8 - విష్ణ్వారాధన ఫలప్రశంసా చతుర్వర్ణాశ్రమ ధర్మ నిరూపణమ్

మైత్రేయుడు:

భగవన్ భగవాన్ దేవస్సంసారవిజిగీషుభిః।

సమాఖ్యాహి జగన్నాథో విష్ణు రారాధ్యతేయథా॥

ఆరధితాచ్చగోవిన్దాదారాధనపరిర్నరైః।

యత్ప్రాప్యతేఫలంశ్రోతుంత చ్చేచ్చామిమహామునే॥

మైత్రేయుడు:

భగవానుడవగు ఓ పరాశర మహామునీ! సంసారమును తరింప గోరువారు భగవానుడును ప్రకాశ మనస్వరూపుడును లోకనాధుడు నగు శ్రీమహా విష్ణుని ఆరాధించ వలసిన ప్రకారమును గోవింద ఆరాధనపరులగు నరులకు లభించు ఫలమును వినగోరు చున్నాను.

శ్రీపరాశరుడు:

యత్పృచ్ఛతిభావనేతత్సగరేణమహాత్మనా।

ఔర్వఃప్రాహయథాపృష్టస్తన్మేణిగదతశ్శృణు॥

సగరఃప్రణిపత్యేదమౌర్వంప ప్రచ్చభార్గవమ్।

విష్ణోరారాధనోపాయసంబన్ధం మునిసత్తమ॥

ఫలంచారాధితేవిష్ణౌ యథ్పుంసామాభిజాయతే।

సచాహపృష్టో యత్తేనతన్మైత్రేయాఖిలంశృణు॥

శ్రీపరాశరుడు:

నీవు నన్ను అడిగిన ప్రశ్నమునే మహాత్ముడగు సగరుడు అడుగగా ఔర్య మహాముని చెప్పిన విషయమును నేను నీకు చెప్పెదను. వినుమా, ఓ ముని శ్రేష్టుడవగు మైత్రేయా! భృగు వంశజుడగు ఔర్య మహామునికి సగరుడు నమస్కరించి విష్ణు నారాధించు విధానమునకు సంబంధించియును ఆ ఆరాధనము వలన నరులకు కలుగు ఫలమును గురించియు ప్రశ్నించెను. దానికి సమాధానమును ఔర్యుడు సగరునకు చెప్పిన దానినే నీకు యంతయు చెప్పెదను. వినుము.

ఔర్యుడు:

భౌమం మనోరథం స్వర్గం స్వర్గీవంద్యంచయథ్పదమ్।

ప్రాప్నోత్యారాధితేవిష్ణౌ నిర్వాణమాపిచోత్తమమ్॥

యద్యదిచ్చతియావచ్చాఫలమారాధితేఽచ్యుతే।

తత్తదాప్నోతిరాజేన్ద్రభూరి స్వల్పమథాపివా॥

ఔర్యుడు:

విష్ణు నారాదించుట వలన భూలోకమున పొంద దగిన కోరికలను స్వరమును స్వర్గ వాసులకును నమకసరింప దగిన ఉత్తమ పదమును అన్నిటి కంటె ఉత్తమ మగు మోక్ష ఫలమును కూడ మానవులు పొందుదురు. అచ్యుతుని ఆరాధించు వారే యే ఫలమును నెంతెంత కోరుడురో అది అంతయు అధికమైనదే కాని అల్పమైనదే కాని పొందుదురు.

