లింగ మహా పురాణము

Table of Contents

25 - పంచ వింశాధ్యాయము

  ఇందుగల శివాగ్నికార్యము ఎట్లనఁగా?

 మూరెడు వెడల్పు పొడవుగల నలుచదరము కుండమును
నాలుగు రెండు అంగుళముల వెడల్పుగల మేఖలలు (మెట్లు) ఉండునట్లు, ఊర్ధ్వమేఖలపై రాగి ఆకువలె యోని యుండునట్లు నిర్మింపవలెను. కుండమధ్యన నాభి ఎనిమిది దళములు గల కమలము కర్ణికతో ప్రాదేశ (చూపుడు వ్రేలిని బొటన వేలిని చాచి పట్టిన కొలత) మాత్రముండునట్లు; అస్త్రమంత్రముతో శుభ్రపరచి కవచమంత్రముతో జలమును చల్లియు. నేత్రమంత్రముతో నవలోకించి - మూడు రేఖల నడ్డముగాను రేఖాశ్రయమును  పొడవుగాను ప్రాదేశమాత్రమగు నాభిపై వ్రాయవలెను.

 జమ్మి రావి కఱ్ఱలతో చేయఁబడిన ఆరణియందు ”రం” అను వహ్ని బీజముతో కూడిన వహ్నిమంత్రములతో మథింపఁబడిన అగ్నిని నాభియండు స్థాపించి అష్టదిశలయందు నుదకముతో పరిసంమోహనమును చేసి హవనప్రాతల నధోముఖముగా నునిచి వానిపై దర్భల వాచ్ఛాదించి - దక్షిణమున శివుని స్థాపించి మూలమంత్రముతో షోడశోపచారముల నర్చింపవలెను.

- యజ్ఞానుకూల వృక్ష కాష్ఠములతో నిర్మింపబడిన స్రుక్ స్రువములను
హవనమునందుపయోగింపవలెను.

స్రుక్ స్రువములు - సువర్ణముతో - లేక - వెండితో నిర్మింపఁబడినవి - ప్రశస్తములగును. అశక్తులు కాష్ఠనిర్మితములను వాడవచ్చును.

పంచవింశత్కుశలతో స్రుక్ స్రువముల జలమును ప్రోక్షించి కుండాగ్నిపై తపింపఁజేసి. మేఖలలపై నుంచవలెను.

ఆ తరువాత వాగీశ్వరీ వాగీశ్వరులను పూజించి అరణిసంభవము లేక  నిత్యాగ్నిహోత్రజంబు  నగు అగ్నిని - తామ్రపాత్రయందు - లేక - శరావము (మట్టి కంచుడు) నందు తీసికొని - క్రవ్యాదాంశమును పరిత్యజించి కుండ మధ్యయందు స్థాపించవలెను.

“ఓం అగ్నయే స్వాహా” “ఓం సోమాయ స్వాహా” “ఓం అగ్నీ షోమాభ్యాం స్వాహా”
అనుచు ఘృతాహుతుల నొసఁగవలెను. హవనమునకు - చదువు, సమిధలు, ఆజ్యంబు ముఖ్యములు. ఆ పిమ్మలు - సద్యోజాతాది పంచ బ్రహ్మ మంత్రములతో శివషడక్షర మంత్రముతోడను 1000 - 500 - 108 అనువానిలో నేదేనొక సంఖ్యగా వ్రేల్చి - మూలమంత్రముతో పూర్ణాహుతి నొనర్పవలెను.

ఇట్లు శివాగ్నికార్యమును నిత్య మొనర్చు శివభక్తుఁడు ఇహలోకమున జఠరాగ్ని దీప్తి నొంది - జీవితాంతమున – నరకముఁబొందనివాడై - కైలాసముఁ జేరును.

 కాని - ముముక్షువు - క్రిమికీటకాది ప్రాణిహింస కాకుండా - జాగరూకుఁడై శివాగ్ని కార్యమును చేయవలసియుండును.

అథవా - హృదయములో అగ్నియున్నట్లు భావించి - ప్రాణాయాము పురస్సరముగా ధ్యానయజ్ఞము నాచరించినయెడల - శివానుగ్రహపాత్రత సమకూరును. శివభావన లేనట్టి యజ్ఞము వలన అనర్థము సంభవించును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ

 ఆంధ్రానువాద ప్రవచనమున (25)వ యధ్యాయము.