7 - సృష్టిక్రమ వర్ణనము

శ్రీపరాశరుడు:

తతోఽభిధ్యాయ తస్తస్యజజ్ఞిరే మానసాః ప్రజాః।

తచ్చరీరసముత్పన్నైః కార్యైస్తత్కరణైస్సహ॥

క్షేత్రజ్ఞాస్సమవర్తన్తగాత్రేభ్యస్తస్యధీమతః।

తేసర్వేసమవర్తంతయేమయా ప్రాగుదీరితాః॥

దేవద్యాస్స్థావరాన్తాశ్చత్రైగుణ్యవిషయేస్థితాః।

ఏవం భూతానిసృష్టాని చరాణిస్తావరాణిచ॥

యదాస్యతాః ప్రజాస్సర్వా నవ్యవర్ధన్త ధీమతః।

తదాఽన్యాన్ మానసాన్ పుత్రాన్ సదృశానాత్మనోఽసృజత్॥

భృగుంపుల న్తంపులహంక్రతుమఞ్జిరసంతథా।

మరీచిందక్షమత్రించ వసిష్ఠం చైవ మానసాన్॥

నవ బ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః॥

ఖ్యాతింభూతించసం భూతింక్షమాం ప్రీతింతథై వచ।

సన్నతించ తథైవోర్జామనసూయాంతథై వచ॥

ప్రసూతించతథాసృష్ట్వా దదౌతేషాం మహాత్మానామ్।

పత్న్యోభవధ్వమిత్యుక్త్వా తేషామేవతుదత్తవాన్॥

సనన్దానాదయోయేచ పూర్వసృష్టాస్తువేదసా।

నతేలోకేష్వసజ్జన్త నిరపేక్షాః విధౌప్రజా॥

సర్వేతేఽభ్యాగతజ్ఞానావీతరాగావిమత్సరాః।

తేష్వేవంనిరపేక్షేషు లోకసృష్టౌ మహాత్మనః॥

అటుపై నతడు ద్యానింప మనస్సు నుండి సంతతి గల్గెను. ఆ కలిగిన మానసిక సృష్టి జీవులు పుట్టుక లోనే కార్యములు (పదార్థములు) కరణములు(సాధనములు) అను వానితో గూడికొని పుట్టిరి. అనగా చక్షురా దీంద్రియములు ఆ యింద్రియములకు విషయము లైన శబ్దాదులు వానికి కారణము లైన ఆకాశాది పంచ భూతములును ఒకేసారి జనించె నన్నమాట. ఆ బ్రహ్మ యొక్క యంగము లందుండి క్షేత్రజ్ఞులు అనగా జీవులు పుట్టిరి. సత్త్వాది గుణములు మూడింటి వలన నేర్పడిన యా జీవుల నింతమున్నే చెప్పి యున్నాను. అవి స్థావరములు జంగములును. ఆయన యొక్క మానస సంతానము వృద్ధి నందని కతను సంతానముం గననందున వారి వంటి వారిని మఱి కొందఱిని మనస్సు నుండియే జనింప జేసెను. వారు నవబ్రాహ్మలు. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు ననువారు వారు. పురాణ ప్రసిద్ధులు. ఖ్యాతి, విభూతి, సంభూతి, క్షమప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, ప్రసూతి యను కన్యల గని వరుసగా మీరు భృగ్వాదులకు భార్యలు గండని వారి కొసంగెను. వీరికి మున్ను బుట్టిన సనందనాదులు మానస పుత్రులు లోకము లందు సక్తులు గాక సంతానము నందు నిరపేక్ష లయిరి. అందఱు జ్ఞానులు విరక్తులు విమత్సరులునై లోక సృష్టికి విముఖులయి యున్నంత బ్రహ్మకు ముల్లోకములను దహింప గల క్రోధము పుట్టెను. ఆయన క్రోధ జ్వాలల వలన ముల్లోక ముద్దీపిత మయ్యెను. కోపముచే ముడివడిన కనుబొమ్మలతో గూడిన యాయన లలాటము నుండి (నుదుటి నుండి) మధ్యాహ్న సూర్యునట్లు ప్రకాశించు రుద్రుడు పుట్టెను. ఆ మూర్తి సగము స్త్రీ, సగము పురుషుడునై ప్రచండుడై యున్న నాతనిని గని బ్రహ్మ నిన్ను నీవు విభజించు కొనుమని చెప్పి (నీవే అనేక రూపముల రూపొందుము. సృష్టి పెంపుము అని) యంతర్ధాన మయ్యెను.

