16 - కేశివధ

శ్రీపరాశరుడు:

కేశీచాపిబలోదగ్రః కంస దూతప్రచోదితః।

కృష్ణస్యనిధనాకాంక్షీ బృన్దావనముపాగమత్॥

సఖురక్షత భూపృష్ఠస్సటాక్షేపధుతామ్బుధః।

ద్రుతవిక్రాన్త చన్ద్రార్కమార్గో గోపానుపాద్రవత్॥

తస్యహేషిత శబ్దేన గోపాలాదైత్యావాజినః।

గోప్యశ్చభయసం విగ్నా గోవిన్దం శరణం యయుః॥

త్రాహిత్రాహీతి గోవిన్దః శ్రుత్వాతేషాం తతోవచః।

సతోయజలదధ్వానగమ్భీరమిదముక్తవాన్॥

అలంత్రాసేనగోపాలాః కేశినః కింభయాతురైః।

భవద్భిర్గోపజాతీయైః వీరవీర్యం విలోప్యతే॥

కిమనేనాల్పసారేణ హేశితాటోపకారిణా।

దై తేయబలవాహ్యేన వల్గతా దుష్టవాజినా॥

ఏహ్యేహిదుష్ట! కృష్ణోహం పూష్ణ స్త్వివపునాకధృత్।

పాతయిష్యామిదశనాన్ వదనాదఖిలాం స్తవ॥

ఇత్యుక్త్వాస్ఫోట్యగొవిన్ధః కేశినస్సం ముఖం యయౌ।

వివృతాస్యశ్చసోఽప్యేనం దై తేయాశ్వ ఉపాద్రవాత్॥

బాహుమాభోగినం కృత్వా ముఖేతస్య జనార్దనః।

ప్రవేశయామాసతదా కేశినోదుష్టవాజినః॥

కేశినోవదనంతేన విశతాకృష్ణబాహునా।

శాతితాదశనాః పేతుస్సితాభ్రావయవా ఇవ॥

కృష్ణస్యవవృధేబాహుః కేశిదేహగతోద్విజ।

వినాశాయయథావ్యాదిరాసం భూతేరుపేక్షితః॥

విపాటితోష్ఠోబహుళం స ఫేనంరుధిరం వమన్।

సోఽక్షిణీవివృతేచక్రే విశిష్టేముక్తబన్ధనే॥

జఘానధరణీం పాదైశ్శకృన్మూత్రం సముత్సృజన్।

స్వేదార్ ద్రగాత్రశ్శాన్తశ్చ నిర్యత్నస్సోఽభవత్తదా॥

వ్యాదితాస్యోమహారౌద్రాస్సోఽసురః కృష్ణబాహునా।

నిపపాతద్విధాభూతో వైద్యుతెనయథాద్రుమః॥

ద్విపాదేపృష్ఠపుచ్చార్దేశ్రవణై కాక్షినాసికే।

కేశిన స్తేద్విధాభూతే శకలేద్వేవిరేజతుః॥

శ్రీపరాశరుడు:

కేశియను రాక్షసుడు ఉదగ్రబలుడు అశ్వరూపుడు కంసుని దూత ప్రేరేప కృష్ణుని జంప గోరి బృందావనమున కేతెంచెను. భూతలమును గిట్ట లందాడించుచు జూలు విదలింపున మబ్బుల నదలించుచు ఒక్క దాటున జంద్ర సూర్య మార్గ మాక్రమించి గోపకుల పైకి దూకేను. దాని సకిలింపు విని గోపీ గోపక బృందము బెదరి గోవిందుని శరణోందెను. త్రాహి త్రాహి రక్షింపుమను వారి యార్తరవము విని గోవిందుండు సజల జలద గర్జా గంభీరముగ జడియ వలదు. గోపజాతిం బుట్టిన మీరడవి తల్లడిల్లుటచే వీర వీర్యమునకు లోపము. వట్టి సకిలింపుల నాటోపము సూపుచునీ గంతులు వేయు నీ దుష్టుడత్యల్ప సారునిచే తుచ్చునిచే నేమయ్యె. రారా! ఓరి దుష్టుడ! నేను కృష్ణుడను. పినాకపాణి (రుద్రుడు) పూషుని యొక్క వలె నీ నోతగల యాన్ని పండ్లను రాల గొట్టెదను. అని నొవ్వనాడి హరి కేశి కెదురు నడచెను. వాడును నోర్దెఱచి యీతనిపైకి దూకేను. జనార్దనుండు తన విశాల బాహువును దాని నోటంబెట్టి లోనికిం దూర్చెను. దాన వాని పండ్లూడి తెల్లని మబ్బు తునుకలట్ల లేదా అభ్రకపుం బలుకట్లు వానిపై రాలిపోయినవి. కేశి దేహమందు ప్రవేశించిన కృష్ణబాహువు రోగము అంకురించి నప్పటి నుండి యుపేక్షితమై ముంచుకొని వచ్చినట్లు పెరిగి నంతట పెదవులు పగిలి నురుగులతో వాడు రక్తముం గ్రక్కుకుని కనుల యిరవుదప్పి కనుగ్రుడ్లు విప్పార మూత్ర పూరీషముల విడిచి పాదములచే నేలం గొట్టెను. ముచ్చెమటలు పోసి యలసి వడిదరిగి పూనికసెడి విడబార మహారౌద్రుడగు నయ్యసుర పిడుగడచిన ట్లట్టిరు తునకలై కూలెను. రెండు పాదములు పృష్ఠము తోకయు ఒక్కచెవి యొక కన్ను యొక ముక్కుగనై యా కేశి రక్కసుని శకలములు రెండై భాసించెను.

