లింగ మహా పురాణము

Table of Contents

58 - శివాజ్ఞ ననుసరించి బ్రహ్మదేవుడు ఆయా పదవులపై - సూర్యాదులను నియమించుట

“దేవదానవాదుల నేయే పదవులపై విధాత నియమించెనో విశదీకరింపుము!” అనిశౌనకాదులు ప్రశ్నింపగా - సూతుఁడు చెప్పఁ దొడఁగెను.

సూర్యుడు గ్రహాధిపతిగాను; చంద్రుడు నక్షత్రములకు ఓషధులకు అధిపతిగాను;
వరుణదేవుడు ఉదకాధిపతిగాను, కుబేరుడు ధనాధిపతి గాను; విష్ణువు ఆదిత్యాధిపతిగాను; పావకుడు వసువులకు అధిపతిగాను; బ్రహ్మదేవుడు నియమించెను.

మరియు దక్షుడు ప్రజాపతుల యేలిక కాగా అమరాధిపతి ఇంద్రుడు ఆయెను. దైత్యదానవ ప్రభువు ప్రహ్లాదుడు; పితృదేవతాధిపతి - ధర్ముడు; మాంసాశనాధి పతి నిఋతి; చతుష్పాత్ పశువులను నియమించువాడు ఈశానుడు; వృషభముల యేలిక నందికేశ్వరుడు; వీరాధికారి వీరభద్రస్వామి; పిశాచాధిపతి భయంకరుడు; మాతృకాధికారిణి చాముండాదేవి; ఏకాదశరుద్రనియంత నీలలోహితరుద్రుడు; విఘ్నాధిపతి - గణేశుడు; దేవ మానవాంగనాధికారిణి ఉమాదేవి, వాజ్నయంత్రిణి- సరస్వతీదేవి మాయాధిపతి నారాయణుడు; పర్వతాధిపతి హిమవంతుడు; నద్యధికారిణి గంగానది; సమస్త సముద్రాధిపతి అర్ణవుడు;

వృక్షాధికారము గలవి అశ్వత్థ (రావి) వట (మఱ్ఱి) వృక్షములు; గంధర్వ విద్యాధర కిన్నరేశ్వరుడు చిత్రరథుడు; నాగజాలిసర్వాధికారి వాసుకి; సాధారణసర్పాధిపతి తక్షకుడు; దిగ్గజేశ్వరుడు ఐరావతము; పక్షుల నియంత - గరుత్మంతుడు; అశ్వాధిపతి ఉచ్చైః శ్రవసము; మృగాధిపతి సింహము; సింహాధిపతి శరభము; సేనాధిపతినియంత కార్తికేయుడు, శ్రుతిస్మృతీశ్వరుడు లకులీశుడు ఆనుశివావతారము; పూర్వ దిశాధిపతి సుధర్ముడు, దక్షిణ దిశాధికారి శంఖపదుడు; పశ్చిమ దిగధికారి కేతుమంతుడు; ఉత్తర దిశేశ్వరుడు హేమరోముడు, పృథివీపతి పృథువు; చరాచర ప్రాణ్యధికారి మహేశ్వరుడుగా చతుర్ముఖునిచే నిర్దేశింపబడిరి.

ఇంక బ్రహ్మ విష్ణురుద్రమహేశ్వరులను నియమించు శాసనము గల వాడవు కమ్మని సర్వజ్ఞుడైన సదాశివుని పంకజాసనుడు ప్రార్థించెను.

శివానుగ్రహము వలన బ్రహ్మదేవుడు విశిష్టులైనవారి నా యా పదవులపై పూర్వోక్తరీతిని నియమింపగలిగెనని యిలు వ్యక్తమైనది.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (58) ఏబది యొనమిదవ అధ్యాయము.