యత్తుపృచ్చసిభూపాల కథమారాధ్యతేహిసః।

తదిదంశకలంతుభ్యం కతయామినిభోధమే॥

వర్ణాశ్రమాచారవతా పురుషేణపరఃపుమాన్।

విష్ణురారాధ్యతే పన్థా నాన్త్యస్తత్తోషకారకః॥

యజన్ యజ్ఞాన్ యజత్యేనం జపత్యేనంజన్నృప॥

ఘ్నంస్తథాఽన్యాన్హినస్త్యేనం సర్వభూతోయ తోహరిః।

తస్మాత్సదాచారవతా పురుషేణజనార్దనః।

ఆరాధ్యతేస్వవర్ణోక్తధర్మానుష్టానకారిణా॥

బ్రాహ్మణఃక్షత్రియోవైశ్యశ్శూద్రశ్చపృథివీపతే।

స్వధర్మతత్పరోవిష్ణు మారాధయతినాన్యథా।

పరాపవాదంపైశున్యమనృతంచనభాషతే।

అన్యోద్వేగకరంయచ్చ తోష్యతే తేనకేశవః॥

పరదారపరద్రవ్యపరహింసాసుయోరతిమ్।

నకరోతిపుమాన్ భూప! తోష్యేతే తేనకేశవః॥

నతాడయతినోహన్తిప్రాణినోవాసదీహతే।

యోమనుశ్యోమనుష్యేన్ద్ర తోష్యతే తేనకేశవః॥

దేవద్విజగురూణాంయశ్శుశ్శ్రూషాసుసదోద్యతః।

తోష్యతేతేనగోవిన్దః పురుషేణనరేశ్వర॥

యథాత్మస్వకపుత్రేషుసర్వభూతేషుయస్తథా।

హితకామోహరి స్తేనార్వదాతోష్యతేసుఖమ్॥

యస్యరాగాదిదోషేణ నదుష్టంనృపమానసమ్।

విశుద్ధచేతసావిష్ణుస్తోష్యతేతేనసర్వదా॥

వర్ణాశ్రమేషుయేధర్మాశ్శాస్త్రోక్తానృపసత్తమ।

తేషుతిష్ఠన్నరో విష్ణుమారాధయతి నాన్యథా॥

ఓ సగర మహారాజా! ఆ విష్ణుని ఎట్లు ఆరాధింప వలెను? అని నీవు అడిగిన ప్రశ్నమునకు సమాధాన మంతయు చెప్పెదను. నా వలన అది తెలియుము. పరమ పురుషుడగు శ్రీమహా విష్ణువును మానవుడు తన వర్ణాశ్రమాచారము లను పాటించుచునే ఆరాధింప వలయును. వానిని విడిచి ఆరాధించుట అతనికి ప్రీతీ కలిగించదు. ఓ రాజా! యజ్ఞములలో దేవతలను ఆరాధించుటచే విష్ణువును ఆరాధించు వాడగును. చిత్తశుద్దికై మంత్ర జపములను చేయుటచే విష్ణుని జపించు వాడగును. ఇతర ప్రాణులను హింసించుటచే విష్ణుని హింసించినా వాడగును. హరి సర్వ భూతాత్ముడగుటయే యిందులకు హేతువు. అందువలన పురుషుడు సదాచారము కలిగి తన తన వర్ణమునకు విహిత మయిన కర్మములను ఆచరించుచు విష్ణుని ఆరాధించ వలెను. బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని ఓ రాజా! తన వర్ణ ధర్మము నందు శ్రద్ధ కలిగి దానిని ఆచరించుచునే విష్ణుని ఆరాధింప వలెను కాని మరొక విధముగా కాదు. పరనింద, కొండెములు చెప్పుట, అసత్యము, ఇతరుల మనస్సునకు నొప్పి కలిగించు మాటలు, పరస్త్రీల యందు, పరధనము నందు ప్రాణి హింసల యందు ఆసక్తి లేక ఇతర ప్రాణులను కొట్టక చంపక ఇతరులకు కీడు కోరక ఉండువారు చేయు ఆరధనచే కేశవుడు తృప్తి నొందును. దేవతలను, విప్రులను, గురువులను సేవించుట కెప్పుడు పూనిక కలిగి తనకు తన కుమారులకు వలెనె సర్వ భూతములకు హితము కోరుచు రాగము ద్వేషము మొదలగు దోషములచే మనస్సు అపవిత్రము కాని మనస్సు కలిగి వర్ణాశ్రమ అనుసారముగ శాస్త్రములచే విధింప బడిన ధర్మములను అనుష్టించు మానవులు చేయు ఆరాధనలకు శ్రీమహావిష్ణువు సంతృప్తి నొందును.

సగరుడు:

తదహంశ్రోతుమిచ్చామివర్ణధర్మనషేషతః।

తథైవాశ్రమధర్మాంశ్చద్విజవార్య బ్రవీహి తాన్॥

సగరుడు:

ఓ మునిశ్రేష్టుడా! అట్లయినచో నేను విష్ణుని ఆరాధనా చేయు వారికి ఆవశ్యముగా జెందదగినవి కావున వర్ణాశ్రమ ధర్మములను గూర్చి నేను వినగోరు చున్నాను. దెల్పుము.

