లింగ మహా పురాణము
8 - యోగ మార్గమున శివు నుపాసించుట - అష్టాంగయోగ వివరణమున్ను
సూతుఁడు చెప్పఁదొడఁగెను.
ప్రస్తుతము యోగస్థానములను సంగ్రహించి చెప్పెదను. ఈ యోగస్థానములను
జగత్కల్యాణమునకై శివుఁడే ఏర్పరచెను.
కంఠము క్రింది చివరి నుండి నాభిపై వరకు గల హృదయ స్థానము - ఉత్తమము.
భ్రూమధ్యస్థానము - మధ్యమము; ఈ స్థానముల యందు యోగము నభ్యసించినచో శివానుగ్రహము వలన సర్వార్థజ్ఞానము కలుగును. మనస్సు ఏకాగ్రము - అనగా నిశ్చలమై స్థిరపడును.శివప్రసాదము యొక్క పరిపూర్ణత - అనుభవములోనే తెలియును.
దానిని బ్రహ్మాదులు గూడ చెప్పఁజాలరు. యోగము నభ్యసించు మానవులకు శివాను గ్రహము క్రమముగా లభించును.
యోగమనఁగా మహేశ్వరుని స్వరూపమగు నిరతిశయ ఆనందమగును. అట్టి ఆనందము లభించుటకు శివజ్ఞానము నిదాన మగును. జ్ఞానాత్మకమగు శివోపాసనము - శివానుగ్రహము వలన ప్రవర్తించును. శివజ్ఞానము వలన ఇంద్రియములను విషయముల నుండి మఱల్చి నిరోధించు శక్తి కలుగుటయే గాక పాపమంతయు నశించును. జితేంద్రియునకు యోగము సిద్ధించును. చిత్తమున కలుగు వాంఛలను నివారించుటయు యోగమగును. ఎనిమిది యోగ సాధనములలో మొదటిది - యమము; రెండవది - నియమము; మూడవది - ఆసనము; నాలుగవది - ప్రాణాయామము; ఐదవది - ప్రత్యాహారము; ఆరవది - ధారణము; ఏడవది ధ్యానము; ఎనిమిదవది - సమాధి;
యమము అనగా వైదిక లౌకిక కర్మలను చాలించుట; అహింస వలన యమము అలవడును. నియమమనగా - సత్యము, దొంగతనము లేకుండుట, బ్రహ్మచర్యము, దేనిని స్వీకరింపకుండుటయు; ఇట్టి నియమమునకు యమమే సాధన మగును.
అహింసయనఁగా తనకు వలె ప్రాణులందరి మేలు కొరకే ప్రవర్తించుట యగును. సత్యమనఁగా- చూచినది వినినది ఊహించినది ఆనుభవించి నదియు నగు విషయమును యథార్ధముగా-ఇతరులకు బాధ కాకుండ చెప్పుట యగును. “నాశ్లీలంకీర్తయేత్” అను శ్రుతి ననుసరించి తుచ్ఛ సంభాషణము జేయకుండుట; ఇతరుల దోషములు తెలిసిన నవ్వానిని పరులకు చెప్పకుండుటయు సత్యమగును. ఆపత్కాలము నందును పరద్రవ్యములను మనస్సు చేతను వాక్కుచేతను క్రియచేతను స్వీకరింపకుండుట ఆర్య మగును. బ్రహ్మచారులు సన్న్యాసులును మనోవాక్కాయములతో మైథునమును (స్త్రీరతిని) ఆచరింపకుండుట బ్రహ్మచర్యమగును. భార్యలేని వైఖానసులు గూడ ఇట్టిబ్రహ్మచర్యమును పాటింపవలెను. ఐతే ధర్మపత్నీ సమేతులైన గృహస్థులు పర స్త్రీ వాంచా రహితులై తమ భార్యల యందు మైథునమును విహిత సమయములలో ఆచరించుటయు బ్రహ్మచర్యమగును.
