లింగ మహా పురాణము

Table of Contents

15 - మహేశ్వరుని సంజ్ఞలను వర్ణించుట

నందికేశ్వరుఁడు చెప్పదొడంగెను.

పెక్కు మునీంద్రులు శివుని మహిమను బహుశబ్దములు గల సంజ్ఞలతో నుడివిరి. ఎట్లనఁగా? నిత్య ద్రవ్యము అనదగు సత్తు, అనిత్యవస్తు రూపమగు అసత్తు, శివుఁడే ననియు; సదసత్పదార్థముల యొక్క ప్రభువు శివుడే ననియు గౌతమాదులు నిర్వచించిరి. ప్రాణుల ఉనికి మొదలగు వికారముల వలన విశదమగునది సద్రూపమనియు అట్టి వికారములు లేనిది అసద్రూపమనియు నీ సదసద్రూపములను నియమించు వాడు శివుఁడేనని మరియొక నిర్వచనము.

అ వ్యక్త మనఁబడు అక్షరము వ్యక్త మనఁదగు క్షరంబూ శంకరుఁడే గాన శివునికంటె వేరైనది లేదని తెలియవలెను. క్షరాక్షరములకంటె పరుఁడు శివుఁడేను. ఇట్లు సాంఖ్యులు ప్రతిపాదించిరి.

సమస్త ప్రాణి స్వరూపునిగా శివుని ధ్యానించు జీవాత్మ వ్యక్తుఁడగును.

అవ్యక్తము సమష్టి కాగా వ్యక్తము వ్యష్టియగును. ఇట్టి సమష్టకి వ్యష్టికిని కారణము శివుడే నని యోగశాస్త్రజ్ఞులు నిర్ణయించిరి. క్షేత్ర (శరీర)ము, క్షేత్రజ్ఞుడు (జీవాత్మ) శివుఁడే నని వేదాంతులు నిరూపించిరి.

క్షేత్రమనగా, పృథివ్యాది చతుర్వింశతి (24) తత్త్వములతో కూడిన శరీరమనియు;
శరీరేంద్రియ విషయముల ననుభవించు పురుషుఁడు క్షేత్రజ్ఞుడనియు ఇలలు విదితమైనది. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞలును శివుఁడే ననుట పరమార్థము.

శివుడు పరబ్రహ్మముగా సపర బ్రహ్మముగాను నిర్దేశింపఁ బడినందున - శివభిన్నమైనది. ళేనేలేదని తెలియవలెను. విద్య యవిద్యయు శివుఁడేను. వస్తువుల ననేకరూపములుగా గుర్తించు భ్రాంతి అవిద్య యనియు, వస్తువులన్నియు శివుఁడే నని భావించుట విధ్యయనియు, అవ్యక్తము ప్రకృతి పురుషులు నీ మూడును శివుఁడే నని గుర్తింపవలెననియు సారాంశము.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాధ ప్రవచనమున (15)వ యధ్యాయము.