ఔర్వుడు:

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాంచయథాక్రమమ్।

త్వమేకాగ్రమతిర్ భూత్వా శృణుధర్మాన్ మయోదితాన్॥

దానందద్యాద్యజేద్దేవాన్ యజ్ఞైస్స్వాధ్యాయతత్పరః।

నిత్యోదకీభవేద్విప్రః కుర్యాచ్చాగ్నిపరిగ్రహమ్॥

వృత్త్యర్ థంయాజయేచ్చాన్యానన్యానధ్యాపయేత్తథా।

కుర్యాత్ప్రతిగ్రహాదానం శుక్లార్థాన్న్యాయతోద్విజః॥

సర్వభూతహితంకుర్యాన్నాహితంకస్యచిద్ద్విజః।

మైత్రీసమస్తభూతేషుబ్రాహ్మణ స్యోత్తమంధనమ్॥

గ్రావ్ణిరాత్నేచపారక్యేసమబుద్దిర్భవేద్ద్విజః।

ఋతావాభిగమఃపత్న్యాంశస్యతేచాస్యపార్థివః॥

దానానిదద్యాదిచ్చాతోద్వి జేభ్యఃక్షత్రియోపిహ।

యజేతవివిధైః యజ్ఞేరాధీయేతచపార్థివః॥

శస్త్రాజీవోమహీరక్షా ప్రవరాతస్యజీవికా।

తత్రాపిప్రథమేకల్పే పృథివీపరిపాలనమ్॥

ధరిత్రీపాలనేనైవ క్రుతక్రుత్యానరాధిపాః।

భవన్తినృపతేరంశా యతో యజ్ఞాదికర్మణామ్॥

దుష్టానాంశాసనాద్రాజా శిష్టానాంపరిపానాత్।

ప్రాప్నోత్యభిమతాన్ లోకాన్ వర్ణసంస్థాకరోతి యః॥

పాశుపాల్యంచవాణిజ్యంకృషించమనుజేశ్వర।

వైశ్యాయ జీవికాంబ్రహ్మాద దౌలోకపితామహః॥

తస్యాప్యధ్యయనంయజ్ఞోదానాంధర్మశ్చశస్యతే।

నిత్యనైమిత్తికాదీనామానుష్టానంచకర్మణామ్॥

ద్విజాతిసంశ్రయం కర్మతాదర్థ్యం తేనపోషణమ్।

క్రయవిక్రయజైర్వాపిధనైః కారూద్భవేనవా॥

దానంచదాద్యాచ్చూద్రోపిపాకయజ్ఞైర్యజేతచ।

పిత్రాదికంచవై సర్వంశూద్రఃకుర్వీత తేనవై॥

ఔర్వుడు:

ఓ రాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారు ఆచరించ వలసిన ధర్మములను చెప్పెదను. ఏకాగ్ర బుద్దితో వినుము. బ్రాహ్మణులు దానము యగ్నములచే దేవతలను ఆరాధించ వలెను. వేదాధ్యయనము జీవన యాత్రకై యితరులచే యజ్ఞము చేయించుట వేదములను అధ్యయనము చేయుట ఇతరుల నుండి పవిత్ర ద్రవ్యములను శాస్త్ర న్యాయానుసారముగా ప్రతి గ్రహించట చేయ వలయును. త్రికాల స్నానము చేసి అగ్ని హోత్రియై యుండ వలెను. సర్వ ప్రాణులకును హితమునే కాని వేనికి ఆహితము చేయరాదు. సమస్త భూతముల యందు మైత్రీభావము విప్రులకు ముఖ్యధానము. రాతి యందును రత్నమందును పరాధానము లందును సమబుద్దితో నుండవలెను. ఋతు కాలమున మాత్రమే భార్యతో సంగమింప వలెను. క్షత్రియులు సంకల్ప పూర్వకముగా బ్రాహ్మణులకు దానము, యజ్ఞములచే దేవతారాధానము వేదా ధ్యయనము చేయ వలెను. ఆయుధ విద్యచే జీవనము, ప్రజల రక్షించుట, రాజ్య పాలనము నాతనికి శ్రేష్టమగు జీవన విధానము. యజ్ఞాది కర్మ ఫలముల అంశము రాజునకు చెందును. కాన క్షత్రియులు రాజ్య పాలనము చేసిననే కృతార్థు లగుదురు. దుష్టుల దండించి శిష్టుల రక్షించి వర్ణ ధర్మ వ్యవస్థను లోకమున నిలుపు రాజు తాను కోరుకొనిన ఉత్తమ లోకముల పొంద గలుగును. ఓ రాజా! లోక పితా మహుడగు బ్రహ్మ వైశ్యులకు పశు పాలనము, వాణిజ్యము కృషి జీవన వృత్తిగా విధించెను. అతడును అధ్యయనము, యజ్ఞము, దానము, నిత్య నైమిత్తికము లగు కర్మములు ఆచరించ వలయును. శూద్రులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల నాశ్రయించి వారి వలన పోషణము జరుపు కొనుట. లేదా వర్తకముచే కాని వడ్రంగము మొదలగు శిల్ప వృత్తులచే కాని జీవించుట విధింప బదియున్నది. దానము చేయుట, పాక యజ్ఞ విధానము దేవతలను ఆరాధించుట పిత్రుకర్మలు మొదలైన నైమిత్తికములు నాచారించుట శూద్రులకు విహితము.

