లింగ మహా పురాణము

Table of Contents

81 - ద్వాదశ లింగవ్రతనిరూపణము

“పశుపతికి సబంధించిన ద్వాదశలింగవ్రతమును వివరింపు” మని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు దిగువవిధము వక్కాణించెను.

పూర్వము సనత్కుమారుఁడు ప్రశ్నింపగా నందికేశ్వరుఁడు చెప్పినవిధము నీ వ్రతమును సంగ్రహించి చెప్పుచున్నాను.

ఇయ్యది శివభక్తులకు సమస్త భయములను తొలగించును. ఆత్మీయులతో ఎడబాటును కలిగింపదు. భోగమోక్షముల నొసఁగును. ఆరు అంగములతో కూడిన వేదముల యొక్క సారముగా గ్రహింపఁబడినదై మహా దానముల నన్నిటినొనర్చిన ఫలము, మరియు పదివేల అశ్వమేధ – యాగముల ఫలమును మించిన పుణ్యమును, సమస్త శుభములను ఒనగూర్చునదై శత్రువులందరి నోడింపఁజేయునదై సమస్త మహాజ్వరాది వ్యాధు (రోగము) లను తగ్గించునదియనై యున్నది.

శ్రీహరి బ్రహ్మాది దేవతలందరు నీ ద్వాదశలింగవ్రతము నాచరించి తమ తమ పదవులను స్థిరపఱచుకొనిరి.

అట్టి వ్రతమునాచరించుట యెట్లనగా ? విప్రేంద్రులారా ! చైత్రమాసము మొదలుకొని ఫాల్గున మాసమువరకు పూర్ణిమ నాడు నీ వ్రతము నవలంబింపవలెను.

నవరత్నఖచితమగు అష్టదళములు గల బంగారు కమలములో నడుమ గల దుద్దుపై పీఠముతో కాస్త పెద్దదగు స్ఫటిక శివలింగమునునిచి భస్మ శ్రీ గంధాక్షతలతో, శ్వేతసహస్రకమలములతో, నల్లని కలువల తోడను, తెల్లజిల్లేడు- కొండగోగు, గన్నేరు మొదలగు పుష్పముల తోడను, బిల్వదళములతోడను, (వీనిలో దొరికిన వానితో) పూజించి, ధూపదీపనైవెద్యములను మంగళనీరాజన మంత్రపుష్పములను సమర్పించవలెను. ఈ యుపచారముల నన్నిటిని “తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహి-తన్నో రుద్రః ప్రచోదయాత్” అను రుద్రగాయత్రీమంత్రము జదువుచు సమర్పించవలెను. ఇక నొక తూమెడు బియ్యముతో వండఁబడిన అన్నమును సూపశాక ఘృతాది వ్యంజన సహితముగా మహానైవేద్యమును పన్నెండవ నెలలో సమర్పించి భక్తులకు పంచిపెట్టవలెను. తామును భుజింపవలెను. పదకొండు నెలలలో సాధారణ నినివేదనము నిడవలెను. ఈ స్పటిక లింగార్చనము నొకేవిధముగా పన్నెండు నెలలలో చేయవచ్చును.

సద్యోజాత – వామదేవ – అఘోర – తత్పురుష - ఈశాములనఁబడు పంచబ్రహ్మమంత్రములతో పన్నెండు నెలలలో స్ఫటిక లింగము నర్చింపవచ్చును.

విశేషమేమసఁగా ?

వైశాఖమాసమున వజ్ర లింగమును జ్యేష్ఠమాసమున మరకతలింగమును, ఆషాఢమున మౌక్తిక (ముత్తెపు చూర్ణముతో చేయబడిన) లింగమును; శ్రావణమునండు నీలమణి లింగమును; భాద్రపచమున పద్మరాగనిర్మిత లింగమును; ఆశ్వీజమాసమున గోమేధిక లింగమును; కార్తికమున ప్రవాళ (పగడాల పొడితో చేయబడిన) లింగమును; మార్గశీర్షమున వైడూర్యలింగమున ; పుష్య మాసమున పుష్పరాగ లింగమును; మాఘమాసమున సూర్యకాంతమణి నిర్మిత లింగమును; ఫాల్గునమున స్ఫటిక లింగమును పూర్వోక్త విధానముగా నర్చింపవలెను.

అన్ని నెలలయందు అష్టదళ సువర్ణకమలయొక్కటేను; బంగారము దొరుకనిచో వెండితో కమలమును చేయించి పెట్టవచ్చును. శివలింగమును పైరీతి నొక్కొకవిఛముగా చేయించుటకు శక్తి లేనివారు స్ఫటిక లింగమును లేక పార్థివ (మట్టి) లింగమును ద్వాదశమాసములలో సర్చింపవచ్చును.

హేమంత ఋతువున బిల్వదళపూజనము శ్రేష్ఠము, అష్టోత్తరశత(108) కమలములతోడను శంభు నర్చింపవలెను.

బిల్పపత్రమునందు లక్ష్మీదేవి; నల్లని కలువయందు పార్వతీ దేవి; కలువయందు కుమారస్వామి; కమలమునందు మహాదేవుడు; నివసింతురు.

