లింగ మహా పురాణము

Table of Contents

54 - సూర్య ధ్రువ మేఘ - గతి నిరూపణము

మేరు పర్వతముఁదగు తూర్పుదిశయందు మహేంద్రుని పట్టణము దక్షిణ దిశయందు యమ నగరము; పశ్చిమదిశయందు పరుణదేవరాజాధాని; ఉత్తరదిశయందు కుబేరుని పురంబు - అమరావతి, సంయమిని, సుఖ, విభాయను పేరులతో విరాజిల్లుచుండును.

లోకపాలుర పైన దక్షిణాయనమున సూర్యుడు దక్షిణదిశ ననుసరించి ధనుర్ముక్తమగు బాణమువలె జ్యోతిశ్చక్రమును పరిగ్రహించి సంచరించుచుండును. మరియు మహేంద్రుని అమరావతి పైకి వచ్చినతఱి తన కిరణములను ప్రసరింపజేయుచు యమరాజధానియగు సంయమినిఁజేరినపుడు ప్రాతఃకాలమును కలుగజేయును. ఆగ్నేయము నైబుతి యను విదశలజేరి పూర్వాహ్ణము  నపరాహ్ణముల నేర్పరచును. వాయవ్యము నందు ఈశాన్యము నందును పూర్వాపర రాత్రములను సంభవింపజేయును.

ఉదయము మొదలుకొని అస్తమానము వరకు గల కాలములో ముప్పది యవ భాగము అనగా 24 నిమిషములు ముహూర్తమనఁబడును. ఇట్టి ముహూర్తకాలములో సూర్యుడు 31 లక్షల 50 వేల యోజనములు ఆకాశమున సంచరించును. 180 జ్యోతిర్మండముల నతిక్రమించి దక్షిణోత్తరాయణ కాలములలో రవిగమనము జరుగుచుండును.

మరియు సూర్యుఁడు దినమున రాత్రిని నక్షత్రములను స్పృశించును. సూర్యుడు
సంచరించునపుడు - ఆదిత్యులు, మునులు, గంధర్వులు, అప్సరసలు, సర్పములు, రాక్షసులును ముందు, వెనుక, పైన, క్రింద సూర్యరథము నాశ్రయించియుందురు. సంధ్యాకాలమున రవి నిశాచరులను పారదోలుచుండును.

ధ్రువునిచే నధిష్ఠింపబడిన రవి - భూగతములైన ఉదకములను కిరణములతో ఆకర్షించి - చంద్రునిఁ జెందఁజేయును. చంద్రుని కిరణముల ద్వారా మేఘములు ఉదకము గలవై - నేలపై జలధారలను కురిపించును.

జగత్తును ప్రకాశింపజేయును గాన రవికి- “భాస్కరుఁడు” అను పేరు - సార్థకమైనది. సూర్యచంద్రమేఘగతమై భూగతోదకము మరల భూమిపై ప్రవహించును గాన నుదకమునకు వినాశము లేదు.

అందువలన నుదకములు లోకులకు ప్రాణముల వంటివగును. “పెక్కు చెప్పనేల?

శ్లో॥ అపాం త్వధిపతి ర్దేవో - భవ ఇత్యేవ కీర్తితః । భవాత్మకం జగత్సర్వ-మితి కిం చేహ చాద్భుతమ్? ॥

ఉదకములకు అధిపతిగా శంకరుఁడే కీర్తింపబడెను. అందువలన ఉదకము ముఖ్యముగా గల పంచమహా భూతములచే నిండియుండు జగత్తంతయు శివరూపమగు ననుటలో ఆశ్చర్యమేమున్నది?

పరమేశ్వరుఁడే శ్రీహరిని ఉదకములయందు పరుండజేసినందున నాతఁడు నారాయణుఁడన బఱఁగెను. అందువలన శ్రీహరికి ఉదకములు నివాసస్థానములైనవి.

లోకములు దహింపఁ బడునపుడు గాలితో పైకి బయలు దేరిన పొగలు - అగ్నితో వాయువుతో కూడి మేఘములుగా పరిణమించును. ఇట్టి మేఘములకు ఆధిపత్యమును దేవేంద్రుఁడు వహించును. ద్విజ కృతములగు యజ్ఞముల నుండి ఆవిర్భవించు ధూమము గూడ మేఘముగ పరిణమించును. దావాగ్ని ధూమము చేతను మేఘము సంభవించును. అద్ది అడవిని నీరు కురిపించును. మరణించిన వారిని కాల్చుటచే కలుగు పొగ మంచిదికాదు. అభిచారాగ్నిజన్య ధూమము - ప్రాణివినాశము నొదవజేయును. అందువలన అబిచారాగ్నిధూమము పైకి పోకుండా కప్పిపుచ్చవలెను. అట్టి ధూమము
నాచ్ఛాదింపనిచో జగత్తును క్షీణింపజేయువాడై దోషభాజనుఁడగును.

పుష్కరము మొదలగు మహామేఘములు భోరున కురిపించిన జలముతో జగత్తంతయు ఏకార్ణవమగును. అట్టి మహోదకముపై శ్రీహరి శయనించును.

మేఘముల ద్వారా ఉదకమును వర్షింపఁజేయు రవిలో నంతర్యామిగా శివుఁడున్నవాడై తేజస్సు, ఓజస్సు - బలము - యశస్సు - నేత్రము - శ్రోత్రము, మనస్సు - మృత్యువు - ఆత్మ మన్యువు - విదిశలు - దిశలు సత్యము - ఋతము - వాయువు - ఆకాశము ఆకాశమున సంచరించు జ్యోతిర్గణంబు నగును.

శివాధిష్ఠితుఁడైన రవి బ్రహ్మదేవుఁడు గాను శ్రీహరి గాను రుద్రుడు గాను,
సాక్షాన్మహేశ్వరుఁడు గాను, సహస్రకిరణుఁడు గాను, అష్టహస్తుఁడు గాను, సుమంగళుఁడు గాను. అర్ధనారీశ్వరుఁడు గాను, త్రినేత్రుఁడు గాను దేవేంద్రుఁడు గాను భావింపఁబడును.

ఇట్టి సూర్యుని అనుగ్రహము వలన నానావిధమగు వర్షము కురియుచుండును. వాయువు ధ్రువునిచే నధిష్ఠింపఁబడినవాడై వర్షమును స్తంభింపజేయును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (54) ఏబది నాలుగవ అధ్యాయము.