బ్రహ్మణోఽభూన్మహాన్ క్రోధస్త్రైలోక్యదహనక్షమః।

తస్య క్రోధసముద్భూతజ్వాలామాలాభిదీపితమ్॥

బ్రాహ్మణోఽభూత్తదాసర్వం త్రైలోక్యమఖిలంమునే॥

భ్రురుకుటీకుటిలాత్తస్యలలాటాత్క్రోధదీపితాత్।

సముత్పన్నస్తదారుద్రో మధ్యాహ్నారక సమప్రభః॥

అర్ధనారీ నరవపుః ప్రచండోతి శరీరవాన్।

విభజాత్మానమిత్యుక్త్వాతంబ్రహ్మాఽన్తర్ధదేతతః॥

తథోక్తోఽసౌద్విధాస్త్రీత్వం పురుషత్వంతథాఽకరోత్।

బిభేదపురుషత్వంచదశధాచై కథా చసః॥

సౌమ్యాసౌమ్యైస్తథాశాన్తాశాన్తైస్త్రీత్వంచసప్రభుః।

బిభేదబహుదాదేవస్స్వరూపైరసితైస్సితైః॥

తతోబ్రహ్మాత్మసంభూతం పూర్వంస్వాయంభువం ప్రభుమ్।

ఆత్మానమేవకృతవాన్ ప్రాజాపత్యేమానుంద్విజః॥

శతరూపామ్చాతాంనారీం తపోనిర్దూతకల్మషామ్।

స్వాయంభువో మనుర్దేవః పత్నీత్వేజగృహేవిభుః॥

తస్మాశ్చపురుషాద్దేవీశతరూపావ్యజాయత।

ప్రియవ్రతోత్తనపాదౌప్రసూత్యాకూతిసంజ్ఞితమ్॥

కన్యాద్వయంచ ధర్మజ్ఞరూపౌదార్య గుణాన్వితమ్।

దదౌప్రసూతిందక్షాయ ఆకూతింరుచయేపురా॥

ప్రజాపతిస్సజగ్రహతయోర్జత్ఞేసదక్షిణః।

పుత్రోయజ్ఞో మహాభాగాదమ్పత్యోమిన్ థునంతతః॥

యజ్ఞస్యదక్షిణాయంతు పుత్రాద్వాదశ జజ్ఞిరే।

యామాఇతిసమాఖ్యాతా దేవాస్స్వాయంభువే మనౌ॥

ఆ రుద్రుడు స్త్రీని పురుషునిగా తను రూపందించు కొనెను. ఆ పురుష రూపమును మఱల పదునోకండుగా విడదీసెను. స్త్రీత్వమును గూడ సౌమ్యము (శాంతము) అసౌమ్యము రౌద్రముగా నలుపుగా తెలుపుగా ఛేదింప చేసెను. ఆ మీద బ్రహ్మ తనకు మొదటగా బుట్టిన స్వాయంభువ ప్రభువును దానేయైన వానిని ప్రజాపతి స్థానము నందుంచెను. ఆయన తపస్సుచే కల్మషము వాసిన శత రూపయను నంగనను భార్యగా స్వీకరించెను. అతని వలన శత రూపయను నామె ప్రియవ్రతో త్తానపాదు లను పుత్రులను బ్రసూతి ఆకూతి యను నిద్దరు కూతుండ్రను గనెను. ఆ కన్యలు రూపోదార్యాది గుణ సంపన్నులు. స్వాయంభువ మనువు ప్రసూతిని దక్షునకు ఆకూతిని రుచియను నాతని కిచ్చెను. ఆ రుచి ప్రజాపతి యాకూతిం గ్రహించెను. ఆ దంపతులకు యజ్ఞుడు దక్షిణ అను మిధునము (స్త్రీ పుంస యుగ్మము) జనించె, యజ్ఞునికి దక్షిణ యందు బండ్రెండుగురు కొడుకులు పుట్టిరి.

