లింగ మహా పురాణము

Table of Contents

13 - తత్పురుష సముద్భవ నిరూపణము

ముప్పది యొకటవ కల్పము పీత వాసమని చెప్పఁబడును. ఈ కల్పమునందు బ్రహ్మదేవుఁడు పచ్చని బట్టలఁ గట్టుకొని పుత్ర కాముఁడై పరమేశ్వరుని నుతింపగా నొక కుమారుఁడు ఉదయించెను. ఆతడు పచ్చని వస్త్రములను ధరించి పసుపు వన్నెగల శ్రీగంధమును ఒంటి నిండ పూసికొని యువకుడుగా సువర్ణ యజ్ఞోపవీత ధారియై యుండెను. చతుర్ముఖుఁడా మహాపురుషుని ధ్యానించుచుండగా మహాదేవుని నోటి నుండి నాలుగు పాదములు, నాలుగు ముఖములు, నాలుగు చేతులు, నాలుగు స్తనములు (పాలిండ్లు) నాలుగు నేత్రములు, నాలుగు కొమ్ములు, నాలుగు కోఱలు, సాముద్రిక శాస్తోకములగు ముప్పది రెండు గుణములును గలిగి ఆవిర్భవించిన గోవు నవలోకించెను.

అట్టితఱి మహాదేవుఁడు గోవును మతియని స్మృతియని బుద్ధియనియు వ్యవహరించుచు రమ్ము రమ్ము అని అనుగ్రహముతో పిలువగా నా గోదేవి దోసి లొగ్గినదై తత్పురుషుఁడనఁబడు పరమేశ్వరుని సమీపించెను. అంత తత్పురుషుఁడు “విశ్వము నధిష్ఠించి శివధ్యాయోగమున సమస్తమును స్వాధీన పఱచుకొనుము! “ఆని గోదేవినాదేశించియు “నీవు రుద్రాణివి ( శివపత్నివి) కాగలవు! మరియు పంచబ్రహ్మభక్తుల హితమునకై మోక్షము నొసగుదువు! అని యనుగ్రహించెను.

అట్టిగొదేవిని విధాత మహేశ్వర శాసనము ననుసరించి గ్రహించివాడై వేదోక్తమైన రుద్రగాయత్రీ మంత్రమును తత్పరుషుని వలన స్వీకరించి జపించినందున మహేశ్వరుఁడు ప్రసన్నుఁడై బ్రహ్మదేవునకు దివ్యమైన ధ్యానయోగముఁ దగుసిద్ధిని, ఐశ్వర్యమును వైరాగ్యమును ప్రసాదించెను.

అంత తత్పురుషుని పార్శ్వమునుండి నలుగురు కుమారులు తత్పురుషుని శిష్యులుగా నుడయించిరి. వారు పీతమాల్యాంబర ధారులై పీత గంథాను లేపనులై పచ్చని ముఖములు గలవారై పసువు వన్నె గలవెంట్రుకలు గలవారునై యుండిరి.

మరియు వారు మునులకు శివయోగము నుపదేశించివేయి దివ్య సంవత్సరముల చివరివేళ - శివధ్యానయోగ సిద్ధింబడసి శివునిలో లీనులగుదురు.

ఇతరులు ఈ తత్పురుషు నుపాసించినచో పాపములఁ బోగొట్టుకొని పునర్జన్మరహితులునై శివసాయుజ్యముఁ జెంచుదురు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాడ ప్రవచనమున
(13) పది మూడవ యధ్యాయము.