లింగ మహా పురాణము
28 - కర్మసహిత జ్ఞానముచే మోక్షప్రాప్తిని, మరియు తులాదానమును నిరూపించుట
సూతుఁడు చెప్పఁదొడఁగెను.
స్వాయంభువ మనువు - జయాభిషేకవిధానమును విని గంగాస్నాతుఁడై దేవదేవుఁడగు ఉమాపతికి నమస్కరించి - దివ్య నేత్రముతో శివుని సందర్శింపగా - నీకు రాజ్యాంతమున నా సాయుజ్యము లభించు” నని అనుగ్రహించి శివుడు - నంతర్ధానముఁజెందెను.
స్వాయంభువుఁడు - పరమేశ్వరుఁడు కనుమఱుగైన దిశకు అభిముఖుఁడై మరల నొకసారి నమస్కరించి - మహాదేవుఁడు, మహావృషభమును వలె - మేరుశిఖరము నధిరోహించి - యచ్చోట - బ్రహ్మమానసపుత్రుఁడగు సనత్కుమారుఁగాంచి ప్రణమిల్లగా నా మహానుభావుఁడు మనువుఁజూచి పులకాంకితుఁడై “సర్వదేవేశ్వరుని కనులార గాంచి జయాభిషేకవిధానము నాలకించి నేతెంచితిని గదా! ఏదే నడుగవలసి యున్నచో ప్రశ్నింపుము!” అని దయతో పలికెను.
అంత - మనువు సాంజలియై “కర్మచేతనే మోక్షమా? జ్ఞానము వలననే కైవల్యమా? అని ప్రశ్నింపగా - “కర్మసహిత జ్ఞానముచే జన్మరాహిత్యమొదవు“ నని సనత్కుమారుడు ప్రవచించెను.
మరియు పూర్వము నేను నంది నవమానించుటచే ఒంటెనైతిని. మరల నాతని
యనుగ్రహమువలన శాపవిముక్తుఁడనై శివు నారాధించినందున చిత్తశుద్ధిఁబడసియు
శివోపాసనాక్రమమును విని - దివ్యరూపము గలవాడైతిని. శివారాధనాదులతోడనే “శివోఽహం“ అను అద్వైతో పాసనము సిద్ధించునని గుర్తించితిని.
ఇంక రాజులు చేయఁదగిన షోడశమహాదానములఁ గూర్చి నందికేశ్వరుఁడు సనత్కుమారునకు చెప్పఁదొడఁగెను.
సూర్యచంద్ర గ్రహణములు మొదలగు పర్వకాలములయందు చేయుఁదగినట్టి
తులాపురుషదానాదులకై సలక్షణమైన మండపము యొక్క మధ్యన - వేదిక (గద్దె)ను నిర్మింపఁజేసి బిల్వ అశ్వత్థ పలాశములలో నేదే నొక వృక్షము యొక్క కఱ్ఱతో తులాభారస్తంభమును చేయించి వేదిక దగ్గర నెలకొలుపవలెను. వేదికపై ముగ్గువేసి ముగ్గుపై నూతన వస్త్రమును వఱచి - వస్త్రముపై బియ్యము పోసియు బియ్యముపై మధ్యన - రుద్రకలశమును; కుడివైపున బ్రహ్మకలశమును; ఎడమ దిక్కున విష్ణుకలశమును స్థాపించి - కలశములలో శుద్ధోకమును నింపి పైన టెంకాయలు అమర్చియు
రెండేసి నూతనవస్త్రములను కలశములకు పరివేష్టించి కలశముల ముందు సూర్య చంద్రాంగారక బుధ గురుశుక్ర శనైశ్చర రాహుకేతువులను పూజించి - ఆయా మంత్రములతో హవనము నొనర్చియు.
శివభక్తాగ్రేసరులైన బ్రాహ్మణులకు భోజనంబు నిడిహోమము జరుగుచుండగా తూర్పు నందు రాజును పీఠముపై పశ్చిమాభి ముఖముగా కూర్చుండఁజేయపలెను.
అప్పుడు - రాజు - అలంకారములను ఖడ్గాద్యాయుధములను ధరించి యుండగా - బ్రాహ్మణులు - స్వస్తి పుణ్యాహవాచనమును చేయవలెను. మంగళ వాద్యములు మ్రోగుచుండ వలెను.
ఆ పిదప త్రాసులో నొకపాత్రయందు సువర్ణమును లేక వెండిని లేక రూపాయి బిళ్లల నుంచవలెను. త్రాసుపళ్ళెరములు గుండ్రనివిగా, సమానతూకము గలవిగా నుండవలెను.
అట్టి త్రాసులో రాజును రెండవ పాత్రయండు అసీనుఁగాపించి తూచవలెను. త్రాసులోని వస్త్రయుగ్మము అను వానిని పాశుపత వ్రతస్థుఁడైన శ్రౌతశైవ బ్రాహ్మణునకు మహాదక్షిణతో సహ సమర్పించి శివభక్తులందరికిని సువర్ణ పుష్పదక్షిణల నీయవలెను. యాగద్రవ్యము నంతయు ఆచార్యున కొసంగవలెను.
ఆ సమయమున రాజు - కారాగారమందున్నవారిని విడిపించవలెను. హస్రకలశోదకముతో కేవలఘ్నతముతోడను పాలతో పెరుగుతో పంచగవ్యముల తోడను శివలింగమును బ్రాహ్మణులు రుద్రాధ్యాయాదులను పఠించుచుండగా - సహస్రకలశములను వేదికపై - విష్ణు ప్రోక్తములు లేక తండిప్రోక్తములు నగు శివ సహస్రనామములలో నొక్కొక నామముతో నొక్కొకకలశముగా స్థాపించ వలసియుండును.
తదుపరి పరమేశ్వరునకు మహాపూజసమునొనర్చి - శివార్చకునకు తన గురువునకు దక్షిణను సమర్పించి తులాభారమునందలి సువార్ణాదికమును దీనులకు అంధులకు దరిద్రులకును పంచిపెట్టి వారికిని భోజనము నిడియు తాను తన కుటుంబముతో ఆప్తబంధువుల తోడను సంతోషస్వాంతుడై భుజింపవలెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (28)వ యధ్యాయము.