ప్రసూత్యాంచతథాదక్షశ్చతస్రోవింశాతింతథా।

ససర్జకన్యాస్తాసాం తుసమ్యనాఙ్నామానిమేశృణు॥

శ్రద్ధాలక్ష్మిః ధృతి స్తుష్టిః పుష్టిర్మేధా క్రియాతథా।

బుద్ది ర్లజ్జా వపుశ్శాన్తిః సిద్ధిః కీర్తి స్త్రయోదశీ॥

పత్న్యర్ధంప్రతిజగ్రాహధర్మో దాక్షాయణీః ప్రభుః।

తాభ్యష్మిష్టాయ వీయస్యః ఏకాదశ సులోచనాః॥

ఖ్యాతి స్సత్యతసంభూతిః స్మృతిః ప్రీతిః క్షమాతథా।

సన్నతిశ్చానసూయాచూర్జా స్వాహా స్వధాతథా॥

భృగుర్భవోమరీచిశ్చతథాచై వాఙ్గిరామునిః।

పులస్త్యః పులహశ్చైవ క్రతుశ్చర్షివరాస్తథా॥

ఆత్రి ర్వాసిష్టో వహ్నిశ్చ పితరశ్చా యథాక్రమమ్।

ఖ్యాత్యాద్యాజగృహుః కన్యామునయో మునిసత్తమ॥

శ్రద్ధా కామంచలా దర్పనియ మంధృతిరాత్మజమ్।

సంతోషంచాతథాతుష్టిర్లోభంపుష్టిరాసూయత॥

మేధాశ్రుతంక్రియాదణ్డంనయంవినయమేవచ॥

బోధంబుద్దిస్తథాలజ్జావినయంవపురాత్మజమ్।

వ్యవసాయం ప్రజజ్ఞేవైక్షేమంశాన్తిరాసూయత॥

సాయంభువ మన్వంతర మందు వారు యాములు అను దేవతలుగా బ్రసిద్ధి కెక్కిరి. దక్షుడు ప్రసూతి యందిరువది నల్గురు కూతుండ్ర గనెను. వారి పేర్లు విను. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి ఈ పదుముగ్గురను దాక్షాయణులను(దక్షకుమారిక లను) ధర్ముడు స్వీకరించెను. వారి తరువాతి వారు పదు

 నోకండుగురు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహా, స్వధా అను వారు. వారిని వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, వహ్ని, పితృ దేవతలు భార్యలనుగా గ్రహించిరి. శ్రద్ధ కాముని చలా(లక్ష్మి) దర్పుని ధృతి నియముని తుష్టి సంతోషుని పుష్టి లోభుని మేధ శ్రుతుని క్రియ దండుని నయుని వినయుని బుద్ది భోధుని లజ్జా వినయుని వపువు వ్యవసాయుని శాంతి క్షేముని గనిరి.

సుఖంసిద్దిర్యశః కీర్తిరిత్యేధర్మసూనవః।

కామాద్రతిస్సుతంహ ర్షధర్మపౌత్రమసూయత॥

హింసాభార్యత్వధర్మస్యతయోర్జజ్ఞేతథానృతమ్।

కన్యాచనికృతిస్తాభ్యాం మాయాజజ్ఞేచవేదనా॥

మాయాచవేదనాచైవ మితునంత్విదమేతయోః।

తయోర్జజ్ఞేఽథవై మాయా మృత్యంభూతాపహారిణమ్॥

వేదనాస్వసుతం చాపిదుఃఖంజజ్ఞేథరౌరవాత్।

మృత్యోర్ వ్యాది జరా శోక తృష్ణా క్రోధశ్చా జజ్ఞిరే॥

దుఃఖోత్తరా స్మృతాహ్యేతా సర్వేఛా ధర్మ లక్షణాః।

నైసాంభార్యాస్తిపుత్రోవా తేసర్వేహ్యుర్ ధ్వరేతసః॥

రౌద్రణ్యేతానిరూపాణి విష్ణోర్మునివరాత్మజ।

నిత్యప్రలయ హేతుత్వంజగతోస్య ప్రయాన్తివై॥

దక్షోమరీచిరత్రిశ్చ భృగుశ్చాద్యాః ప్రజేశ్వరాః।

జగత్యత్ర మహాభాగ నిత్యసర్గస్య హేతవః॥

మననోమను పుత్రశ్చ భూపావీర్యధనాశ్చయే।

సన్మార్గాభిరతాశ్శూరస్తేనిత్యస్థితికారిణః॥

ధర్ముని కొడుకులు సుఖము సిద్ధి యశుడు కీర్తి అనువారు. కాముని వలన రతి హర్షుడను కొడుకుం గాంచె. అతడు ధర్ముని పౌత్రుడు (కొడుకు కొడుకు) ఆ ధర్ముని భార్య హింస. వారి కొడుకు అనృతుడు. కూతురు మాయావేదన. వేదన రౌరవుని వలన దుఃఖముం గనెను. మాయ భూతముల నెల్ల హరించు మృత్యువుం గనెను. మృత్యువు వలన వ్యాధి జర (ముదిమి) శోక తృష్ణ క్రోధులు జనించిరి. దుఃఖముతో గూడ వీరందరు నధర్మ లక్షణులు. వీరికి భార్య పుత్రుడునను వారు లేరు. అందఱును ఊర్ధ్వ రేతసులు, అనగా సంతానముం గనుటకు బూనుకోనని వారన్న మాట. వీరు విష్ణువు యొక్క రౌద్ర రూపములు. వీరు నిత్యమును జగత్ప్రళయ మునకు హేతువులగు చుందురు. దక్షుడు మరీచి అత్రి భృగువు మొదలయిన ప్రజాపతులు సన్మార్గ రతులు శూరులు వారందరు స్థితి కారకులు.

