లింగ మహా పురాణము

Table of Contents

48 - మేరు పర్వత వైశాల్యాది వర్ణనము

సూత ఉవాచ:

జంబూ ద్వీప మధ్యన మేరుమహాపర్వతము రత్నమయములగు శిఖరములతో ఎనుబది నాలుగు లక్షల యోజనముల ఎత్తు గలదై భూమిలో పదునారు (16) యోజనములు పాదుకొని యుండును. మూకుడు (శరావము)ను పోలినదై క్రిందపైన తొంబదియారు (96) యోజనముల ఔన్నత్యము కలిగియుండును. మరియు మహేశ్వరుని శుభమయమగు శరీరము తాకుటచే సువర్ణ మయంబున ధత్తూర (ఉమ్మెత్త) పుష్పముఁదగు కాంతి గలదై సమస్త దేవతానివాసయోగ్యంబునై అమరులు విహరించు
ప్రదేశములు గలదై లక్ష యోజనముల వెడల్పు గలదియునై యుండును. ఆదిశేషుఁడు దీనిని మోయుచుండును.

మేరుపర్వతము తూర్పున పద్మరాగ కాంతి, దక్షిణమున సువర్ణ ప్రకాశంబు, పడమటున నలుపు వన్నె ఉత్తరమున పగడపు వర్ణంబు గలది కాగా పలురకములగు మేడలు, నానావిధ దేవతా నివాసములు, మణిజాల స్థితియు, హేమరత్న విభూషిత గోపురములు, మార్గమున సువర్ణతోరణములు కలిగిన అమరావతియను పట్టణము విరాజిల్లుచుండును. అందు వినోద పరిహాసవచనములఁ బలుకునట్టి, సొమ్ములన్నిటిచే శోభించునట్టి, స్తనభారముచే వంగినట్టి, కామవికారముచే కన్నులు ద్రిప్పునట్టి, వేల కొలది అప్సరసలు (స్త్రీలు) నిండియుందురు. మరియు వికసించిన కమలములు, బంగారు మెట్లు, సువర్ణవర్ణము గల ఇసుకతిన్నెలు, సుగంధము గల కలువలును గల చెరువుల తోడను నడులతోడను నదముల తోడనుండు అమరావతీపురము వలన మేరు పర్వతము అలరారుచుండును.

మేరు పర్వతము యొక్క. ఆగ్నేయ దిశ యందు పావకుని పట్టణము తేజస్విని మును పేరు గలదై అమరావతితో సమానంబునై యుండును. మరియు దక్షిణ దిశయండుసున్లు మయ భవనములతో యముని పట్టణము వైవ స్వతి యను పేరుతో విలసిల్లు చుండును.

నైఋతి దిశయందు శుద్ధవతి యను పేరుతో నలుపు వన్నెగల పత్తనము నెలకొనియుండును. వాయవ్యమున గంధవతీ పురము; ఉత్తరమున మహోదయ పట్టణము, ఈశాన్యమున యశోవతీ పురంబు దిగంతములయందు విరాజిల్లు చుండునవి.

మేరు పర్వతాగ్రములపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించుచుందురు. సిద్ధులు యక్షులు గంధర్వులు మునులు భూతసంఘములు మేరు పర్యంత (మధ్యప్రదేశ) ముల యందు విహరించుచుందురు. మేరువు పైన సహస్ర ప్రదేశములు గలది, సహస్రయోజన విస్తీర్ణంబునగు విమానము (ఆకాశయానము గలది) నందు సూర్యచంద్రా గ్నిమయనేత్రత్రయము గల మహేశ్వరుఁడు పార్వతీ దేవితో కుమారస్వామి తోడను సింహాసనముపై నాసీనుడై యుండును. మరియు శ్రీహరి మేరు వామభాగమున పంచశతయోజనవిస్తీర్ణమగు విమానములో, బ్రహ్మదేవుఁడు దక్షిణ భాగమున పద్మరాగ మయంబగు విమానము నందు నివసించుచుందురు.

ఈ లోకములన్నిటియందు శివాలయములలో నిత్యము శివుడు పూజింప (బడుచుండును. సనక సనందన సనత్కుమారులు వీనిలో సంచరించుచుందురు. నందికేశ్వరుఁడు, గణపతి, షణ్ముఖుఁడు, ప్రమథ గణంబులు, బాలసూర్యప్రతీకాశములగు విమానములయందు ఆనందముతో విరాజిల్లుచుందురు. సనకసనందనాదులతో సమానులగు వేలకొలది మహాను భావులు - పై లోకముల పరిసరములలో నివసింతురు. పూర్వోక్తలోకములలో యోగభూమి, భోగభూమి నను రెండు ప్రదేశములుండును.

సుయశా దేవి - సప్త మాతృకలు - మన్మథుడును - నందికేశ్వరుని - విమానము చెంత నుందురు. జంబూనది మేరు మూలముచుట్టు ప్రవహించుచుండను. జంబూనది యొక్క దక్షిణ పార్శ్వమునందు మిక్కిలి ఎత్తు వైశాల్యంబు గల జంబూ వృక్షము ఎల్లకాలము ఫలముల నొసఁగునడై యుండును. మేరు పర్వతము నానుకొని ఇలావృతము అను వర్షము విలసిల్లును. అచ్చోట కొందరు జంబూఫలముల (నేరేడు పండ్ల)ను తినుచుందురు. మరికొందరు అమృత నిభంబగు జంబూఫలరసము డ్రాగుచుందురు. బంగారు వన్నె గలవారై నానాకాంతులతో శోభించుచు సుఖపడుచుందురు. ఈ జంబూద్వీపములన్నిటి నడుమ శుభమయమై యుండును. జంబూద్వీపము నందు గల నవ (9) వర్షములను వివరించెదనని సూతుడు విరమించెను.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక - అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (48) నలబది యెనిమిదవ అధ్యాయము