హత్వాతుకేశినం కృష్ణోగోపాలై ర్ముదితైర్ వృతః।

అనాయ స్తతనుస్స్వస్థోహసం స్తత్రైవాతస్థివాన్॥

తతోగోప్యాశ్చగోపాశ్చహతేకేశిని విస్మితాః।

తుష్టువుః పుణ్డరీకాక్షమనురాగమనోరమమ్॥

అథాహా న్తర్ హితోవిప్రనారదోజలదేస్థితః।

కేశినం నిహతం దృష్ట్వాహర్షనిర్భారమానసః॥

సాధుసాధుజగన్నాథ! లీలయైవయదచ్యుత!।

నిహతోఽయం త్వయాకేశీక్లేశదస్త్రిదివౌకసామ్॥

యుద్దోత్సుకోహమత్యర్థం నరవాజిమహాహవమ్।

అభూతపూర్వమన్యత్రద్రష్టుం స్వర్గాదిహాగతః॥

కర్మాణ్యత్రావతారేతేకృతాని మధుసూదన।

యానితైర్విస్మితం చేతస్తోషమేతేనమేగతమ్॥

తురఙ్గస్యాస్యశాక్రోఽపి కృష్ణ! దేవాశ్చబిభ్యతి।

ధూతకేసరజాలస్య హేషతోఽభ్రావలోకినః॥

యస్మాత్త్వయైషదుష్టాత్మా హతః కేశీజనార్దన!।

తస్మాత్కే శవానామ్నాత్వం లోకేఖ్యాతోభవిష్యసి॥

స్వస్త్యస్తుతేగమిష్యామి కంసయుద్దేదునాపునః।

పరశ్వోహం సమేష్యామిత్వయాకేశినిశూదన॥

ఉగ్రసేనసుతేకంసే సానుగేవినిపాతితే ।

భారావతారకర్తత్వం పృథివ్యాః పృథివీధర॥

తత్రానేకప్రకారాణియుద్దానిపృథివీక్షితామ్॥

ద్రష్టవ్యానిమయాయుష్మత్ప్రణీతాని జనార్ధన॥

సోఽహం యాస్యామిగోవిన్ధ! దేవకార్యం మహత్కృతమ్।

త్వయైవవిదితం సర్వంస్వస్తితేఽస్తు వ్రజామయఃమ్॥

నారదేతుగతేకృష్ణస్సహగోపైస్సహగోపైస్సభాజితః।

వివేశగోకులం గోపీనేత్రపానైకభాజనమ్॥

కేశిని జంపి హరి సంబరపడు సంగడీండ్రతో హాయిగ నొడలించుక యేని నొవ్వక స్వస్థుడై యక్కడనే యుండెను. అవ్వల గోపికలు గోపకులును కేశి మడియుట కక్క జంపడుచు అనురాగ మనోరమమ్ముగ పుండరీక నయననుం బొగడిరి. అటుపై నారద భగవానుడు మబ్బుల చాటున నుండి ఆనంద నిర్భర చిత్తుడై బాగుబాగు జగన్నాథ! లీలా మాత్రమున నీ రక్కసుదమరుల నెంతేని యిడుమలం గుడిపించి కట్టిడి వీడు నీచే నీల్గె. నేను మిగుల కలహోత్సుకుడను. నరహరుల కైన నిప్పోర భూత పూర్వముం జూడ స్వర్గము నుండి యిటు వచ్చితిని. ఈ అవతార మందు నీ సేయు లీలలం గని నా మనసాశ్చర్య మందె. దాననే నెంతేని సంతోష పడితిని. ఈ గుఱ్ఱమునకు శక్రుండును దేవతలునుం జడిసి పోదురు. ఇది సకలించినను జూలు విదలించినను నింగి వంక జూచినను వేల్పులకు గుండె దిగులగు చుండును. కేశియను పేరి వాని వీనిందునుముటచే నీవు లోకమందు కేశవుడను పేరం ప్రఖ్యాతి నందెదవు. నీకు మంగళ మగుగాక! వెళ్ళుచున్నాను. కంసునితోడి పోరున నెల్లుండి మఱల నిన్ను గలిసి కొందును. ఉగ్రసేను తనయుడు కంసుడు పరివారముతో గూల్పబడిన తరువాత నీవు పృథివీ భారముం దింప గలవు. అందనేక తీరుల రాజుల కగు యుద్దములను నీకావించిన వానిని నేను జూడ వలయును. అట్టి నేనిపుడు వెళ్ళుచున్నాను. నీచే గొప్ప దేవకార్యము చక్క పఱుప బడినది. అదంతయు నీకే విదితము. నీకు శుభమగు గాక! ఇదిగో నేనేగు చున్నాను. అని నారదుడేగి నంతట కృష్ణుడు గోపకులను ఆలింగనాదులచే గారవింప బడి గోపికల కన్నుల కమృతపాన స్థానమై కృష్ణుడు గోకులముం జొచ్చెను. లేదా కృష్ణావతారముచే గోపికల కన్నుల కమృతపాన స్థానమైనది గోకుల మనియు నన వచ్చును.