శ్రీమైత్రేయుడు:

యేయంనిత్యస్థితిర్ బ్రహ్మన్ నిత్యసర్గస్తథేరితః।

నిత్యాభావశ్చతేషాం వై స్వరూపం మమ కథ్యతామ్॥

శ్రీమైత్రేయుడు:

నిత్య స్థితి, నిత్య సర్గము, నిత్యాభావము, నిత్య ప్రళయము నను వాని స్వరూపము నానతిమ్మన

శ్రీపరాశరుడు:

సర్గస్థితివినాశాంశ్చభగవాన్ మధుసూదనః।

తైస్తైరూపైరచిన్త్యాత్మాకరోత్యవ్యాహతోవిభుః॥

నైమిత్తికః ప్రాకృత్తికః తథై వాత్యన్తికోద్విజ।

నిత్యశ్చసర్వభూతానాం ప్రలయోయంచతుర్విదః॥

బ్రాహ్మోనైమిత్తికస్తత్రయచ్చేతేజగతీపతిః।

ప్రయాతిప్రాకృతశ్చైవబ్రహ్మాణ్డం ప్రకృతౌ లయమ్॥

జ్ఞానాదాత్యన్తికః ప్రోక్తోయోగినః పరమాత్మని।

నిత్యస్సదై వజాతానాం యోవినాశోదివానిశమ్॥

ప్రసూతిః ప్రకృతేర్వాతుసాసృష్టిః ప్రాకృతాస్మృతా।

దైనందినీతథాప్రోక్తాయా పురాణార్ థవిచక్షణైః॥

ఏవంసర్వ శరీరేషు భగవాన్ భూతభావనః।

సంస్థితః కురుతే విష్ణురుత్పత్తి స్థితి సంయమాన్॥

సృష్టిస్థితి వినాశానాంశక్తయ స్సర్వదేహిషు।

వైష్ణవ్యః పరివర్తన్తేమైత్రేయా హర్నిశంసమాః॥

గుణత్రయమయం హ్యేతద్బ్రహ్మాన్ శక్తిత్రయం మహత్।

యోఽతియాతి నయాత్యేవ చిరంనావర్తన్ తేపునః॥

శ్రీపరాశరుడు:

హరి సృష్టి స్థితి లయముల నాయా రూపముల దాల్చి అవ్యాహతముగా జరుపును. ప్రళయము నాల్గు విధములు. బ్రహ్మ ప్రళయము నైమిత్తికముబ్రహ్మ కల్పాంత మన్నమాట) అపుడు విష్ణువు నిద్రించును. ప్రకృతి యందు (మాయమయి) జగత్తు లయించుట ప్రళయము. యోగి పరమాత్మ యందు లయించుట ఆత్యన్తిక ప్రళయము. పగలు రాత్రి జీవులు పొందు నిద్ర నిత్య ప్రళయము. ప్రకృతి యందు జీవుల పుట్టుక ప్రాకృత సృష్టి. దైనందిన సృష్టి యనగా భూతములు దిన దినమును బుట్టుట, నిద్ర నుంచి లేచుట. జాగరణ స్థితి యన్నమాట. దానినే పురాణ వేత్తలు నిత్య సర్గమందురు. ఇట్లు భగవంతుడు సర్వ శరీరము లందును సంస్టితిని (ఉనికిని) పొంది యుత్పత్తి స్థితి లయముల నొనరించు చుండును. సృష్టి స్థితి వినాశానముల యొక్క శక్తులు విష్ణు కృతములు సర్వదేహము లందును రాత్రిం దినములు సమస్థాయిలో జరుగు చుండును. ఈ శక్తి త్రయము. సత్త్వ రజ స్తమో గుణమయము. ఇది యొక తరి అతిక్రమించి నడుచును. ఒక్కపుడు నడువనే నడవదు. ఒకపుడు పునరావృత్తమును గాదు.