవించెను.
అట్టితఱి వృక్షలతాదులు వర్షాభావముతో శుష్కింపగా చండభానుని తీక్షకిరణములతో సమస్తము దహింపఁబడెను. ఆ సమయమున ప్రళయాంబుధియందు శేషశయనమున పడుకొని నేను యండు నారాయణుని గాంచి. మాయా మోహమున చేతితో గట్టిగా కొట్టి “నీ వెవడవు? అనిఅడుగగా ఆతడు మేలుకొని - చిరునగవుతో మధురభాషణము నిట్లొనర్చెను. “పితామహా! నీకు స్వాగతము” అను శ్రీహరి వచనము నాలకించి రజోగుణవశమున వైరము బూనినవాడనై “వత్సా! వత్సా!” అని పెద్దవాని వలె నన్ను సంభోధించితివి. నేను ఎవరినో తెలియదా? గురువు శిష్యునకు చెప్పినట్లు - నీవాడు మాటలో స్ఫురించుచున్నది. “జగత్కర్తను నేనే, నన్నే నారాయణుడందురు”
అని గర్వముతో పలుకగా - శ్రీహరి నేనే జగత్కర్తను, జగత్తును పోషించువాడను, ప్రపంచమును ‘హరించువాడను’ పూర్వము నావలననే నీవు జన్మించితివి. నేను నారాయణుడను, జగన్నాథుఁడను. పురుషుడను పరమాత్మనను విషయమును మఱచితివి. ఇవ్విషయమై నీ తప్పేమియు లేదు. నా మాయ సిన్నావరించి యిట్లు పలికించుచున్నది. ఇప్పటికైనను నాతో సమానుఁడు లేడనియు, నేనే పరబ్రహ్మగా పరంజ్యోతియనియు, దృష్టము శ్రుతము మొదలగు సమస్తంబు నాచే అధిష్ఠింపబడినదనియు గుర్తింపుము!” అనియు, నా నాభి నుండి ఎన్నియో అండములు
ఉద్భవింపగా - వానినుండి నీవు జన్మించితివనియు అహంకారోక్తిగా ప్రవచించెను. అందువలన మా ఇరువురికి సముద్ర మధ్యన ఘోరయుద్ధము సంభవించినందున మా యుభయుల వివాదమును శమింపజేయటుకై శివుడు లింగరూపమున సాక్షాత్కరించేను.
శ్లో॥ ఏతస్మి న్నంతరే లింగ - మభవచ్చావయెః పురః । వివాదశమనార్థంహి - ప్రబోధార్ధం చ భాస్వరమ్ ॥ శ్లో॥ జ్వాలా మాలా సహస్రాఢ్యం - కాలానల శతోపమం । క్షయ వృద్ధి వినిర్ముక్త - మాది మధ్యాంతవర్జితమ్ ॥ శ్లో॥ అనౌ పమ్య మనిర్దేశ్య - మవ్యక్తం విశ్వసంభవం । తస్య జ్వాలా సహసేణ - మోహితో భగవాన్ హరిః ॥ శ్లో॥ మోహితం ప్రాహ మామత్ర - పరీక్షావోఽగ్నిసంభవం । అధోగమిష్యామ్యనల – స్తంభ స్యానుపమస్య చ ॥ శ్లో॥ భవా సూర్ధ్వం ప్రయత్నేస - గంతు మర్హసి సత్వరం। ఏవం వ్యాహృత్య విశ్వాత్మా - నీలాంజన చయోపమమ్ ॥ శ్లో॥ దశయోజన విస్తీర్ణం - శతయోజన మాయతం । మేరుపర్వత వర్ష్మాణం - గౌర తీక్ష్ణాగ్రదంష్ట్రిణమ్ ॥ శ్లో॥ కాలాదిత్య సమాభాసం - దీర్ఘ ఘోణం మహాస్వనం । హ్రస్వపాదం విచిత్రాంగం - జైత్రం దృఢ మనౌపమమ్ ॥ శ్లో॥ వారాహ మసితం రూప - మాస్థాయ గతవానధః । అహం హంసత్వ మాపన్నః - సుశ్వేతో హ్యనలాక్షకః ॥ శ్లో॥ విశ్వతః పక్షసంయుక్తో - మనోఽ నిలజవస్తథా । భూత్వాఽజహం చోర్ధ్వతో గంతు - ముద్యుక్త స్సత్వరం ధృవమ్ ॥
ఇంతలో మా ముందు లింగ మావిర్భవించెను. అయ్యది స్వయంప్రకాశమానమై - మా యిరువురి కలహమును శాంతింపఁజేయునదిగా నుండెను. మరియు వేలకొలది మంటలతో ప్రళయాగ్నిఁబోలిన వెలుతురు గలదై - క్షయము అభివృద్ధియు ఆదిమధ్యాంతంబులును లేనిదియునై తనతో సమానము లేనిదై ఇద మిత్థమని నిర్దేశింప నశక్యంబునై ప్రాకృత నేత్రములకు అగోచరంబునై ప్రపంచోద్భవకారణంబునై యుండెను.