నీలోత్పలము, ఉత్పలము; కమలము నను పుష్పములతో శివపూజనము సర్వవశ్యకరంబగును. గుగ్గులు ధూపము, దీపమాలయు సర్వరోగక్షయకరములగును. శ్రీగంధ సమర్పణము సర్వాభీష్టసిద్ధిప్రధoబు; తెల్లజిల్లేడు నందు బ్రహ్మదేవుఁడు; కొండగోగునందు- ధారణాశక్తి; గన్నేరునందు గణపతి; ఒక పుష్పమునందు నారాయణుఁడు; పరిమళించు పుష్పములన్నిటియందు అంబికా (పార్వతీ) దేవి నివసింతురు. ఈ పుష్పములలో దొరికినవానితో భక్తి గలవారై శివుని యథాశక్తి పూజింపవలెను. పరమాన్నముపై నెయ్యి వేసి నివేదింపవలెను. 100 కిలోలు గాని, 50 కిలోలు గాని బియ్యం ఉడికించిన అన్నమును గాని, పెసరపప్పుతో కూడిన పులగమును గాని నివేదింపవలెను.

ఛత్ర చామర తాళవృంతాది రాజోపచారములను సమర్పించవలెను. న్యాయముతో సంపాదించిన ధనముతో పిండివంటలు భక్ష్యభోజ్యాచులు చేయించి నివేదింపవలెను.

పాలసముద్రము నుండి అమృతము ఉద్భవించి దేవతలకు అమరత్వము నొసఁగుటచే- క్షీరాన్న (పాయస) ము - పరమేశ్వరునకు నివేదింపనుపయుక్తమగును. ఉపహారములగు పిండివంటలు భోక్తలను సంతోషింపఁజేయును. కూరలు పప్పులు ప్రాణాపానవాయువులను సరిగా సంచరింపజేయును. అన్నము వలననే జీవనము కొనసాగును. వరి అన్నమునందు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నివసింతురు గాన అన్నరాశిని శివలింగమునకు నివేదించి భక్తులకు పంచినచో త్రిమూర్తులు సంతసించెదరు.

లింగ పీఠము ప్రకృతి యనియు, లింగము పురుషుఁడనియు, మరియొక నిర్వచనము. ప్రకృతి పురుషాత్మకము, త్రిమూర్త్యాత్మకము, హరిహరాత్మకము, శక్తి శివాత్మకము, ప్రణవాత్మకంబు నగు శివలింగమును ప్రతినెల పున్నమినాడు పూర్వోక్తిరీతి నర్చించు వానికి సర్వకామార్థములు సిద్ధించును.

ఇట్టి లింగవ్రతము నాచరించువారికి సత్యము, శౌచము, భూతదయ, మనశ్శాంతి,
సంతోషము, యథాశక్తి దానము, పౌర్ణిమామావాస్యల రెంటియందు నక్తము లేక ఉపవాసము ననునవి ముఖ్యములు.

సంవత్సరాంతమున గోదానమును వృషోత్సర్గము (ఒకానొక వృషభమును కొని దానిని పూజించి, శివునిముందు విడుచుట) ను చేయవలెను.

శ్రోత్రియులు శివభక్తులు నగు బ్రాహ్మణులకు షడ్రసోపేతభోజనమును తాంబూలమును దక్షిణను సమర్పించవలేను.

ఇల్లు పన్నెండు నెలలు శివ లింగమహావ్రతమును భక్తితో చేయు పుణ్యాత్ముఁడు శివయోగులలో శ్రేష్ఠుఁడగును. మరియు దేహాంతమున సూర్యకోటి ప్రతీకాశములు, రత్నభూషితంబులునగు విమానములలో శివ లోకము జేరి పునర్జన్మ లేనివాడై శివానండము ననుభవించును. పన్నెండు నెలలు నీ వ్రతము నాచరింపఁజాలనివారు- ఒక నెలయైన నీ వ్రతమును నిష్కామ్యముగ గావించినచో శివలోకనివాసము సంఘటించును. అథవా ఒక సంవత్సరమునందు ప్రతి పూర్ణిమయందీ వ్రతము నాచరించినయెడల కోరికలన్నియు సిద్ధించుటే గాక అంత్యకాలమున శివ సాయుజ్యము లభించును.

ఒకవేళ ఆసక్తి ఉన్నచో అమరత్వము పితృదేవత్వము దేవేంద్రపదవి ప్రమథగణాధిపతిత్వంబు నీ వ్రతము నాచరించుటవలన- లభించును. మరియు నీ జన్మమున- విద్యార్థియైనచో అభ్యస్త విద్యయందు నిష్ణాతుడగును. సుఖభోగము నపేక్షించువాడు మానవోత్తమ సుఖముల ననుభవించును. ధనార్థియైనయెడల ద్రవ్య నిధిని దర్శించి పొందును. ఆయుష్కాముడు చిరంజీవి యగును.

ఏ యే వాంఛలను మనస్సునందిడుకొనునో ఆయా అభీష్టములనననుభవించి యానందించును.

ఒక నెల నీ వ్రతము నవలంబించుట తోడనే ఆరిష్టములతో నొక్కొకటి తొలగుట
ప్రారంభమగును. మరియు నీ వ్రతము- పవిత్రమై వేద స్మృతి పూరాణరహస్యంబునై దేవాసురసిద్ధ విద్యాధర మానవాచులకు హితావహంబునై యుండునట్లు బ్రహ్మదేవుఁడు వక్కాణించెను.

ఏతద్విధానముతో పరమేశ్వరు నర్చించి పూజాంతమున వ్యపోహనస్తోత్రమును శివలింగముముందు పఠింపవలెను. రః స్తోత్రమును సమస్తప్రాణుల మేలునకై పితామహుడు రచించెను గాన నియ్యది అమరస్వీకృతమై గొప్ప మహిమ గలదైనది.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (81)వ అధ్యాయము.