లింగ మహా పురాణము

Table of Contents

17 - సౌకారుడైన శివుని నుండి విశ్వము ఉదయించుట, మరియు శివుడు హరిబ్రహ్మాద్యమరులకు సాక్షాత్కరించి నిజమహిమఁదెలుపుటయు

రుద్రుఁడు సాకారుఁడెట్లు? సర్వాత్మకుఁడెట్లు? పాశుపత వ్రతము ఎట్టిది?
దేవతలు శివ ప్రబోధము నెట్లు వినగలిగిరి? అమరులకు శివుఁడు ప్రత్యక్ష వై మరుగుపడెనెట్లు ? అని సనత్కుమారుఁడు ప్రశ్నింపగా - నందికేశ్వరుఁడు దిగువ విధము
వక్కాణించెను.

అక్షరుఁడగు శివుని వలన సంసార మండపమునకు స్తంభమువంటి రుద్రుఁడుడయించెను గాన శివుడే జగత్తునకు మూలకారణమని తెలియవలెను. అట్టి శివుడు ఋషి (సర్వజ్ఞుడు) యనియు, విశ్వాధికుడనియు, ప్రభువనియు; “దేవతలలో మొదటి వాడు, తన ముఖకమలము నుండి ఉద్భవించినవాడు నగు “ బ్రహ్మదేవుని కరుణలో నవలోకించినందున విధాత సమస్తమును సృజింపగలిగెను. మరియు వర్ణాశ్రమముల నేర్పరచెను. ఇంతియే గాక శివుఁడు మొదట ఉమాసహితమ హేశ్వరుని పుట్టింపగా మహేశ్వరుని వలన శ్రీ నారాయణుడు, దేవేంద్రుఁడు, అగ్ని, యజ్ఞము, హవిస్సు నుచయించినవి యనియు;

అంచు వలన జగత్తంతయు సోమ (ఉమా మహేశ్వర) మయమైనదనియు గుర్తింపవలెను.

ఒకప్పుడు హరిబ్రహ్మేంద్రాది దేవతలు స్వర్గ మనఁదగు కైలాసముఁజేరుచుండగా నవ్వారి పరిపూర్ణ జ్ఞానము మహేశ్వరుడాకర్షించినందున నమరులు “నీవెవరు? అని ప్రశ్నించిరి.

అంత - “నేనే పురాతనుఁడును; మహాసృష్టికంటే ముందు నేనే యుంటిని. ప్రస్తుతము ఉండువాడను నేనేను; ఇకముందు గూడ నుండగలను నాకంటె వేరగు వస్తువు లేదని తెలియుఁడు !

నిత్యుడను, అనిత్యుఁడను, అనఘుఁడను, హిరణ్యగర్భుఁడ (విరాట్) ను, వేద ప్రభువును నేనేను. దిశలు, విదిశలు, ప్రకృతి, పురుషుఁడు, ఛందస్సులు, సత్యము, త్రేతాగ్ని, అధ్యాపనము,ఆచార్యుడు, పృథివి, హృదయ గుహయు నేనేను. గహ్వరములగు కాశీ క్షేత్రాదులందు ప్రత్యక్షమగు వాడను. పంచవింశతి తత్త్వముల కంటె పరుఁడను. సముద్రుఁడు, ఉదకము, తేజస్సు, పరిష్కరింపఁబడిన యజ్ఞ ప్రదేశము, ఋక్ యజుః సామాధర్వణ వేదములు, హృదయగత చిదాకాశము, ఇతిహాస పురాణములు, కల్పములు,
జగద్రచన, అక్షరము, క్షరము, శాంతి, క్షమ, (ఓర్పు) పవిత్రమైన హృదయ పుండరీకము, హృదయ మధ్యస్థానంబు నేనేను.

లోన వెలుపల ముందు నుండు వాడనై జ్యోతిస్సు, చీకటియు నేనగుదును; బ్రహ్మ విష్ణు రుద్రులు నా రూపాంతరములేను; మరియు బుద్ధి, అహంకారము, తన్మాత్ర పంచభూతములు, ఇంద్రియములు, సమస్తంబు నారూపమేనని భావించువాడు-చరాచరమునంతయు కనుగొనగలుగును. వాక్కును వేదములతో; బ్రాహ్మణులను బ్రాహ్మణ్యముతోడను; హవ్యములను హవిస్సుతోడను; ఆయుష్యమును జీవనముతోడను; ధర్మమును సన్మార్గముతోడను; నా ప్రభావమును పురస్కరించుకొని పెంపొందించువాడను.

ఇట్లు వక్కాణించి సదాశివు డంతర్ధానముఁజెందగా హరిబ్రహ్మాది దేవతలు, మునులు నూర్ధ్వ బాహువులై నిలువంబడి రుద్రాధ్యాయాదులతో పరమేశ్వరుని నుతించిరి.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (17)వ యధ్యాయము.