అద్దాని వేలకొలది మంటలఁజూచి శ్రీహరి వెఱగందినవాడై శివమాయామోహవశమున “మన మిరుపురము దీని ఆద్యంతములను కనుగొందము” అని శివమాయామోహితుడనైయున్న నాతో వచించెను. మరియు “నేను ఈ స్తంభముదఁగు అడుగుచూచి వచ్చెదను. నీవు పైకి వెళ్లి దీని అగ్రభాగము నవలోకించి రమ్ము” అని నన్ను కోరెను.
శ్రీహరి యొక్క వరాహరూపము - శతయోజన విస్తీర్ణంబు శతయోజనములు పొడవు మేరు పర్వతముఁబోలిన శరీరంబు, తీక్ష్ణములైన తెల్లని కోఱలున్ను కలిగియుండెను. మరియు నయ్యది ప్రళయకాల చండ భానునితో సమానమై పొడవైన నాసిక (ముక్కు) గొప్ప కంఠస్వరము, పొట్టికాళ్లు, విచిత్రములైన అవయవములు, జయించు లక్షణము, గట్టిదనము, ఉపమాన రాహిత్యము, నలుపు గలదియునై యుండెను.
నేను హంసనై పైకి వెళ్లనుంకించితిని. ఆనా హంసరూపము తెలుపువన్నె, అగ్నిభరితనేత్రములు, అంతట వ్యాపించు రెక్కలు. మనోవేగము వాయువేగంబు కలిగియుండెను.
ఇవ్విధము, వేయి వత్సరములు విష్ణువు వడివడిగా క్రిందికి వెళ్లుచుండెను. ఐన నీ జ్యోతిర్లింగము యొక్క మూలము (అడుగు)ను చూడఁజాలలేదు. నేను గూడ వేయి వత్సరములు పైకి వెళ్లినను జోతర్లింగముఁదగు అగ్రభాగము నవలోకింపలేదు. అందువలన శ్రీహరి, నేను నలసినవారమై వెనుక, ప్రక్కన ముందును పరమేశ్వరునకు నమస్కరించి ఇదేమిటని ఆలోచించుచుంటిమి.
ఇంతలో “ఓమ్” “ఓమ్“ అను నాదము ప్లుతముతో గూడ నావిర్భవింపగా లింగము యొక్క దక్షిణ భాగమున “అ” కారము “ఉ” కారము ఉత్తర భాగమున మకారము మధ్యన కనఁబడుచు నాదము (అవ్యక్త ధ్వని) అంతమందు గల ఓంకారముగా గోచరించుచుండెను. అకారము సూర్యమండలమువలె ప్రకాశించుచుండెను. ఉకారము అగ్నివలె వెలుగుచుండెను. మకారము చంద్రకాంతి గలదై యుండెను. అకార ఉకార మకారాత్మకమగు ప్రణవముపై శుద్ధస్ఫటిక సదృశుడైన పరమశివుడు కనఁబడుచుండెను.
అట్టి శివస్వరూపము అకార ఉకార మకార వాచ్యులైన బ్రహ్మవిష్ణురుద్రులను మించినదై మిశ్రములైన సత్త్వరజస్తమో గుణములు లేనిదియై శుద్ధ సత్త్వ గుణోపేతంబగునాలుగవ తత్త్వమునై - అనాది కాలముక్త (అమృత)౦బునై - విభాగ రహితము, శారీరక వాచికమానసిక బాధలు లేనిదియు నై సుఖదుఃఖములు రాగ ద్వేషములు మొదలగు పరస్పర విరుద్ధంబులైన ద్వంద్వములు లేనిదియునై భేదరహితమునై వెలుపల లోపల లేనిదియునై. జగత్తులోను బయట నుండునదై ఆదిమధ్యాంతములు లేనిదియునై ఆనందరూపమగు ప్రకాశము గలదై అకార ఉకార మకార బిందువుల కూడికయగు ఓంకారము అను శబ్దముఁడగు రూపము గలదై బిందువుపై నాదముగా పరబ్రహ్మము అనఁ దగినదియునై ఋగ్యజు స్సామవేదములను అకారోకారమకారముల నుండి ఆవిర్భవింపజేయునదియునై యుండెను.
ఇట్టి సర్వోత్తమమగు శివరూపముసు మాధవుడు వైదిక వచస్సులతో దిగువ విధము ప్రార్థించెను.
