లింగ మహా పురాణము
74 - దేవతాస్వీకృత శివ లింగములను శివలింగభేదములను నిరూపించుట
విశ్వకర్మ - బ్రహ్మదేవాజ్ఞ ననుసరించి దేవతలకు వారి వారి యధికారముల కనుగుణముగా ఆయా శివలింగములను నిర్మించి యిచ్చెను. ఎట్లనగా ?
విష్ణుమూర్తి ఇంద్రనీలమణిమయమగు శివలింగమును పూజింప స్వీకరించెను. దేవేంద్రుడు పద్మరాగ మణిమయమును, కుబేరుడు-సువర్ణమయమును. విశ్వేదేవతలు రజత (వెండి) మయమును; అష్టవసువులు చంద్రకాంతమణిమయమును; వాయుదేవుడు ఆరకూట (ఇత్తడి) మయమును; అశ్వినీ దేవతలు పార్థివ (మృత్తికా) లింగమును; వరుణదేవుడు స్ఫటికలింగమును, ఆదిత్యులు-తామ్ర (రాగి) మయమును; చంద్రుడు మౌక్తిక (ముత్తెము) లింగమును; అనంతాదిమహానాగములు ప్రవాళ (పగడము) మయమును; దైత్యులు రాక్షసులును అయో (ఇనుము) మయమును; గుహ్యకులు బంగారం వెండి ఇత్తడి కలిసిన త్రిలోహమయమును; ప్రమథగణములు సువర్ణ రజత తామ్ర పిత్తలాయస్సులు కూడిన సర్వలోహమయమును; చాముండాది మాతృమూర్తులు సైకత (ఇసుక) లింగమును; నైఋతి దేవదారు (కఱ్ఱ) మయమును; యముడు మరకతలింగమును, నీలలోహితాది ఏకాదశరుద్రులు భస్మమయమును; లక్ష్మీదేవి - బిల్వకాష్ఠమయమును. కుమారస్వామి గోమయ (ఆవుపేడ) మును; మునులు కుశాగ్ర (దర్భకొనలతో నిర్మింపబడిన) మయమును; వామాది శక్తులు పుష్పనిర్మిత లింగమును, మనోన్మనీ శక్తి సుగంధ ద్రవ్యమిశ్రిత లింగమును; సరస్వతీదేవి రత్న (శ్వేతవజ్ర)
మయమును; దుర్గాదేవి - సువర్ణలింగమును ఉగ్రాశక్తి పిష్ట (పిండి) మయమును; మంత్ర దేవతలు పేరిన నెయ్యితో చేయబడిన లింగమును; మూర్తి మంతములైన వేదములు గట్టిపడిన పెరుగుదానిని; దివ్యపిశాచములు సత్తుతో చేయబడినదానిని స్వీకరించి బ్రహ్మోక విధానమున ఆ యా శివలింగముల నర్చించినవారై తమ తమకు తగిన పదవులను స్థిరపఱచుకొనిరి.
పెక్కు చెప్పనేల ? చరాచర ప్రపంచ మంతయు శివలింగము నారాధించియే నిలుకడ కలిగినదైనది. ఇందెంతమాత్రము సంశయము లేదు.
ద్రవ్యభేదముఁ బట్టి లింగము- శైలజము, రత్నజము, ధాతుజము, దారుజము, మృణ్మయము, క్షణికంబునని షడ్విధమగునది. వీనిలో అవాంతర భేదములు నలుబదినాలుగు గలవు.
(ధాతుజ మనగా గైరికాది ధాతువుచే నిర్మింప బడినది)
(క్షణిక మనగా ముగ్గుపిండి మున్నగు వానితో చేయబడినది.)
శ్లో॥ శ్రీప్రదం రత్నజం లింగం శైలజం సర్వసిద్ధిదం । ధాతుజం ధనదం సాక్షాద్దారుజం భోగసిద్ధిదమ్ ॥ శ్లో॥ మృణ్మయం చైవ విప్రేందాః సర్వసిద్ధికరం శుభం । మన శ్చింతాహారం చైవ - క్షణికం ప్రోచ్యతే బుధైః ॥
“రత్నలింగము లక్ష్మీప్రదమగును. శైలజము సిద్ధులనన్నిటి నొసగును. ధాతుజము
ధనసమృద్ధిప్రదము; దారుజము సుఖభోగదాయకము; మృణ్మయ లింగము తాత్కాలికమనోరథములను సిద్ధింపఁజేయును. క్షణికము మనశ్చింతను తొలగించును.