శ్లో॥ మేధ్యా స్వనారీ - సంభోగం - కృత్వా సానం సమాచరేత్ । ఏవం గృహస్థో యుక్తాత్మా- బ్రహ్మచారీ న సంశయః ॥
గృహస్థుని భార్య- పవిత్రురాలగుటఁ జేసి -- ఆమెయందు రతిసుఖము- బడసిన వెనువెంటనే స్నానముఁ జేయవలెను. స్థిర చిత్తుడైన గృహస్థుడు ఇట్లు ప్రవర్తించినచో - బ్రహ్మచారిగా పరిగణింపబడును. ఇందెంత మాత్రము సంశయములేదు. బ్రాహ్మణులను గురువును అగ్నిని పూజించుటలో విధియుక్తముగ చేయబడు హింస - అహింసయే నగును.స్త్రీలతో సహవాసము వినోద సంభాషణంబు కూడవుగాన స్త్రీలకు దూరముండవలెను. మలమూత్ర విసర్జన స్థలము నందు శవముల యండును గల అసహ్య భావమును స్త్రీలయందు కలిగియుండ వలెను. తన భార్యయందును స్వేచ్ఛా విహారమును విసర్జింపవలెను. తరుణి- అగ్నికణము వంటిది.పురుషుఁడుఘృతకుంభము వంటివాడని గుర్తించి స్త్రీ సంభోగము నమితముగా చేయరాదు. ఇంద్రియ విషయములుభోగముతోతృప్తింజెందవు.అందువలన విషయ సుఖములపై ఆసక్తిని మనోవాక్కాయములతో విడువవలెను.” కామము కామ్యోప భోగముతో శమింపదు. పైగా హవిస్సుతో అగ్నివలె పెంపొందుచుండును. కావున యోగి పురుషుఁడు కామ్య భోగమును విడనాడినచో మోక్షమునకు అర్హుఁడగును.
విషయాసక్తి రహితమగు వైరాగ్యము లేనిచో - దేవ మానవ పశుపక్ష్యాది నానావిధ
జన్మల నొందవలసి వచ్చును.
శ్రుతి స్మృతివిదులైన ద్విజోత్తములారా! విషయ త్యాగము అనఁగా నానావిధ కర్మలను వాంఛాసిద్ధికై ఆచరింపక - అవ్వాని ఫలముల నపేక్షింపక ఈశ్వరార్పణమను త్యాగముగలవారుమాత్రము ముక్తులగుదురు. ఫలాభిసంధితో కూడిన కర్మచేత గాని, సంతానము వలన గాని, స్వార్జిత ధనముచే గాని మోక్షము అనఁగా పునరావృత్తి రహితమగు శాశ్వత శివసాయుజ్యము లభింపదు.
ఋతు కాలమున అనఁగా రజస్వలయైన నాటినుండి ఐడవ దినము మొదలుకొని
పదహారవ దినము వరకు ఒక పర్యాయము మాత్రము తన భార్యయందు రతి సుఖముఁబడసి-మిగత దినములలో సంభోగము లేనివాడైనచో బ్రహ్మచర్యము నాచరించిన వాడగును. ఈ వరకు చెప్పఁబడిన వన్నియు యమము లనబడును. ఇంక నియమముల నవధరింపుడు!
శౌచము -యజ్ఞము- తపస్సు- దానము-స్వాధ్యాయము- ఉపస్థని గ్రహము వ్రతములుఉపవాసము-మౌనము-స్నానముననుపది-నియమములగును. దేని యందు నపేక్ష లేకుండుటయు నియమమగును. శౌచము - తృప్తి- తపస్సు ఆవశ్యకములేను. శివమంత్రము నా వర్తించుట జపమగును. పద్మకము మున్నగునది- ఆసనమగును. శౌచము - బాహ్యము అభ్యంతరము సని ద్వివిధంబు బాహ్యశౌచము నాచరించినను ఆభ్యంతర శౌచము నవశ్యము గావింపవలెను. బాహ్యశౌచము ఆగ్నేయము వారుణము బ్రాహ్మమునను మూడు తెఱగులు గలది గాన శివోపాసకులు బాహ్యస్నానము లఁగావించి అభ్యంతర శౌచ(స్నాన)ము నొనర్పవలెను. తీర్థోదకముల యందు గ్రుంకువిడి అంతఃశౌచము నాచరింపనిచో పరిశుద్ధుఁడు కాడు. మత్స్యము(చేప)లు మొదలగునవి ఉదకము నందున్నను అంతశ్శౌచము లేని కారణమున- పరిశుద్ధము లగుట లేదు. అందువలన ఆభ్యంతర శౌచము నెల్లకాలము చేయవలసి యుండును.
అభ్యంతర శౌచమనగా - ఆత్మజ్ఞానము అను జలమున స్థిరమగు వైరాగ్యము అను మట్టినిసూక్ష్మ శరీరమునకు రాచి కడిగి కొనుట.
స్వాధ్యాయమనగా- ప్రణవము అను సూక్ష్మ పంచాక్షరితో స్థూల పంచాక్షరిని జపించుటయగును. వాచికము ఉపాంశువు, మానసికమును జపము త్రివిధము కాగా వాచికము నకన్న ఉపాంశువు దానికంటే మానసికము శ్రేష్ఠములగు చున్నవి.
