లింగ మహా పురాణము

Table of Contents

61 - గ్రహస్థానాభిమానులను నిరూపించుట

భూలోకమున చేయబడిన పుణ్యముల ఫలితముగా మానవులు మరణానంతరము గ్రహముల నాశ్రయింతురు. ఈ గ్రహములే స్వర్గాది లోకసుఖముల నిప్పించుచు మానవులను నరకార్ణవము నుండి తరింపజేయునవి గాన తారలనియు, ధవళవర్ణముతో స్వచ్చములగుటఁజేసి తారలనియు వ్యవహరింపఁబడును.

జలమయమగు చంద్రమండలము, తేజోమయమగు సూర్యమండలము రెండును దివ్యములై అంతరిక్షమునందు భ్రమించుచుండును.

దేవతలందరు నక్షత్ర సూర్య చంద్రాది మండముల నాశ్రయించి- వానిలో నివసించువారగుటచే ఆయా నామధేయములు కలిగియుందురు.

సూర్యుఁడు - సూర్యమండలస్థుఁడ గుకతన - సూర్యుఁడని పేర్కొనఁబడును.
ఉదాహరణమునకు పుణ్యాత్ములకు ఆకాశమునందలి జ్యోతిర్మండములే నివాసస్థానములగును. కల్పాదియందు బ్రహ్మదేవుఁడు ఈ జ్యోతిర్మండలములు ప్రళయము వరకు ఉండునట్లు నిర్మించెను.

ఈ మన్వంతరమున అదితిదేవి యందు కశ్యప ప్రజాపతి వలన సూర్యుఁడు జన్మించెను. మరియు నీ వైవ స్వతమన్వంతరమున గ్రహములన్నియు వైమానికులనఁబడును. భృగు పుత్రుడగు శుక్రాచార్యుఁడు దైత్యగురువుగాను, అంగిరస్సుతుఁడైన బృహస్పతి - దేవాచార్యుఁడుగాను, మనోహర రూపము గల బుధుఁడు గురు పుత్రుఁడుగాను; వికృతరూపవంతుఁడగు శనైశ్చరుఁడు - సూర్యుని వలన సంజ్ఞా (ఛాయా) దేవి యందు జన్మించినవాడు గాను; అగ్నిదేవుఁడు లోహితార్చియనఁబడు రుద్రుని వలన వికేశియందు జన్మించినవాడు గాను; నక్షత్రములు మొదలగునవి దక్షపుత్రికలుగాను; రాహువు సింహికాగర్భసంభూతుడై ప్రాణులను బాధించు రాక్షసుడు గాను; వ్యవహరింపఁబడుచుందురు.

సూర్యుని ఆకాశమున బాధించును గాన రాహువు స్వర్భానువనబడును. ఈ సూర్యాది గ్రహములు జన్మ నక్షత్రాదుల ననుసరించి విరుద్ధస్థానములందున్నపుడు మానవులను బాధించుచుండును గాన ఆ యా గ్రహములను జప పూజా దానాదులతో శాంతింపజేయవలసియుండును. నక్షత్రములలో దనిష్ఠ, ఆయనములలో ఉత్తరాయణము, ఋతువులలో శిశిర ఋతువు, మాసములలో మాఘమాసము, పక్షములలో శుక్లపక్షము, తిథులలో ప్రతిపద, అహోరాత్రములలో దినము, ముహూర్తములలో రుద్రదేవతాకమగు ప్రథమ (మొదటి) మహూర్తము, నిమేషాదులలో క్షణకాలంబు శ్రేష్ఠుములైనవి. సమస్త ప్రాణులను కాలాధీనుల నొనర్చు సూర్యుని ప్రవర్తింపఁ జేయువాడు పరమేశ్వరుడే నని  “భీషోదేతి సూర్యః”‘ ఇత్యాది శ్రుతి వాక్యము నిర్ధారించినది.

సూర్య చంద్ర నక్షత్ర దేవ మానవాది సమస్తజగత్తు - మూల ప్రకృతి (ప్రధానము) యొక్క అద్భుతమైన పరిణామము (మార్పు) అని తెలియవలెను. ప్రకృతి పరిణామమగు జగత్తున ఆకాశజ్యోతిస్సులను లెక్కింప నెవరితరము గాదు. ఐతే అభిజ్ఞుఁడు బుద్ధిబలముతో బాగుగా పరిశీలించి శాస్త్రమును పురస్కరించుకొని గ్రహసంచారఫలితములను నిర్ణయింపవలసియుండును.

ఇయ్యది
 “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (61) అరువది యొకటవ అధ్యాయము.