గయా మాహాత్మ్యము - 4

నారదుడు ఇట్లు అనెను:

“ఆదిగదాధరుడు వ్యక్తస్వరూపముతో ఎట్లున్నాడు? వ్యక్త స్వరూపముతో వ్యక్తా వ్యక్తాత్మగా ఎట్లుండెను? అది గదాధరుడు అయినందులకు కారణమైన ఆ మొదటి గద ఎట్లు పుట్టినది? విష్ణువుయొక్క రూపము సర్వపాపక్షయకరమైన గదతో ప్రకాశించునది ఎట్లు అయ్యెను?”

సనత్కుమారుడు ఇట్లు అనెను:

వజ్రమునకన్న మించిన వజ్రమై బలిష్టుడైన గదుడను అసురుడు ఉండెను. ఆతడు పూర్వము భయంకరమైన తపముచే బ్రహ్మనుండి వరమును పొంది బ్రహ్మకోరగా త్యజింపరాని తన శరీరము యొక్క ఎముకను ఇచ్చెను. బ్రహ్మ చెప్పగా విశ్వకర్మకూడ దానిని అద్భుతమైన గదనుగా చేసెను. ఆ ఎముకను వజ్రములవంటి కుందములచే (మల్లెమొగ్గలచే) అలంకరింపబడిన దానిని స్వర్గమున విష్ణువు ధరించెను. తరువాత, స్వాయంభువ మన్వంతరమున చాల కాలమునకు బ్రహ్మపుత్రుడైన హేతిఅను రాక్షసుడు మిక్కిలి భయంకరమైన తపముచేసెను. లక్ష దివ్యసంవత్సరములు వాయువును మాత్రము తినెను. పైకెత్తిన ముఖముగలవాడై, చేతులు పైకెత్తి, ఒకే కాలి బొటన వ్రేలిపై నిలబడెను. జారిపడిన ఆకులను, గాలిని మాత్రము తిని ఏకాగ్రచిత్తుడై తపము చేసెను. తపముచే సంతుష్టులై వరప్రదులైన బ్రహ్మాదులనుండి “దేవతలచేత, దైత్యులచేత, శస్త్రాస్త్రములచేత, వివిధ మనుజాదులచేత కృష్ణ- ఈశానాదుల చేతను వధింపరాని వాడనై నేను మహాబలుడను కావలెను” అని వరము కోరెను. బ్రహ్మాది దేవతలు అట్లే అగుగాక అని అంతర్ధానమైరి. ఆ తరువాత హేతిరాక్షసుడు దేవతలను జయించెను. తానే ఇంద్రత్వమును నిర్వహించెను. బ్రహ్మ-హరుడు మొదలగు వారు భయము చెందిరి. వారు హరిని శరణుబొందిరి. హేతి రాక్షసుని చంపుమనిరి. అనగనే “హరి ఓ దేవతలారా! ఈ హేతిరాక్షసుడు దేవాసురులతో గూడ చంపుటకు అలవికాని వాడు. మీరు నాకు మహాస్త్రము నీయుడు. దానితో హేతిరాక్షసుని చంపెను అనెను. అనగనే దేవతలు ఆ గదను హరికిచ్చిరి. దేవతలు చెప్పగా ఆ గదను మొదట ధరించి హరి గదాధరుడయ్యెను. ఆ గదతో హేతి రాక్షసుని వధించి దేవతలతో స్వర్గమునకు వెళ్లెను. శిలయందు గదను నిలిపి గయాసురుని నిశ్చలునిగా జేసెను. దీనివలన హరి ఆదిగదాధరుడు అయ్యెను. ఆదిగదాధరుడు శిలయందలి పర్వత రూపమున వ్యక్తుడు అయ్యెను. ఈ శిల ముండపృష్ఠాద్రి అయినది. అది ప్రభాసమను పర్వతము. ఉద్యంతము, గీత నాదము, భస్మ కూటము, మహాగిరి, గృధ్ర కూటము, ప్రేత కూటము, ఆదిపాలము, అరవిందకము, పంచలోకము, సప్తలోకము, వైకుంఠము, లోహదండకము, క్రౌంచపాదము, అక్షయవటము, ఫల్గుతీర్థము, మధు శ్రవము, దధికుల్య, మధుకుల్య, దేవిక, మహానది, వైతరణి- మొదలగు పర్వత, క్షేత్ర, నదీ రూపములతో ఆదిగదాధరుడు వ్యక్తుడు. విష్ణుపదము, రుద్రపదము, ఉత్తమ బ్రహ్మ పదము, రెండు హస్తములు వెలికి వచ్చిన దివ్యకాశ్యప పదము. పంచాగ్నుల పదములు, తరువాత ఇంద్ర అగస్త్య పదములు, రవి యొక్కయు, కార్తికేయుని (కుమారస్వామి) యొక్కయు, క్రౌంచ-మాతంగుల యొక్కయు పదములు, ఈ సమస్త ముఖ్య చిహ్నములన్నింటి రూపమున హరి వ్యక్తావ్యక్తాత్మతో నున్న అద్యగదాధరుడు గూడ వ్యక్తుడై శ్రీమంతుడైన గదాధరుడు. గాయత్రి, సావిత్రి, సంధ్య, సరస్వతి, గయాదిత్యుడు, ఉత్తరార్కుడు, దక్షిణార్కుడు, నైమిషుడు, శ్వేతార్కుడు, గణనాథుడు, అష్టవసువులు, మునీ శ్వరులును, పదునొకండు రుద్రులు, అట్లే సప్తర్షులు, సోమనాథుడు, సిద్ధేశుడు, వినాయకుడు, నారాయణుడు, మహాలక్ష్మీ, బ్రహ్మ, శ్రీ పురుషోత్తముడు, మార్కండేయేశుడు, కౌటీశుడు, అంగిరేశుడు, పితామహుడు (బ్రహ్మ), జనార్దనుడు, మంగళ, ఉత్తముడైన పుండరీకాక్షుడు. ఈ మొదలగు వ్యక్తరూపమున కూడ ఆదిగదాధరుడు అచ్చట ఉన్నవాడు. హేతియను ఆ రాక్షసుడు చంపబడగా, విష్ణువు తన పురమునకు వెళ్లెను. బ్రహ్మతో బాటు రుద్రాదులతో గయాసురుడు నిశ్చలుడుగా చేయబడగా బ్రహ్మ హర్షముతో సుఖించినవాడై అద్యగదాధరుని సంతసింప చేసెను.