వాచికజపమనఁగా ఇతరులకు వినఁబడునట్లు మంత్రము నుచ్చరించుటు; ఉపాంశుజప మనఁగా-తనకు మాత్రము వినబడునట్లు నాలుకపై మంత్రము నావర్తించుట;మానసిక జపమనఁగా-మనస్సులోనే మంత్రము నావర్తించుట;
అచంచలమైన గురుభక్తి గలవాడై విషయముల యందు హఠాత్తుగా ప్రవర్తించు ఇంద్రియములను నిగ్రహించుట యను ప్రత్యాహారము నభ్యసింపవలెను. చిత్తము నేకాగ్రము జేయుట ధారణ యగును.ధారణతో ధ్యానము సమాధియు సిద్ధించును. అన్యచింతనలేనిచిత్తై కాగ్రతతో శివుని లీలా వైభవ మహిమలను చింతించుట ధ్యానమగును. స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఐక్యము నొందినతటి శరీరత్రయము లైనట్లై ఆత్మమాత్రము భాసించు పరిస్థితి సమాధియనఁబడును. ప్రాణాయామము-ఇతర యోగాంగములకు అనఁగా - యమ నియమ ఆసన, ప్రత్యాహార-ధారణ-ధ్యాన-సమాధులకు ముఖ్యసాధనమని తెలియవలెను.
శరీరమందుండు ప్రాణవాయువును నిరోధించుట ప్రాణాయామ మనఁబడును. మందము-మధ్యమము-ఉత్తమమునని ప్రాణాయామము త్రివిధంబగును. ప్రాణవాయువును ఆపానవాయువును నిరోధించుటయు ప్రాణాయామమగును.
ఒక రెప్పపాటు కాలము మాత్ర యనఁ బడును. ఇట్టి పన్నెండు నిమేషముల కాలము ద్వాదశమాత్రమగును. ఇద్ది - కనిష్ఠము. ఈ ప్రాణాయామమునకు “ఉద్వాతము” అనిపేరు. ఇరువదినాలుగు మాత్రలు చేయఁబడునది. మధ్యమము కాగా-ముప్పదియారు మాత్రలకాలమొనర్పఁబడునది - ఉత్తమ మగును. మొదటి దానికి - చెమట పుట్టును. రెండవదానికి-వణకు వచ్చును. మూడవదానికి - శరీరము లేచును.
నిద్రా ఘార్ణిత లోచనములు పులకాంకురములు- ధ్వనితో కూడిన తన శరీరము చులకనగుట శరీరము తిరిగి నట్లుండుటయు- చెమట తో మూర్ఛ వచ్చినట్లగులయు- ఇట్టి అనుభవములను కలిగించు ప్రాణాయామము-ఉత్తమోత్తమమగును.
ప్రాణాయామము-మనోవాక్కాయ కృత దోషములను నిరాకరించి శరీరమును రక్షించును. మరియు దివ్యములైన శాంత్యాదుల నొనగూర్చును.
శాంతి - ప్రశాంతి - దీప్తి - ప్రసాదము అనునవి - యోగముతో సంభవించును. సహజములు ఆగంతుకములు నగు దురితములు శమించుట శాంతి యనబడును. వాక్కులను అదుపులో నుంచుటు - ప్రశాంతి యనబడును. ఎల్లకాలము వికాసముఁజెందుట దీప్తి యగును. ఇంద్రియములు, బుద్ధి, దశ ప్రాణములున్ను స్వస్థములై యుండులు- ప్రసాద మనఁబడును. ప్రాణము, అపానము,సమానము, ఉదానము, వ్యానము ననునవి పంచప్రాణములు కాగా - నాగము, కూర్మము, కృకలము,దేవదత్తము, ధనంజయము అనునవి ఉపవాయువు లగును. శరీరములో పైకి క్రిందికిని ప్రయాణించును గాన ప్రాణమన బడును. ఆహారదులను జీర్ణింపఁజేయునది- అపానముకాగాశరీరమునువంచునది-వ్యాధులను హెచ్చుతగ్గులు చేయునదియు వ్యాన మగును.మర్మస్థానములనుబ్రేకపటుచునది-ఉదానమగును.శరీరాంగములను సమములుగానుంచునది-సమాన వాయువగును. నాగము- ఉద్గారమును
(వాంతిని) కలిగించును. కూర్మము - కండ్లు తెలిపించును. కృకలము- తుమ్మించును. దేవదత్తము-ఆవలింత నొందించును. ధనంజయము- శరీరమంతలు సంచరించుచు మరణించిననువిడువదు.
కంఠస్వరముతడ-బడుట,గొప్ప తెలివి, మనః స్థిరత, స్మరణశక్తి ప్రసిద్ధిఈశ్వరీయజ్ఞానముననునవి- బుద్ధియొక్క లక్షణములు. ఇట్టి బుద్ధి ప్రసన్నమై యుండవలెననునెడప్రాణాయామాద్యష్టాంగయోగమునభ్యసింపవలెను.
