లింగ మహా పురాణము
50 - శుక్రాచార్య ప్రోక్తమగు నిగ్రహవిధిని నిరూపించుట
అఘోరోపాసకుఁడగు శుక్రాచార్యుని వలన హిరణ్యాక్షుఁడు అఘోర విద్యను పరిగ్రహించి భూమిని పాతాళమునకు గొంపోయి నిగ్రహించి అఘోరమంత్రమును నిష్ఫలము నొనర్చినందున - శ్రీహరి వరాహావతారము దాల్చి సహస్రవత్సరములు పోరాడి హిరణ్యాక్షుని వధింపఁగలిఁగెను.
బ్రాహ్మణులను స్త్రీలను గోవుల నఘోరమంత్రానుష్ఠానముతో బాధింపగూడదని ఇట
విదితమైనది. క్షత్రియులు - ఆయుధధారియై ఎదురు ఏతెంచెడు ఆతతాయిని సంహరించుటకీ మంత్రసిద్ధి నుపయోగింపవచ్చును.
సైన్యమంతయు నశించి అపజయము తలుస్థించిన వేళ నీ మంత్రమును కఠినచిత్తముతో పగతుఱపై ప్రయోగింపవచ్చును.
ఘోరరూపము గల అఘోరముఖముఁదగు మంత్రమును లక్ష జపించి, దశాంశము అనఁగా పదివేలు తిలహోమము నొనర్చి - నర్మదా బాణలింగమును తెల్లని లక్ష పుష్పముల నర్చింపవలెను.ఇట్లోనర్చినచో మంత్రము సిద్ధించును.
సిద్ధమంత్రుఁడై - తన మేలు కొరకు రాజు హితమునకు నీ మంత్రమును పూజాజపహవనముల నుపయోగింవలెను.
ఉపయోగవిధానమెట్లనగా?
పూర్వాద్యష్టదిశలయందు ఎనిమిది త్రిశూలములను నెలకొలిపి - అఘోరవి గ్రహమును మధ్యన పీఠముపై నుంచి పూజింపవలెను. తన శరీరము కాలాగ్నిజ్వాలఁబోలినదని భావింపవలెను.
అఘోరమూర్తిని - త్రిశూలము కపాలము పాశము దండము ధనుస్సు బాణములు డమరుకము ఖడ్గము నను ఎనిమిది ఆయుధముల నెనిమిది హస్తములయందు ధరించినవానిగాను, నీలకంఠునిగాను, దిగంబరునిగాను, నందివాహనుని గాను, చంద్రార్ధశేఖరునిగాను, కోరలచే భయము గొలుపు మోము గలవాని గాను, తీక్ష్ణములైన చూపులుగలవానిగాను, ‘హంపట్కారమహాశబ్దములతో దిశలను పిక్కటిలఁజేయువానిగాను, భస్మనలదుకొనినవానిగాను, భూత ప్రేత పిశాచాదులను తన వెంట నిడుకొనినవాని గాను, త్రినేత్రునిగాను, నాగపాశమును కిరీటమునకు చుట్టినవాని గాను, సర్వాభరణసంపన్నునిగాను, ఏనుగతోలు కట్టుకొనినవాని గాను, సర్పభూషణ భూషితునిగాను నీలమేఘకంఠస్వరముగలవాని గాను, నీలాంజన పర్వతముఁబోలిన వానిగాను. సింహచర్మోత్తరీయునిగాను, ప్రాణాయామపూర్వకముగ ధ్యానించి ఆవాహనాద్యుపచారములతోపూజింపవలెను.
పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తరదిశలయందు నాలుగు కుండముల నేర్పరచి వానిలో ఋత్విజులు - మధ్యకుండము గూడ కట్టించి యందు ఆచార్యుడు వనముఁజేయవలెను. “అఘోరేభ్యోఽ(థ)ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః - సర్వేభ్యః శర్వ సర్వేభ్యో - నమస్తే అస్తు రుద్రరూపేభ్యః” అను ముప్పది రెండక్షరములు గల అఘోరమంత్రము - జపహోమములయందు వినియోగింపదగినది.
తాండ్రకఱ్ఱతో శత్రువు యొక్క మూర్తిని ద్వాదశాంగుళపరిమితముగా చేయించి మధ్యకుండము క్రింది భాగమున క్రిందికి ముఖము పైకి పాదములుండునట్లు పాతి పెట్టించియు బొగ్గుతో కూడిన ఉముకతో కాల్చవలెను. దానిపై నిప్పుకణికల నుంచవలెను. చేతితో తీయబడిననూనె, రవిక, ఉముక, దూది రక్తవస్త్రము ననువానితో కూడిన ఘృతాదులతో అష్టోత్తర సహస్రము (1008) హవనమును చేయించిన యెడల శత్రువులు దుఃఖపడుచు మరణింతురు.
కృష్ణ చతుర్దశి నుండి శుద్ధాష్టమి వరకు నీ విధానము నొనర్పవచ్చును. కాని తన రాష్ట్రపతి నుద్దేశించి యీ అఘోరమంత్రానుష్ఠానముఁజేయునెడ - తాను తన వంశంబు నంతరించును గాన తన రాష్ట్రపతిని తనను తన వంశమును కాపాడుకొనుట - యాజ్ఞికుని కర్తవ్యమని – ఇంట - విదితమైనది.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (50)వ యధ్యాయము.
