లింగ మహా పురాణము

Table of Contents

51 - శివుని నాలుగు స్థానములను నిర్దేశించుట

సూత ఉవాచ:

సువర్ణసహిత వైడూర్య మాణిక్య నీల గోమేదికముల కాంతులతో శోభించునట్టి దేవకూట పర్వతము యొక్క ఎత్తైన శిఖరము నందు భూతవనము కలదు. అయ్యది నిర్మలమై చంపక అశోక పుంనాగ వకుళ పారిజాతాది వృక్షములు గలదియునై యుండును. వృక్షములపై నానావిధ పక్షులు మధుర స్వరముతో కూయుచుండును. విచిత్రములైన సుగంధ పుష్పములు నేలపై రాలుచుండును. మధ్యన పుష్పాసనములు పరువబడి యుండును. అనేకములగు సాధుజంతువులు భూతవనములో సంచరించుచుండును. స్వచ్ఛము రుచికరంబునగు నుదకము గల సెలయేరులు, నదులును ప్రవహించుచుండును. నునుపువన్నెగల పెద్దమూలములతో అనేక శాఖలుగల వృక్షములున్ను కలిగినది, మనోహరంబు దట్టని నీడయు గలది, దశ యోజనవిస్తీర్ణంబు నగు భూతవనమునందు - నానా భూతగణములు నివసించుచుండును.

భూత వనములో దేవదేవుడైన శంకరుని ఆయతనము మహా మణివిభూషితముగాను, సువర్ణ మయ ప్రాకారములు గలదిగాను, మణితోరణమండితముగాను, విచిత్రములు స్పటిక నిర్మితంబులు నగు గోపురములు కలదిగాను, ఆచ్ఛాదన పట్టవస్త్రములు గల మణిమయ సింహాసనములు కలదిగాను,
శోభించుచుండును.

ఆ సింహాసనములపై పరమేశ్వరుఁడు తన ఇష్టానుసారము ఆసీనుడగుచుండును. అనేక భవనములు, వాడని పుష్ప మాలికా తోరణములు గలిగియుండును. స్పటికమయ స్తంభములు గల మండపములు విరాజిల్లుచుండును. బ్రహ్మేంద్రోపేంద్రపూజితులగు భూతేంద్రులు నట నుందురు. వివిధాకారములు గల ప్రమథులచ్చోట నివసించుచుందురు.

భూతేంద్రులు ప్రమథులును సిద్ధులు ఋషులు దేవతలు గంధర్వులు బ్రహ్మదేవుడు
ఉపేంద్రుడును నిత్యము మహాదేవు నచ్చోట నర్చించుచు మంగళవాద్యములను
మ్రోగింపఁజేయుచుందురు.

మనోహరములైన విడివిడి శిఖరములు శంఖకాంతియు గల కైలాసము యక్షేశ్వరుడగు కుభేరుని నివాసమగును. కుబేర నగరమున పరిసర ప్రదేశములందును కోటియడులేగాక పుణ్యాత్ములును నివసించుచుందురు. అచ్చోట పవిత్ర స్థానమున మహేశ్వరుఁడు భక్తగణములతో నెల్లకాల ముండువాడు. కుబేర శిఖరము నుండి ప్రవహించు మందాకినీ నదిలో నుదకము నిండుగ నుండును. దానిలోనికి దిగుటకు బంగారు మెట్లుండును. మందాకినీ నదియందు సుగంధములగు కమలములు కలువలును వికసించి చూపరులకు ఇంపు గొలుపుచుండును.

యక్ష స్త్రీలు గంధర్వరమణులు అప్సర సరుణులును విహరించుచుందురు. మరియు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస కిన్నరులు మందాకినీ నదిలో స్నానము నొనర్చి తల్పవిత్రోదకమును పుచ్చుకొనుచుండురు.

మందాకినీ నదికి ఉత్తర భాగమున గల ఆయతనమున కనకనందా నదికి తూర్పు వైపున గల ఆయుతనమునందును నందానదికి పశ్చిమ దక్షిణముల మధ్యన గల రుద్రపురి యందును సాంబసదాశివుఁడు తన రూపమును నూరు తెజంగులొనర్చి అమ్మవారితో ఆనందముగ నివసించుచుండును. ఆయ్యపి శివాలయములని చెప్పఁబడును.

ఇట్లు శివస్థానములు ప్రతి ద్వీపమునందు ప్రతి పర్వతమునందు ప్రతి వనమునందును నదీనదతటాక తీరములయందును సముద్ర సంగమముల యందును లక్షల కొలది గలవు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రపచనమున (51) ఏబది యొకటవ అధ్యాయము.