భృత్యాదిభరణార్థాయసర్వేషాంచపరిగ్రహః।

ఋతుకాలభిగమనంస్వదారేషు మహీపతే॥

దయాసమస్తభూతేషు తితిక్షా నాతిమానితా।

సత్యంశౌచమానాయాసో మఙ్గళంప్రియవాదితా॥

మైత్త్ర్యస్పృహాతథాతద్వాదకార్పణంనరేశ్వర।

అనసూయచసామాన్యా వర్ణానాంకథితాగుణాః॥

ఆశ్రమాణాంచ సర్వేషామేతేసామాన్యలక్షణాః।

గుణంస్తథాఽపిధర్ మాంశ్చశౌద్రకర్మనచైతయోః॥

సామర్ థ్యేసతితత్త్వాజ్యముభాభ్యామపిపార్థివ।

తదేవాపదిక్తవ్యంనకుర్యాత్కర్మసంకరమ్॥

ఓ సగర మహారాజా భృత్యులు మొదలగు వారి పోషించుటకై ఇతరుల నుండి దానము ప్రతిగ్రహించుట స్వభార్యను ఋతు కాలమున కలియుట సమస్త భూతములపై దయ, ఓర్పు, అహంకారము లేకుండుట, సత్యము, శుచిత్వము ఎక్కువ శ్రమ చేయకుండుట, శుభ మాచరించుట, ఇతరులకు ప్రీతిగా మాటలాడుట, మిత్రభావము, కోరికలు తగ్గి యుండుట, దైన్యము లేకుండుట, అసూయ లేకుండుట సర్వ వర్ణములకు అన్ని ఆశ్రమములకు సాధారణ ధర్మములు. బ్రాహ్మణాది వర్ణముల వారికి ఆపత్కాలమున తగిన గుణములను ధర్మములను చెప్పెదను వినుము ఆపత్కాలమున అనగా ధర్మముచే జీవనము జరుగానిచో బ్రాహ్మణుడు క్షత్రియుల వైశ్యుల వృత్తుల నవలంభించ వచ్చును. అట్లే క్షత్రియుడు వైశ్య వృత్తిని వైశ్య వృత్తిని గ్రహింప వచ్చును. కాని వీరు ఉభయులు కూడ శూద్ర వృత్తి నవలంబింప రాదు. సామర్థ్యమున్నంత వరకు ఉచిత ధర్మము నవలంబింప వలెనే కాని కర్మ సంకరము ఒకరికి విహిత కర్మముల నింకొక డాచరించుట తగదు.

ఇత్యేదేకథితారాజన్ వర్నధర్మామయాతవ।

ధర్మానాశ్రామిణాంసంయగ్నృవతో మే నిశామయ॥

ఓ సగర మహారాజా! నీకు నేను ఇట్లు వర్ణ ధర్మముల చెప్పితిని. ఇక ఆశ్రమ ధర్మములను చెప్పెదను వినుము.