శ్లో॥ శైలజం చోత్తమం ప్రోక్తం మధ్యమం రత్నజం తథా । థాతుజాదిక లింగంతు కనిష్ఠం సంభవేద్ధృవమ్ ॥
స్ఫటికాది శిలానిర్మితము ఉత్తమమనియు రత్ననిర్మితము మధ్యమమనియు. ధాత్వాది కృతము కనిష్ఠంబు ననియు తెలియవలెను.
శ్లో॥ మూలే బ్రహ్మా తథా మధ్యే విష్ణు రగ్రే మహేశ్వరః। రుద్రోపరి మహాదేవః - ప్రణవాఖ్య స్సదాశివః ॥
క్రింది గద్దెయందు బ్రహ్మదేవుడు; పానవట్టమున విష్ణువు; పానవట్టము పైగల పిండమున మహేశ్వరుడు; ఆపైన ప్రణావాత్మకుఁడగు సదాశివుండును నివసింతురు.
శ్లో॥ లింగవేదీ మహాదేవీ త్రిగుణా త్రిమయాంబికా । తయా చ పూజయే ద్యస్తు దేవీ దేవశ్చపూజితౌ ॥
లింగము యొక్క వేదిక సత్త్వ రజస్తమోగుణ భరిత బ్రహ్మవిష్ణురుద్ర స్వరూపు రాలు నగు మహాదేవి అంబిక యగును. వేదికపై విలసిల్లు పిండము మహేశ్వరుడగును గాన పాన వట్టముతో కూడిన లింగము నర్చించినచో పార్వతీపరమేశ్వరులను పూజించిన ఫలముచేకూరును.
శైజలింగమునైనను రత్నజ లింగమునైనను సలక్షణమగు మందిరమున స్థాపించిన పుణ్యాత్ముడు శ్రీహరి చేత బ్రహ్మదేవుని చేత దేవేంద్రుని చేతను అగ్నియమ వరుణ కుబేరాది దిక్పాలురచేతను సిద్ధ విద్యాధర నాగేంద్ర యక్ష కిన్నర దానవాదుల చేతను నుతింపబడుచు దేవదుందుభిధ్వనుల నానందముతో వినుచును భూర్భువః స్వర్మహోజన తపస్సత్య లోకముల నతిక్రమించి తన పుణ్య ప్రభావముతో విరాజిల్లుచు. “లింగ స్థాపనము” అను సన్మార్గమునందు ఉంచబడినది స్వాధీనంబునగు ఖడ్గముతో ‘బ్రహ్మాండమును భేదించి పరమపద (మహాకైలాస)మున త్వరలో ప్రవేశించును.
ధాతుజము,, దారుజము, మృణ్మయము, క్షణికంబు నగు శివలింగము స్థాపనయోగ్యము కాదు. లింగస్థాపకుడు జీవిత కాలములో దేవీ గణేశ నందినాగ సహితముగా పిధియుక్తముగాను మొల్ల వన్నెగలది, గోక్షీరసంకాశంబు నగు శివలింగమును స్థాపించవలెను. పరమేశ్వరుడు మానవుడగు స్థాపకుని తనవునందుండువాడనుటను శంకింప నవసరము లేదు.
అట్టి శివలింగమును దర్శించినను స్పృశించినను మానవులు, తత్కాలముననే పరమానందము నొందుదురు. లింగస్థాపనపుణ్యమును పరిగణించుటకు సూర్లకొలది యుగములైనను చాలవు గాని ప్రయాసప్రయత్నములతో యాచనతో నైనను శివలింగమును స్థాపించుట ఉత్తమోత్తమునుగుచున్నయది.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాచ ప్రవచనమున (74) వ అధ్యాయము.