బ్రహ్మ ఇట్లు అనెను:

“గదను ధరించినవాడు, కాలునకు సంబంధించిన పాపములు లేనివాడు, గయలో నున్నవాడు, తెలియబడిన సర్వగుణములు గలవాడు, గుణాదులలో ఉన్నవాడు, బుద్ధిలో ఉన్నవాడు, పర్వతశ్రేష్ఠము యొక్క తెల్లని గృహమున ఉన్నవాడు, గణములతో నర్చింపబడినవాడు, వరమునిచ్చువాడునైన విష్ణువునకు నమస్కరింతును. పగటికి శోభ యైనవాడు, దేవ గణములకు ఆది తేజము, భవుని తేజము, రాక్షసులను చీల్చు తేజము, కలిసంపదయైనవాడు, కలిమలమును మర్దించు తేజము, ఆశ్రయించిన వారికి సంపత్స్వరూపుడునైన గదాధరునికి నమస్కరింతును. గట్టిదాని కంటే గట్టియైనవాడు, ఏలికలు అందరితో స్తుతింపబడినవాడు, అద్యగుడు, దృఢమైన పాపాదులు చెందనివాడు, స్వాత్మను పొందినవాడు, బలిష్ఠమైన గోత్రము-సూక్తియు-కాంతియు కలవాడు. దేహము లేనివాడు, కరణములు కళలు (అంశములు) లేనివాడు, జన్మలేనివాడు, సూర్యునితోను వేదములతోను అలంకరింపబడినవాడు, ధ్వనిముఖములేనివాడు, అనాదీశ్వరుడైన గదాధరునికి ఎల్లప్పుడు నమస్కరింతును. మనమునకు అతీతుడు, మతిగతులు (బుద్ధి- బుద్ధిచే తెలియబడునది) లేనివాడు, పరుడు, ఎల్లప్పుడును అద్వయుడు, బుధులచే వేదాంతములందు నుతింపబడినవాడు, చిదాత్మకుడు, కలిలోని కారణములకు మించిన వాడు-అట్టి హృదయవాసియైన గదాధరునకు నమస్కరింతును” అని స్తుతించగా,

సనత్కుమారుడు ఇట్లు అనెను:

దేవతలతోసహా బ్రహ్మచేత ఈ విధముగా స్తుతింపబడిన గదాధరుడు బ్రహ్మను వరము అడుగుమనెను. బ్రహ్మ వరమును అడిగెను. దేవరూపిణియైన శిలయందు నీవు లేక మేము ఉండలేము. వ్యక్తాదిరూపివైన నీతో పాటే నిత్యము ఉండెదము. ఇట్లే అగుగాక - అని గదాధరుడు లక్ష్మితోపాటు లోకముల రక్షించుటకును, జగములముక్తి కారణమునకును అచట శిలపైన ఉండెను. అపుడు పుండరీకాక్షుడు (కమలనేత్రుడు) జనార్దనుడు సువ్యక్తుడని పేరు పొందగలడు. వేదగమ్యమై ఆదిభూతమై, సనాతనమైన హరియొక్క మూర్తి పూర్వము శ్వేతవారాహకల్పమున వ్యక్తమై, వ్యక్తినిపొంది మరల సువ్యక్తముగాగలదు. లోకులను తరింపచేయుటకును, దేవతల రక్షణమునకును, గయా శిరమున సువ్యక్తుడవు అగుదువు. సంశయము లేదు. భక్తితో నెల్లప్పుడు గదాధరుని చూచినవారు కుష్ఠురోగాదులు పోయి హరిమందిరమును చేరుదురు. దేవుడైన ఆది గదాధరుని భక్తితో చూచినవారు, ధనమును, ధాన్యమును ఆయురారోగ్యములను పొందుదురు. శ్రద్ధతో గదాధరునికి నమస్కరించినవారు భార్యా పుత్ర పౌత్రాది గుణ కీర్తి సుఖములను, రాజ్యమును అనుభవించిన నరులును తమ పుణ్యఫలముగా ఎల్లప్పుడును బ్రహ్మ లోకమును పొందుదురు. అచట గంధ దానమున గంధాఢ్యుడగును. పుష్పదానమున సౌభాగ్యమునందును. ధూపదానమున రాజ్యమును పొందును. దీపదానమున తేజోదీప్తిని పొందును. ధ్వజదానమున పాపము నశించును. యాత్ర చేయువాడు బ్రహ్మలోకము నందును. శ్రాద్ధపిండము నిడువాడు పితరులను విష్ణువును చేర్చును. స్తోత్రముతో శ్రద్ధగా నాది గదాధరునకు నమస్కరించి పూజించినవాడు పితరులను విష్ణువును పొందించును. శివుడు సైతము ప్రీతితో ఆది గదాధరుని స్తుతించెను.

శివుడు ఇట్లు అనెను:

ముండపృష్ఠ పర్వతాది రూపమున ఫల్గు తీర్థాది రూపమునను అవ్యక్తరూపుడైన దేవుడగు ఆదిగదాధరునికి నమస్కరింతును. ముఖాది చిహ్నములుకల రూపముతో పద రూపమున వ్యక్తావ్యక్త రూపమున ఉన్న అదిగదాధరునికి నమస్కరింతును. అవ్యక్తరూపుడు అయిన దేవుడు జనార్దన స్వరూపమున ముండపృష్ఠాద్రి యందు స్వయముగా పుట్టిన ఆదిగదాధరునికి నమస్కరింతును. దేవరూపిణియైన శీలయందు బ్రహ్మాది దేవతలతోసహా ఉన్నవాడును, దేవతలచే పూజింపబడి సత్కృతుడైన గదాధరునికి నమస్కరించుచున్నాను. ఎవనిని శ్రాద్ధాదులలో చూచి, తరువాత బూజించి ప్రణమిల్లి, బ్రహ్మలోకమునందు ఉందురో, ఆ ఆదిగదాధరునికి నమస్కరింతును. మహదాది వ్యక్త జగత్తునకు ఒకేకారణుడై అవ్యక్త జ్ఞాన రూపుడైన ఆ అదిగదాధరునికి నమస్కరింతును. దేహ-ఇంద్రియ-మనస్- బుద్ధి-ప్రాణ-అహంకారములు లేనివాడును, జగమను స్వప్నము లేనివాడును అయిన ఆ ఆదిగదాధరునికి నమస్కరింతును. నిత్యానిత్యముల వదిలినవాడు, సత్యస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, అవ్యయుడు (నాశము లేనివాడు) అయి ఆది గదాధరునికి నమస్కరింతును.

సనత్కుమారుడు ఇట్లు అనెను:

ఈ విధముగ మహేశ్వరునితో స్తుతింపబడిన ఆది గదాధరుడు ప్రీతుడై బ్రహ్మాది దేవతలతో సహశిలయందు నిలిచెను. ముండపృష్ఠాద్రియందు నిలచిన దేవుడైన ఆదిగదాధరుని ఇచటస్తుతింతురు. పూజింతురు. వారు చివరకు బ్రహ్మ లోకమును చేరుదురు. అది గదాధరుని బూజించి, ధర్మార్థి ధర్మమునందును, ధనార్థి ధనము నందును, కామార్ధి కామమునందును, మోక్షార్ధి మోక్షమునందును ఆది గదాధరుని జూచి - గొడ్రాలు వేద పారగుడైన పుత్రుని పొందును. రాజు విజయము నందును, శూద్రుడు సుఖమునందును. పుత్రులు కోరినవారు పుత్రుల నందురు. హరియొక్క పూజాదులచే మనమున కోరినవి ఎల్లను సిద్ధించును.