శ్లో॥ చింతయా రహితో రుద్రో - వాచో యన్మదసా సహ । ఆప్రాప్య తం నివర్తంతే - వాచ్యస్త్వే కాక్షరేణ సః ॥
“రుజంచింతాం ద్రావయతీతి రుద్రః” అను వ్యుత్పత్తిఁ బట్టి భక్తులకు సంసారచింతను పోగొట్టువాడగుట జేసి తాను కూడా సృష్టి స్థితి లయాదుల విషయమై చింత లేనివాడగునని రుద్రశబ్దము నిర్వచించుచున్నది. ప్రాకృతములైన వాక్కులు ప్రాకృతమగు మనస్సుతో గూడ రుద్రాఖ్యమగు పరబ్రహ్మమును చేరడాలనిడై మరలి వచ్చుట వలన “ఓం” ఆను ఏకాక్షరము యొక్క అనుసంధానముతో మాత్రము ప్రాప్యుండగునని తెలియవలెను. ఓంకారము వాచకము కాగా రుద్రుఁడు వాచ్యుఁడగుచున్నవాడు. అట్టి పరతత్త్వము నిత్యసత్యంబునై జగత్తునకు పరమకారణంబునై సచ్చిదానందమయంబగు పరబ్రహ్మముగా భావింపఁ బడుచున్నయది.
ఓంకారములో గల అకారము బ్రహ్మదేవు జెప్పును. ఉకారము శ్రీహరికి వాచకము కాగా మకారము నీలలోహితరుద్రుని నిర్వచించును, సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, జగద్రక్షకుండగు శ్రీహరి ననుగ్రహించువాడు రుద్రుఁడేను. రుద్రుడు బీజము గలవాడనియు, చతుర్ముఖుఁడు బీజ మనియు, శ్రీహరియోనియనియు గుర్తింపవలెను. మహేశ్వరుని లింగస్వరూపము నుండి అకార వాచ్యుడైన బ్రహ్మదేవుఁడు జీజముగా సుద్భవించెను. అట్టి బీజమును ఉకారవాచ్యుఁడైన విష్ణువు అను యోనియండు బీజియగు రుద్రుఁడు విడువగా సువర్ణమయమైన అండము ఉదకమునందు అనేక వత్సరములు ఉన్నదై రెండు భాగములు కలదయ్యెను. వానిలో పైభాగము ఆకాశముగాను క్రిందిభాగము పృథివిగాను పరిణమింపగా ఆరెంటి మధ్య నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను అకార ఉకార మకారముల సమష్టినిట్లు ఓంకారముగా యజుర్వేదవాక్కులు ప్రవచించినవి. ఇట్లే ఋక్ సామవేదములును నిర్వచించినవి. అందువలన ఓంకార వాచ్యుంఁడు పరమేశ్వరుఁడని -శ్రీహరి గుర్తించి వైదిక మంత్రములతో శబ్ద బ్రహ్మముగా నుతించెను.
ఓంకారము నుండి ఉద్భవించిన ఈశానమంత్రమును శ్రీహరి లింగము యొక్క పైభాగమున కళాపంచక సమన్వితముగా, 38 అక్షరములు గలదిగా నవలోకించెను.
ఈ శానమంత్రము - ప్రజ్ఞా వివర్ధకంబు సర్వధర్మార్థ సాధకంబునై యుండునది. రుద్రగాయత్రిగా చెప్పఁబడు తత్పురుషమంత్రము ఇరువదినాలుగు అక్షరములు గలదైనాలుగు కళలతో కూడియుండును. అఘోరమంత్రము ముప్పది మూడు అక్షరములు గలదై ఎనిమిది కళలతో కూడినదియునై అరిష్టశాంతికి ఉపయోగించునది.
సద్యోజాతమంత్రము ముప్పదియైదు లేక ముప్పది యేడు అక్షరములు గలదై -ఎనిమిది కళలతో కూడినదై శాంతికరముగా నిరూపింపబడినది.
వామదేవ మంత్రము ఆరువదియారు (66) లేక - డెబ్బది యారు (76) అక్షరములు
గలదై పదిమూడు కళలు గలదియునై యుండును.
ఇట్టి పంచబ్రహ్మమంత్రములను శ్రీహరి పరిగ్రహించి జపించగా మహాదేవుఁడు ఈశాన మంత్రము మకుట (కిరీట) ముగాను, తత్పు రుషమంత్రము ముఖముగాను, అఘోర మంత్రము హృదయము గాను, వామదేవ మంత్రము - గుహ్య (నడుము క్రిందిభాగ) ముగాను, సద్యోజాత మంత్రము పాడములుగాను కలవాడై కనుపించెను.
కాని “పరమేశ్వరుఁడు విశ్వమంతటను పాదములు, ముఖములు నేత్రములు హస్తములు గలవాడై వేదమునకు, హరిబ్రహ్మలకు నధిపతియునై సృష్టి స్థితిలయ కారణుఁడునై - మహాభోగీంద్ర భూషణుఁడు నైయుండువాడు” అని గుర్తించి శ్రీహరి - వరదుఁడైన మహేశ్వరుని చెప్ప (బోవు విధముగ నుతించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (17) పదునేడవ అధ్యాయము.
