లింగ మహా పురాణము
78 - భక్తి మహిమను అహింసామహిమను నిరూపించుట
సూత ఉవాచ -సూతముని వక్కాణించెను.
వస్త్రములో వడబోసిన ఉదకముతో శివాలయ ప్రదేశమును కడుగవలెను. ఒకవేళ జలమును వడబోయనిచో అట్టియుదకము నిష్ఫలమగును. వస్త్రపూతోదకములు-పవిత్రములు బురుగు లేనివియు నగును గాన దైవిక కార్యముల నన్నిటిని వస్త్రపూతజలమునే ఉపయోగింపవలసియుండును. ఉదకములు వస్త్ర పూతములు కానిచో ఉదకములలో సూక్ష్మక్రిములుండును గాన వానిని హింసించిన పాపము ఘటించును.
ఊడ్చుటయందు చల్లుటలోను అగ్నియందును ఱోలునందు తిరుగలి (విసుర్రాయి)
యందును జీవిహింస గృహస్థులకు సంభవించును. గాన మానవులకు అహింసాధర్మము ముఖ్యముగా పరిగణింపబడినది.
దానములలో అభయదానము అభయదానము శ్రేష్ఠమైనది. అహింసావ్రతస్థుని ప్రాణులన్నియు రక్షించుచు హింసకుని బాధించుచుండును.
వేదశాస్త్రపారగుడైన బ్రాహ్మణునకు సమస్త బ్రహ్మండమును దానము చేసిన ఫలమునకంటే కోటిరెట్లు అధికఫలమును అహింసకుడు పొందును. మనో వాక్కాయములచే సమస్తప్రాణులకు మేలు నొనగూర్చుచు, భూతదయతో సన్మార్గము నవలంబించి యుండువారు బహుకుటుంబములను పుత్రపౌత్రస్నేహముతో రక్షించువారును-కైలాసముఁజేరి శివానుగ్రహపాత్రులగుదురు.
ముల్లోకములను సంహరించినచో కలుగు దోషము శివాలయమున నొక ప్రాణిని మాత్రము హింసించుబువలన సంఘటించును. యజ్ఞములో చేయ బడు పశుహింస శివునికొరకు గొవింపబడు పుష్పహింసయు క్షత్రియులు దుర్మార్గులగు జారచోరాదులను శిక్షించుటయు, దోషావహములు కావు.
సర్వకర్మలను పరిత్యజించి సన్న్యసించిన శివయోగులు నిషిద్ధ మార్గప్రవర్తనులైనను సంహరింప దగినవారు కారు. అత్రిమహర్షి వంశమునందు జన్మించిన స్త్రీలు పతివ్రతలైనచో వారిని హింసింప గూడదు. యజ్ఞముకొరకైనను స్త్రీలను బాధింపగూడదు. కాని ఆడపశువులను హింసించుట విహితమైనదేను, ఒక్క స్త్రీని హింసించినచో బ్రహ్మహత్యా సమానమగు పాపము ఘటించును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములలో ఏవర్ణస్థురాలైనను పాపాత్మురాలైనచో ఆమెను గూడ హింసింపరాదు. స్త్రీలుసుందరులైనను కురూపిణులైనను మలిన వస్త్రధారిణులైనను అవ్వారిఁగూడ హింసించుట-పాడి కాదు.
ఇక-వేదబాహ్యులు, శ్రౌత స్మార్త బహిష్కృతులు, ద్విజులచే తాకుటకు మాటలాడుటకు చూచుటకును తగనివారు నగు పాషండులు గూడ రాజుచేతను ప్రజలచేతను చంపదగినవారు కారు.
ద్విజులారా ! ప్రసంగవశాత్తు మహేశ్వరునొక్క పర్యాయమైనను పూజించువాడును కైలాసముఁజెందును. జగత్తునకు పరమకారణుడైన పరమేశ్వరునందు భక్తి లేని వారే జీవకారుణ్యరహితులగువారు - ఎల్లకాలము కటకటపడుచుందురు. శివునందు ఏకాగ్రభక్తి గలవారు భాగ్యవంతులై ఈ లోకముననే సుఖభోగములు కలవారునై దేహాంతమున ముక్తులగుదురు. కళత్రపుత్రగృహాదులయందు గల అనురాగము మహేశ్వరునందు యతులయందు తాపసులయందును కలిగినయెడల నట్టి వారికి శివలోకము తటస్థమై యుండును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (78)వ అధ్యాయము.