శరీరము వ్యాధ్యాదులచే బాధపడుచున్నతటి - అగ్నిచెంతను - ఉదకమునందు లేకజలసమీపమున- ఎండిన ఆకులు గలచోటున- జంతువులు సంచరించు స్థలమున- శ్మశానమునందు-పాడుబడిన ఆవుల కొట్టమున-నాలుగు త్రోవలు కలియు చోటున - పెద్దచప్పుడుగలచోటున-భయంకర స్థలమునందు పుట్టులు ఉన్నచో - అపవిత్ర స్థలమున-దుర్మార్గులుగలప్రదేశమున-దోమలుఈగలు-నల్లులు-పురుగులు గల చోటున-మనస్సుబాగులేనపుడునుయోగమునభ్యసింపరాదు.
రహస్యమైన పవిత్ర స్థలమునందు-పర్వతగుహలోను- శివక్షేత్రమున గల రహస్యస్థానమున-శివసంబంధమైన ఉద్యానమునందు - అరణ్యమునందైనను -స్వగృహమున గల శుభ్రప్రదేశమున-క్రూరజంతువులు లేని నిర్మానుష స్థలమునంచు అత్యంతనిర్మలముగోమయోపలిప్తము(ఆవుపేడతోఅలుక బడి) రంగవల్ల్యాది విచిత్రితము అద్దమువంటిది,కృష్ణాగరుసుధూపితము,నానాపుష్ప సమాకీర్ణము, పైన మేలుకట్టు గలది, ఫలపల్లవమూలాడ్యము,కుశపుష్పసమన్వితంబునగుస్థలమున సమానమగు ఆసనముపై కూర్చుండియోగాంగములనుసంతోషముతోనభ్యసింపవలెను.
మొదట యోగాచార్యుని- తరువాత శంకరుని- పార్వతీ దేవిని వినాయకుని యోగేశ్వరులను-వారి శిష్యులను స్మరించుచు నమస్కరింపవలెను. స్వస్తికాసనమును లేక పద్మాసనమునేర్పరచుకొనిరెండు మోకాళ్లు సమానములుగ నుండునట్లు - లేక ఒకేమోకాలుపైరెండుపాదములనులోనుంచుకొనినోరు కొద్దిగా తెఱిచి కనులు మూసికొని రొమ్ము ముందుండునట్లు మడిమలచే వృషణములను ప్రజననమును కాపాడుచు తలకాయను కొద్దిగా ఎత్తి పైచంతములతో క్రింది దంతములను తాకకుండా తన నాసికాగ్రము నవలోకించుచు దిశలఁజూడకుండ రజో గుణముతోతమోగుణమునణచి, సత్త్వగుణముతో రజోగుణమును గుప్త పడిచి సత్త్వయు గుణము నవలంబించి శివధ్యానయోగము నభ్యసింపవలెను.
శ్లో॥ ఓంకారవాచ్యం పరమం శుద్ధం దీపశిఖాకృతిం। ధ్యాయే ద్వై పుండరీకస్య కర్ణికాయాం సమాహితః ॥
హృదయపుండరీకముఁదగు కర్ణిక (దుద్దు) యంచు పరమేశ్వరుని ఓంకార వాచ్యుఁడుగాను,శుద్ధసత్త్వ సంపన్నుఁడు గాను, దీపముయొక్క అంచుఁబోలిన తేజోమయ ఆకారము గలవాడు గాను ధ్యానింపవలెను.
నాభియందుగాని కంఠము నందు గాని - భ్రూమధ్యయందు గాని- లలాటము (నొసలు)నందుగాని- శిరస్సు నందు గాని శివుని ధ్యానింపవచ్చును. హృదయమున మహేశ్వరుని; నాభికములము నందు సదాశివుని; లలాలమున చంద్రచూడుని; భ్రూమధ్యయందు శంకరుని ధ్యానింపవలెను.
పన్నెండు ప్రాణాయామములు ధారణ కాగా- ధారణలు పండ్రెండ్రు ఐనచో ధ్యానమగును. పన్నెండు పర్యాయములు ధ్యానించుట వలన సమాధి సిద్ధించును.
అథవా - శివయోగుల సహవాసముతో ధ్యానము సమాధి యలవడును. యోగాభ్యాసమున విఘ్నములు కలుగుచుండును. అట్టి విఘ్నములు గూడ-మధ్యన ఆపకుండ చేయబఁడు అభ్యాసము వలనను గురువును ప్రార్థించుట వలన నంతరించును.
ఇయ్యది
“శివవిజ్ఞాన వీచిక, అనుశాంకరీయ ఆంధ్రానువాద
ప్రవచనమున (8) ఎనిమిదవ యధ్యాయము.
